యాదాద్రి, వెలుగు : టెస్ట్ మిల్లింగ్ చేసిన రిపోర్ట్ వచ్చిన తర్వాతే యాసంగి వడ్ల మిల్లింగ్ స్టార్ట్ చేస్తామని మిల్లర్లు తేల్చి చెప్పారు. రా రైస్ సాధ్యం కాదని చెప్పినా వినకుండా మిల్లింగ్ చేయమంటే ఎలా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా యాదాద్రి కలెక్టరేట్లో గురువారం యాసంగి వడ్ల సేకరణపై సీఎంఆర్మిల్లర్లతో కలెక్టర్ పమేలా సత్పతి రివ్యూ చేశారు. పలువురు మిల్లర్లు తమ సమస్యలను లేవనెత్తి వాటిని పరిష్కరించాలని కోరారు. గతేడాది క్వింటాల్ వడ్లకు నూక, బియ్యం కలిపి శాతం ఎంత వస్తుందో ‘టెస్ట్ మిల్లింగ్’ చేసినా ఇప్పటి వరకూ రిపోర్ట్ వెల్లడించని విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో పేర్కొన్న విధంగా మిల్లింగ్‌లో రా రైస్ 67 శాతం, బాయిల్డ్ 68 శాతం నూకతో కలిపి బియ్యం రావల్సి ఉందని, వాస్తవానికి తక్కువగా రావడం వల్ల తాము నష్టపోతున్నామని వివరించారు. ఈ సీజన్లో రైతులు హైబ్రిడ్ రకాలను సాగు చేసినందున మొత్తం కామన్ కేటగిరిలోనే వడ్ల సేకరణ చేయాలని కోరారు. జిల్లాలో మూసి పరివాహక ప్రాంతంలో సాగు చేసే వరి ‘రా రైస్’ చేయలేమని చెప్పినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని తెలిపారు. మిల్లింగ్ తర్వాత రైస్rawను డెలివరీ చేయడానికి చివరకు గోడౌన్లు కూడా సరిగా ఇవ్వడం లేదని తెలిపారు. ఐదేండ్లుగా పాత బ్యాగులనే ఇస్తుండడంతో 25 శాతం నష్టం జరుగుతోందని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మిల్లింగ్ వ్యవస్థను కాపాడడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఖరీఫ్ సీజన్లో నూక శాతం ఎక్కువగా ఉంటున్నందున లక్ష టన్నుల ధాన్యం ఎక్కువగా ఇవ్వాలని మిల్లర్లు కోరారు. కాగా యాసంగిలో సేకరించిన వడ్లను వెంటవెంటనే మిల్లుల్లో అన్లోడ్ చేసుకోవాలని మిల్లర్లను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లను బ్లాక్ లీస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. గత ఖరీఫ్, యాసంగిలో సీఎంఆర్ సాధించి స్టేట్‌లో రెండో స్థానంలో నిలిచినందుకు మిల్లర్లను కలెక్టర్ అభినందించారు. మీటింగ్‌లో అడిషనల్ కలెక్టర్ డీ శ్రీనివాసరెడ్డి, డీఆర్డీవో ఉపేందర్ రెడ్డి, సిలిల్ సప్లయ్ డీఎం గోపీకృష్ణ, డీఏవో అనురాధ, మార్కెటింగ్ ఆఫీసర్ సబిత, డీఎస్‌సీవో శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మిల్లర్ల సంఘం కార్యదర్శి పసునూరి నాగభూషణం, కోశాధికారి వెంకటేశం, ప్రతినిధులు, ఆఫీసర్లు ఉన్నారు.