
- జేసీబీలతో కట్టను తొలగించి పదెకరాలు కబ్జా
- రూ.24 లక్షలతో పునరుద్ధరించిన గత ప్రభుత్వం
- అప్పట్లో పట్టా భూమిలో కట్ట పోసుకున్నమని ఇప్పుడు తొలగించామంటున్న కబ్జాదారులు
- పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లు
చెన్నూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కాంబోజీపేట శివారులోని టేకులకుంటను అక్రమార్కులు మాయం చేశారు. రాత్రికి రాత్రే కట్టను జేసీబీలతో తవ్వి చెరువును పూడ్చి ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. ఇంత జరిగినా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంబోజీపేట శివారులో 9.32 ఎకరాల విస్తీర్ణంలో టేకులకుంట చెరువు ఉంది. దీని కింద 55 ఎకరాల ఆయకట్టు సాగయ్యేది. గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో ఈ చెరువును పునరుద్ధరించింది.
2017లో రూ.24.40 లక్షలతో చెరువు కట్టను పటిష్టం చేయడంతో పాటు తూములు ఏర్పాటు చేసి మత్తడి నిర్మించింది. ఇటీవల భూములకు రేట్లు పెరగడంతో ఆయకట్టు రైతులు కొందరు చెరువుపై కన్నేశారు. 400 వందల మీటర్ల పొడవున్న చెరువు కట్టను రాత్రికి రాత్రి జేసీబీలు, ట్రాక్టర్లు పెట్టి 90 శాతం తొలగించారు. సర్వే నంబర్ 88 /ఆలో ఉన్న సుమారు 9.32 ఎకరాల శిఖం భూమిని వారి భూముల్లో కలిపేసుకున్నారు.
మా పట్టా భూమిలో పోసుకున్నదే....
విషయం తెలుసుకున్న ఇరిగేషన్ఆఫీసర్లు చెరువు దగ్గరికి వెళ్లగా అక్కడి రైతులు ‘ఇది గతంలో మా పట్టా భూమిలో పోసుకున్న చెరువు. మాదే కాబట్టి మేము ఈ కట్టను పూర్తిగా తొలగించేసుకున్నాం’ అని సమాధానమిచ్చారు. దీంతో ఖంగుతున్న అధికారులు ‘ఈ చెరువు ప్రభుత్వ ఆధీనంలో ఉంది. మా పర్మిషన్ లేకుండా కట్టను తొలగించే అధికారం మీకు లేదు. మీపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం' అని హెచ్చరించారు.
చెరువు స్థలం ప్రైవేటుదో...లేక రెవెన్యూ శాఖదో తేల్చేంతవరకు అక్కడ ఎలాంటి పనులు చేపట్టరాదని సూచించారు. ఆ తర్వాత తహసీల్దార్‌కు కంప్లయింట్ చేశారు. ఇది జరిగి వారం కావస్తున్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కబ్జా అవుతున్న చెరువులు
ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇదివరకు ఉన్న చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయని స్థానిక గ్రామాల ప్రజలు అంటున్నారు. గతంలో అనుములకుంట, కుమ్మరికుంట,చిట్టూర్ కుంట, శనగకుంట, ఇప్పుడు టేకులకుంట... ఇలా చెన్నూర్ఇరిగేషన్ డివిజన్ పరిధిలోని చెరువులను కబ్జాదారులు పొతం పెడున్నారని అంటున్నారు. కొందరు ధైర్యం చేసి ముందుకు వచ్చి ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటున్నారు.
ఎంతటి వారైనా వదలం
మాకు ఇప్పటివరకు అనుమలకుంట, శనగకుంట, టేకులకుంట, చెరువుల భూములను కబ్జా చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. శనగకుంటలో ఎఫ్టీఎల్ లెవెల్లో మట్టిని పోస్తుంటే పోలీసులకు కంప్లయింట్చేసి అడ్డుకున్నాం. టేకులకుంట కబ్జాపైనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. చెరువుల శిఖం భూముల హద్దులు చూపించాలని తహసీల్దార్‌కు లెటర్ రాశాం. సర్వేయర్ లేరనే సాకుతో ఈ సమస్యలను పట్టించుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు చెరువుల హద్దులను నిర్ధారిస్తే కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం. కబ్జా అయిన భూములను స్వాధీనం చేసుకుంటాం.
-
వేణుగోపాల్, ఇరిగేషన్ డీఈఈ, చెన్నూర్