గ్రేటర్ లో సిల్ట్ నుంచి ఇసుక తీసేందుకు వాటర్ బోర్డు ప్లాన్

  • పరిశోధనలు చేసి నివేదిక ఇచ్చిన వాటర్​బోర్డు ఆఫీసర్​ 
  • గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన వాటర్​బోర్డు ఎండీ
  • సిల్ట్​ప్రాసెసింగ్​కు ముందుకొచ్చిన రెండు కంపెనీలు 
  • ఇసుకను ప్రభుత్వ పనులతో పాటు ప్రైవేటుకు అమ్ముకునే ఆలోచన 

హైదరాబాద్​సిటీ, వెలుగు : గ్రేటర్ పరిధిలో డ్రైనేజీల నుంచి తీసే సిల్ట్ నుంచి ఇసుకను వేరుచేయాలని మెట్రోవాటర్​బోర్డు భావిస్తోంది. ఆ ఇసుకను ప్రభుత్వ పనులకు వినియోగించాలని, అలాగే ప్రైవేట్​వ్యక్తులకు అమ్మి ఆదాయం పెంచుకోవచ్చని చూస్తోంది. సాధారణంగా డ్రైనేజీ నుంచి తీసిన పూడికలో బురద, చెత్త, చెదారంతో పాటు ఇసుక ఎక్కువగా ఉంటోంది. మ్యాన్​హోళ్ల వద్ద కుప్పలుగా పోసే ఈ వ్యర్థాన్ని ఎండిన తర్వాత  ఇసుకగా కనిపిస్తుంది. 

వెంటన తరలించకపోతే వారం రోజుల్లో తిరిగి అదంతా మళ్లీ డ్రైనేజీల్లోనే కలిసిపోతోంది. ఈ క్రమంలో సిల్ట్ ను ఇసుకగా మార్చే ప్రక్రియపై వాటర్​బోర్డు అధికారులు దృష్టి పెట్టారు. బోర్డుకు చెందిన ఓ ఉన్నతాధికారి పరిశోధనలు చేసి సిల్ట్​ను ఉపయోగించుకునే విధానంపై రిపోర్ట్​తయారు చేశాడు. విషయాన్ని బోర్డు ఎండీ అశోక్​రెడ్డి దృష్టికి తీసుకుపోగా ఆయన కొత్త ప్రక్రియకు గ్రీన్​సిగ్నల్​ఇచ్చారు. 

ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకుపోవాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో డ్రైనేజీల నుంచి వెలువడే సిల్ట్​ను నేరుగా అంబర్​పేట, అత్తాపూర్​తదితర ప్రాంతాల్లోని బోర్డు స్థలాల్లోనే నిల్వ చేయనున్నారు. 

రోజుకు 15 లారీల సిల్ట్​

గ్రేటర్​పరిధిలో దాదాపు 45 చదరపు కిలోమీటర్ల డ్రైనేజీ లైన్లు విస్తరించి ఉండగా, 3లక్షల వరకూ మ్యాన్​హోల్స్ ఉన్నాయి. 30 ఏండ్లుగా గ్రేటర్​పరిధిలోని డ్రైనేజీ లైన్లను భారీ ఎత్తున డీసిల్టింగ్​చేసింది లేదు. ప్రస్తుతం వాటర్​బోర్డు 90 రోజుల స్పెషల్ డ్రైవ్​కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 60 వేలకు పైగా మ్యాన్​హోళ్ల డీసిల్టింగ్​పనులు పూర్తి చేయగా టన్నుల కొద్దీ సిల్ట్ బయటకు వచ్చింది. లక్ష మ్యాన్​హోళ్లను క్లీన్​చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, ప్రతి రోజూ వందల సంఖ్యలో డ్రైనేజీల్లో డీసిల్టింగ్​పనులు చేస్తున్నారు. ట్రంక్​మెయిన్​ల నుంచి కూడా భారీగానే ఇసుక వస్తోంది. 

ఇదంతా కలిపి రోజుకు సుమారు 15 లారీలు ఉంటోందని తెలుస్తోంది. దీన్ని సిల్ట్​కార్టింగ్​వాహనాల్లో అంబర్​పేట ఎస్టీపీ ప్రాంగణం, అత్తాపూర్​లోని బోర్డుకు చెందిన ప్రాంతానికి తరలించి నిల్వ చేస్తున్నారు. సిల్ట్​నుంచి ఇసుకను ప్రాసెస్​ చేసేందుకు రెండు కంపెనీలు ముందుకు వచ్చాయని, వారికి పనులు అప్పగించే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.  

ఇసుక క్వాలిటీకి ఢోకా లేదు..

డ్రైనేజీల నుంచి తీసే సిల్ట్​లో 90 శాతం ఇసుక రేణువులే ఉంటున్నాయి. సిల్ట్​ను ప్రాసెస్​చేయడంతో రోజుకు కనీసం 150 నుంచి 200 టన్నుల ఇసుక వచ్చే అవకాశం ఉందని వాటర్​బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఇసుక రంగు నల్లగా ఉంటుందని, నాణ్యతలో ఎలాంటి తేడా ఉండదని చెబుతున్నారు. ప్రభుత్వ సంస్థలు, బల్దియా, వాటర్​బోర్డు, ఎలక్ట్రిసిటీ సంస్థలు చేపట్టే నిర్మాణ పనుల్లో వినియోగించుకోవచ్చని

ప్రస్తుతం ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సిల్ట్​నుంచి తీసే ఇసుకను వినియోగించుకునేందుకు నిర్మాణదారులు ఆసక్తి చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఎవరైనా ఇసుక కొనడానికి ఆసక్తి కనబరిస్తే సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 

టైల్స్​ తయారు చేయొచ్చు

మ్యాన్​హోళ్ల నుంచి తీసే సిల్ట్​ను ప్రాసెస్ చేయగా వచ్చే ఇసుకతో టైల్స్ తయారు చేయవచ్చని వాటర్​బోర్డులోని ఓ అధికారి తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్రయోగం చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫుట్​పాత్​లపై వేసే రఫ్​టైల్స్​కు బ్లాక్​సాండ్​వాడతారు. కొన్ని కంపెనీలు సిల్ట్​నుంచి వచ్చే ఇసుకతోనూ టైల్స్​తయారు చేస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ అలాంటి కంపెనీ ఏదైనా ముందుకు వస్తే వారికి పనులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.