జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా భీమారం మండలంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి సభ్యులు మృతదేహాంతో ఆందోళన చేపట్టారు. ఉపాధి కోసం గల్ఫ్వెళ్లిన కార్మికులను రాష్ర్ట ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గణేష్ అనే వ్యక్తి డెడ్ బాడీతో జగిత్యాల–నిజామాబాద్ రోడ్డుపై నిరసన తెలిపారు.
భీమారం మండలానికి చెందిన జూపాక గణేష్(36) ఉపాధి కోసం ఐదేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడి కంపెనీలో జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో చాలా దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. కనీసం తినడానికి తిండ దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాడు. ఈ క్రమంలోనే అనారోగ్యంతో రెండు నెలల క్రితం దుబాయ్ లోనే గణేష్ చనిపోయాడు.
గణేష్ బతికి ఉన్న సమయంలోనే అతడి పరిస్థితి గురించి వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రావుకు కుటుంబ సభ్యులు వివరించారు. తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరినా ఆయన పట్టించుకోలేదని గణేష్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
గణేష్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి సభ్యులు డిమాండ్చేశారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత దాదాపు 1500 మంది వరకూ చనిపోయినా వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. గల్ఫ్ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, ప్రతి ఏటా 500 కోట్లు కేటాయిస్తామని చెప్పి ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఉద్యోగాలు లేక బయటి దేశానికి వలసెళ్లి ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.