మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లాలో కుక్కల బెడద తీవ్రమయింది. వీధుల వెంబడి గుంపులు గుంపులుగా తిరుగుతూ దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిత్యం జిల్లాలో ఏదో ఒకచోట జనాలు కుక్క కాటుకు గురవుతున్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు రోజూ పదుల సంఖ్యలో కుక్క కాటు బాధితులు వస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ ఈ బాధితులు కనిపిస్తున్నారు. గతంలో మున్సిపాలిటీల్లో వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో ఏటేటా కుక్కల సంఖ్య రెట్టింపు అవుతోంది. రోజురోజుకు వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చుతోంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. డాగ్ పాపులేషన్ పెరగకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు నిర్వహించడం లేదు. అయితే ఇటీవలే మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని అండాళమ్మ కాలనీలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ పనులను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కుక్కలకు ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు నిర్వహించి తిరిగి అదే ప్రాంతంలో వదిలేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
మూడు వేలకు పైగా కేసులు....
జిల్లావ్యాప్తంగా ఏడాది కాలంలో 3వేల మందికి పైగా కుక్క కాటుకు గురైనట్లు అంచనా. ఒక్క గవర్నమెంట్జనరల్ హాస్పిటల్లోనే 1503 కేసులు నమోదయ్యాయి. మందమర్రిలో సోమవారం ఒక్క రోజే దాదాపు 15 మందిని కరిచాయి. రామకృష్ణాపూర్లోనూ స్వైరవిహారం చేశాయి. బెల్లంపల్లి మండలంలో మొన్న ఒకే రోజు11మంది కుక్క కాటుకు గురయ్యారు. జైపూర్ మండలంలో 13 మందిని కరిచాయి. ఇటీవల మంచిర్యాల సంజీవయ్య కాలనీలో ఇంటిముందు ఆడుకున్న బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. రెడ్డికాలనీలో రోడ్డుపై వెళ్తున్న ఓ వృద్ధురాలిపై దాడి చేసి కాలు పిక్కలను కొరికేశాయి. బాధితులకు పీహెచ్‌సీల్లో ప్రథమ చికిత్స చేస్తూ యాంటీ రేబిస్ ఇంజక్షన్లు వేస్తున్నారు. పెద్ద గాయాలు అయినా, ఒకే కుక్క ఇద్దరు ముగ్గురిని కరిచినా వారికి ఇంజక్షన్‌ను డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. ఆ ఇంజక్షన్ ఏరియా, జిల్లా హాస్పిటళ్లలోనే అందుబాటులో ఉండడంతో బాధితులను అక్కడికి రెఫర్ చేస్తున్నారు. ఇటీవల లక్సెట్టిపేటలో కుక్కకాటుతో తీవ్ర గాయాలైన ఏడుగురిని ఈ ఇంజక్షన్ కోసం జీజీహెచ్‌కు తరలించారు.
రేబిస్‌తో ఒకరి మృతి...
మూడు నెలల కిందట బెల్లంపల్లికి చెందిన యువకుడిని కుక్కలు కరిచాయి. అతడు వ్యాక్సిన్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు పోయాయి. పరిస్థితి విషమించిన తర్వాత కుటుంబసభ్యులు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఇక్కడినుంచి వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా బాధితుడు చనిపోయాడు. ఇతడు రేబిస్ వ్యాధికి గురైనట్టు అనుమానిస్తున్నారు.
భయపడి పరుగెత్తవద్దు....
రోడ్లపై కుక్కల గుంపు కనిపించినప్పుడు సాధారణంగా భయపడి పారిపోతుంటారు. దీంతో కుక్కలు వెంటపడి కరుస్తుంటాయి. కుక్కలు వెంటపడుతున్నప్పుడు భయంతో పరుగెత్తకుండా అక్కడే ఆగాలి. కుక్కల కళ్లలోకి నేరుగా చూస్తే అవి మరింత రెచ్చిపోతాయి కాబట్టి కిందకు చూస్తూ మెల్లగా నడవాలి. కర్రలు, రాళ్లతో దాడి చేయవద్దు. ముఖ్యంగా కుక్కలు పిల్లల రక్షణ కోసం మనుషులపై దాడులు చేస్తుంటాయి. అలాంటి వాటి జోలికి పోవద్దు. ఆహారం దొరకని సమయంలో, వాతావరణ పరిస్థితులు మారినప్పుడు కూడా ఒక రకమైన ఆందోళనతో దాడులకు పాల్పడుతాయి. కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలి. కుక్క కాటువేస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి.
- రమేశ్‌కుమార్, జిల్లా పశువైద్యాధికారి