రెండు కుటుంబాల మధ్య పిల్లి లొల్లి.. పోలీసులకు తలనొప్పిగా క్యాట్ కేసు..!

రెండు కుటుంబాల మధ్య పిల్లి లొల్లి.. పోలీసులకు తలనొప్పిగా క్యాట్ కేసు..!

నల్గొండ, వెలుగు: పిల్లి పెట్టిన లొల్లి కేసు నల్గొండ పోలీసులకు తలనొప్పిగా మారింది. తమదంటే తమదంటూ రెండు కుటుంబాలు స్టేషన్‎లో గొడవకు దిగాయి. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ టౌన్ రహమత్ నగర్‎కు చెందిన పుష్పలత పిల్లిని పెంచుకుంటూ దానికి ‘పఫి’ అనే పేరు పెట్టుకుంది. గతేడాది జూన్ నుంచి పిల్లి కనిపించకుండాపోగా ఆమె టూటౌన్ పీఎస్‎లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు పెట్టారు. కాగా ఆమె ఉండే గల్లీలోని ఆశ్రఫ్ కుటుంబం వద్ద పిల్లి కనిపించింది. దీంతో పుష్పలత శుక్రవారం స్టేషన్‎కు వెళ్లి పోలీసులకు తెలిపింది. 

పిల్లిని గుర్తు పట్టకుండా రంగు వేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. దీంతో అశ్రఫ్ కుటుంబ సభ్యులను పిలిపించి విచారించగా.. ఓ వ్యక్తి వద్ద రూ.3,500 కొన్నట్టు తెలిపారు. మరోవైపు రెండు కుటుంబాల పంచాయితీ కాస్తా ఎస్పీ వద్దకు చేరింది. పిల్లి హెయిర్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్‎ల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‎కు పంపారు. పుష్పలత వాదిస్తున్నట్టు పిల్లికి రంగు వేశారా..? అశ్రఫ్ చెబుతున్నట్టు అది పుట్టుకతో వచ్చిన కలరా..? అనేది రిపోర్ట్‎లో తేలనుంది. ప్రస్తుతం పిల్లి (పఫి) అశ్రఫ్ కుటుంబ వద్దనే ఉంది. పిల్లి లొల్లిని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.