వక్ఫ్ బిల్లు కమిటీ భేటీలో రచ్చ : చైర్మన్​ పైకి గాజు బాటిల్ విసిరిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ

వక్ఫ్ బిల్లు కమిటీ భేటీలో రచ్చ : చైర్మన్​ పైకి గాజు బాటిల్ విసిరిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ

న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) భేటీ రసాభాసగా మారింది. కమిటీ సభ్యుడు, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తన ముందున్న గ్లాస్ వాటర్ బాటిల్​ను పగులగొట్టి ప్యానెల్ చైర్మన్ జగదాంబికా పాల్ వైపు విసిరాడు. ఈ ఘటనలో బెనర్జీ వేళ్లకు గాయాలయ్యాయి. డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ చేసి నాలుగు కుట్లు వేశారు. 

బెనర్జీ వైఖరిని తీవ్రంగా పరిగణించిన కమిటీ.. సభ్యుల ఓటింగ్ ద్వారా అతనిపై ఒక రోజు పాటు సస్పెన్షన్ వేటు వేసింది. వక్ఫ్ (సవరణ) బిల్లులోని లోటు పాట్లు తెలుసుకునేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ మంగళవారం ఢిల్లీలో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్‌‌‌‌ అధ్యక్షతన భేటీ అయింది. ఈ సమావేశానికి సుప్రీం కోర్టు, ఆయా రాష్ట్రాల హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు, ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఒడిశాకు చెందిన రెండు ఆర్గనైజేషన్ల వాదనలు కమిటీ సభ్యులు వింటున్నారు. ఆర్గనైజేషన్లలో రిటైర్డ్ జడ్జిలు, అడ్వొకేట్లు ఉన్నారు. 

సవరణ బిల్లులో ప్రతిపక్ష సభ్యుల పాత్ర ఏంటని వాళ్లు ప్రశ్నించారు. దీంతో వెంటనే టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కల్గజేసుకున్నారు. అందరికీ మాట్లాడే అవకాశం ఉంటుందని, కూర్చోవాలని బెనర్జీని బీజేపీ నేత, కలకత్తా హైకోర్టు రిటైర్డ్ జడ్జి అభిజిత్  గంగోపాధ్యాయ సూచించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బంగ్లా లాంగ్వేజ్​లో ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. దీంతో వెంటనే ప్యానెల్ చైర్మన్ జగదాంబికా పాల్ కలగజేసుకున్నారు. ఇద్దరిని వారించే ప్రయత్నం చేశారు. 

ఎంతకీ వాళ్లు తగ్గలేదు. మరింత రెచ్చిపోయిన బెనర్జీ.. తన ముందున్న గాజు సీసాను పగులగొట్టి జగదాంబికా పాల్ చైర్ వైపు విసిరాడు. దీంతో బెనర్జీ చేతికి గాయాలయ్యాయి. డాక్టర్లు అతనికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. తర్వాత కొద్ది సేపటికి మళ్లీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ నేత సంజయ్ సింగ్​ను వెంటపెట్టుకుని బెనర్జీ సమావేశానికి హాజరయ్యాడు. బెనర్జీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టగా.. అతనికి వ్యతిరేకంగా 9, అనుకూలంగా 8 ఓట్లు పోలయ్యాయి. దీంతో బెనర్జీని ఒకరోజుపాటు కమిటీ భేటీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్యానెల్ చైర్మన్ జగదాంబికా పాల్ ప్రకటించారు.