- యూఎస్, చైనా బ్యాంకులతో పోటీ..
- నేటి నుంచి పనిచేయనున్న హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీన సంస్థ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్‌ల సరసన హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల విలీన సంస్థ చేరింది. శనివారం నుంచి విలీన సంస్థ పనిచేయనుండగా, జులై 13 న హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు మార్కెట్ నుంచి డీలిస్ట్ కానున్నాయి. కొత్త హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద బ్యాంక్‌గా మారనుంది. యూఎస్, చైనా బ్యాంకులకు ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదగనుంది. మార్కెట్ క్యాప్ ప్రకారం, గ్లోబల్‌గా టాప్ బ్యాంక్‌గా జేపీ మోర్గాన్ చేజ్ ఉంది. ఆ తర్వాత ప్లేస్‌లో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ – హెచ్‌డీఎఫ్‌సీ విలీన సంస్థ నాలుగో ప్లేస్‌కు చేరుకుంది. కిందటేడాది ఏప్రిల్ 4 న దేశ కార్పొరేట్ సెక్టార్‌లోనే అతిపెద్ద డీల్ కుదిరిన విషయం తెలిసిందే. హోమ్‌లోన్లను ఇచ్చే అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టేకోవర్ చేసింది. ఈ డీల్ విలువ 40 బిలియన్ డాలర్లు. ఈ రెండు సంస్థలు విలీనంతో 172 బిలియన్ డాలర్ల విలువైన బ్యాంక్ క్రియేట్ అయ్యింది ఈ బ్యాంక్ అసెట్ వాల్యూ రూ.18 లక్షల కోట్లు.
12 కోట్ల కస్టమర్లు..
హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేసుకున్న తర్వాత ఏర్పడిన కొత్త హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ శనివారం నుంచి పనిచేయనుంది. ఈ బ్యాంక్ కస్టమర్ల బేస్ 12 కోట్ల ఇండివిడ్యువల్స్. ఇది జర్మనీ మొత్తం జనాభా కంటే ఎక్కువ. అంతేకాకుండా కొత్త హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్ నెట్‌వర్క్ 8,300 కు పెరిగింది. ఉద్యోగుల సంఖ్య 1,77,000 కు చేరుకుంది. మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే, కొత్త హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సిటీ గ్రూప్, హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్ పీఎల్‌సీ వంటి టాప్ గ్లోబల్ బ్యాంకులను దాటేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి అతిపెద్ద డొమెస్టిక్ బ్యాంకులకు అందనంత ఎత్తుకు చేరుకుంది. ‘ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని బ్యాంకులు మాత్రమే ఇంత పెద్ద సైజ్‌లో ఉండి, ఇంకో నాలుగేళ్లలో రెండింతలు వృద్ధి సాధించే సత్తా ఉన్నవి’ అని మాకెరీ గ్రూప్ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సురేష్ గణపతి బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కొత్త హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడాదికి 18%–20 % వృద్ధి చెందుతుందని అన్నారు. బ్యాంక్ లాభాలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని, తన బ్రాంచ్ నెట్‌వర్క్‌ను డబుల్ చేసుకునే ప్లాన్‌లో ఉందని పేర్కొన్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్లు..
డిపాజిట్లను ఆకర్షించడంలో ఇతర బ్యాంకులను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధిగమిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేసుకోవడంతో బ్యాంక్ డిపాజిట్లు మరింత పెరుగుతాయి. ఇంకా హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లలో 70 శాతం మందికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అకౌంట్ లేదని అంచనా. దీంతో బ్యాంక్ కొత్త కస్టమర్లు భారీగా పెరగనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇన్వెస్టర్లు కూడా భారీగా ఉన్నారు. యూఎస్ బ్యాంక్ జేపీ మోర్గాన్ చేజ్ తర్వాత ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఉన్న బ్యాంక్‌గా హెచ్‌డీఎఫ్‌సీ నిలిచింది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల పెర్‌పెచ్యువల్ డాలర్ల నోట్ (బాండ్లు) లు ఈ ఏడాది ఇన్వెస్టర్లకు 3.1 శాతం రిటర్న్ ఇచ్చాయి. అదే గ్లోబల్ బ్యాంకులు మాత్రం సగటున 3.5 శాతం లాస్ నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 5 శాతం పెరిగాయి.
బ్యాంక్ భవిష్యత్‌పై ఆశతో రిటైర్ అవుతున్న..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు, గ్రూప్ కంపెనీలకు మధ్య సంబంధాలు మెర్జర్ తర్వాత మరింత బలపడతాయని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ శనివారం నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనం కానుండడంతో షేర్ హోల్డర్లకు కంపెనీ చైర్మన్‌గా తన చివరి మెసేజ్‌ను ఇచ్చారు. హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ కస్టమర్లకు ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లను అమ్మడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు వీలుంటుందని దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌తో ఈజీగా ఈ పనిచేయడానికి వీలుంటుందని చెప్పారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఉన్న అతిపెద్ద నెట్‌వర్క్‌తో హోమ్‌లోన్లను పెంచుకోవడమే కాకుండా, గ్రూప్ కంపెనీలకు ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. తాను రిటైర్ అయ్యే టైమ్ వచ్చిందని, బ్యాంక్ ఫ్యూచర్‌పై ఎక్సైటింగ్‌గా ఉన్నానని అన్నారు. హెచ్‌డీఎఫ్‌సీలో 46 ఏళ్లుగా పనిచేస్తున్న దీపక్ పరేఖ్, శుక్రవారం తన చివరి రోజని ప్రకటించారు. కాగా, డీల్ ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పూర్తిగా పబ్లిక్ షేర్ హోల్డర్ల చేతికి వెళ్లిపోతుంది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్ హోల్డర్లకు కొత్త బ్యాంక్‌లో 41 % వాటా దక్కుతుంది. ప్రతీ 25 హెచ్‌డీఎఫ్‌సీ షేర్లకు 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు దక్కుతాయి.