సికింద్రాబాద్ : జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ప్రాంత విలీన ప్రక్రియలో భాగంగా ప్రత్యేక సర్కిల్ గా ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధికి రూ.25 వేల కోట్ల స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలని కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందజేయడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో అమలవుతున్న టౌన్ ప్లానింగ్ విధానాన్ని కూడా అమలు చేయాలని కోరారు.
18 ప్రధాన డిమాండ్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందజేశారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని, ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. విలీన అనంతరం కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ప్రత్యేక చొరవ తీసుకుని.. ముందుకు సాగాలని కోరారు. కంటోన్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.