
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా నల్లని మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. ఆకాశం మేఘావృతమైంది. ఈ క్రమంలో రాష్ట్ర వాతావరణ శాఖ పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. రాబయే మూడు గంటల్లో వివిధ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే మూడు గంటల్లో రంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలో మోస్తారు వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలో వడగళ్ల వాన పడొచ్చని తెలిపింది.
ALSO READ | Rain Alert: తెలంగాణలో ఈ జిల్లాల్లో వడగండ్ల వాన..పిడుగులు పడే ఛాన్స్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 60 కిమీ వేగంగా ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని.. అత్యవసరమైతేనే వెళ్లాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అలర్ట్ అయ్యింది.
బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణ శాఖ ఈరోజు(మార్చి 22) 7 జిల్లాలకు ఆరెంజ్, 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజుతో పాటు వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలకు తగ్గు ముఖం పడతాయని, మళ్లీ మూడు రోజుల తర్వాత ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో శుక్రవారం పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్ల వాన అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే.