కాశ్మీర్​లో మైనస్ టెంపరేచర్.. శ్రీనగర్‌లో ఈ సీజన్​లోనే అతితక్కువ టెంపరేచర్ రికార్డు

కాశ్మీర్​లో మైనస్ టెంపరేచర్.. శ్రీనగర్‌లో ఈ సీజన్​లోనే అతితక్కువ టెంపరేచర్ రికార్డు

శ్రీనగర్: కాశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మైనస్​-సున్నా డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నాయి. శ్రీనగర్ లో కనిష్ట ఉష్ణోగ్రత ఈ సీజన్​లోనే అతితక్కువ రికార్డ్​అయింది. గురువారం రాత్రి అత్యల్పంగా మైనస్ 0.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. శుక్రవారం మైనస్ 1.2 డిగ్రీల సెల్సియస్ రికార్డ్​అయిందని అధికారులు తెలిపారు. అలాగే, రాత్రి ఉష్ణోగ్రత 1.3 డిగ్రీల సెల్సియస్ నమోదైందని, ఇది ఈ సంవత్సరంలో సాధారణం కంటే తక్కువగా అని పేర్కొన్నారు. కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలు వరుసగా మూడో రోజూ జీరోకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.

 ఖాజిగుండ్‌లో మైనస్ 1.4 డిగ్రీల సెల్సియస్, పహల్గామ్‌లో మైనస్ 2.3, స్కీయింగ్‌కు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతమైన గుల్‌మార్గ్‌లో మైనస్ 0.6, కుప్వారాలో మైనస్ 0.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డ్​అయింది. కాశ్మీర్​లోయలోని ఏకైక వాతావరణ కేంద్రం ఉన్న దక్షిణ కాశ్మీర్‌లోని కోకెర్‌నాగ్ లో 0.4 డిగ్రీల సెల్సియస్ వద్ద గడ్డకట్టే స్థాయిలో చలి ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే, జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

 రాబోయే రెండు రోజుల్లో, ముఖ్యంగా కాశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు లేదా మంచు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. గత వారం కాశ్మీర్‌లోని ఎత్తైన చాలా ప్రాంతాలలో మంచు కురిసిందని, దాని కారణంగానే కాశ్మీర్​లోయ అంతటా ఈ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు వెల్లడించారు.