తడిసి మోపెడువుతున్న కిస్తీలు మిత్తీలు

తడిసి మోపెడువుతున్న కిస్తీలు మిత్తీలు
  • తడిసి మోపెడువుతున్న కిస్తీలు మిత్తీలు
  • అప్పులకు ప్రతినెలా 4 వేల కోట్ల చెల్లింపులు
  • ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే కాళేశ్వరం కోసం కట్టింది 1,050 కోట్లు
  • 2023–24లో కాళేశ్వరం కోసం కట్టాల్సినవి 11 వేల కోట్లు
  • తొమ్మిదేండ్లలో సర్కారు చేసిన వివిధ అప్పులు రూ. 5 లక్షల కోట్లకుపైనే
  • వాటికి ఈ ఫైనాన్స్​ ఇయర్​లో రీపేమెంట్స్​ రూ. 45 వేల కోట్లు
  • సొంత ఆదాయంలో సగం దాకా అప్పులకే పోతున్నయ్​
  • జీతాలు, బిల్లులకు విడతలవారీగా చెల్లింపులు

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు చెల్లించాల్సిన కిస్తీలు, మిత్తీలు తడిసి మోపెడవుతున్నాయి. ప్రతి నెలా యావరేజ్​గా రూ. 4వేల కోట్ల వరకు రీపేమెంట్స్​ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల అయిన ఈ ఏప్రిల్​లో రూ.1,050 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఇందులో దాదాపు 600 కోట్ల రూపాయలు వడ్డీలవే. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పులకు ప్రతినెలా యావరేజ్​గా రూ.  వెయ్యి కోట్లు చెల్లించాలి. లోన్​ రీపేమెంట్స్​ను ఎప్పటికప్పుడు కట్టాల్సిందే. లేదంటే అప్పులు ఇచ్చిన ఆర్థిక సంస్థలు అంతకంతకు వడ్డీల భారం వేస్తాయి. దీంతో ప్రభుత్వం.. తన సొంత ఆదాయం నుంచి, ప్రతినెలా ఆర్బీఐ ద్వారా తీసుకునే రెగ్యులర్​ అప్పుల్లో నుంచి వీటికి కట్టాల్సి వస్తున్నది. ఇట్లా అడ్జస్ట్​మెంట్స్ చేస్తుండటంతోనే ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడం, బిల్లులు పెండింగ్​లో పడటం, స్కీములకూ నిధులు ఇవ్వలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన ఇతర అప్పులకు ఈ ఆర్థిక సంవత్సరం (2023–24)లో దాదాపు రూ. 45 వేల కోట్ల కిస్తీలు, మిత్తీలు కట్టాల్సి ఉందని అంటున్నారు. ఇందులో వడ్డీలకే రూ. 22,808 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నారు. 

కాళేశ్వరం వడ్డీ రూ. 71,575 కోట్లు!

వివిధ ఆర్థిక సంస్థల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పు రూ. 97,447 కోట్లుగా ఉన్నది. ఈ అసలు మొత్తం కట్టడంతోపాటు దీనికి అయ్యే వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఈ మొత్తం కలిపి రూ.1.69 లక్షల కోట్లు ఉంది. ఇందులో వడ్డీ కింద కట్టాల్సిందే రూ. 71,575 కోట్లు.  పోయిన ఆర్థిక సంవత్సరం నుంచే ఈ చెల్లింపులు మొదలైనప్పటికీ...ఈ సారి అంతకు రెట్టింపు స్థాయిలో కట్టాల్సిన పరిస్థితి. అందులో భాగంగానే ఏప్రిల్​ నెలలో రూ. 1,050 కోట్లు చెల్లించినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. మొత్తంగా ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ (2023–24)లో దాదాపు 11 వేల కోట్ల రూపాయలు కేవలం కాళేశ్వరం అప్పులకే ప్రభుత్వం ఖజానా నుంచి చెల్లించనుంది. 

సొంత ఆదాయంలో సగం అటే!

రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఆదాయం ఆశించిన మేరకు వస్తున్నప్పటికీ గత అప్పుల కారణంగా వాటిని సంక్షేమం కోసం వినియోగించలేని పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పులు రూ.5 లక్షల కోట్లు దాటినట్లు ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. వీటికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన కిస్తీలు, వడ్డీలు రూ.45 వేల కోట్లు కట్టాల్సి ఉంది. ఇట్లా ఒక్కో నెలలో కడుతున్న రీపేమెంట్స్​ మొత్తం యావరేజ్​గా రూ. 4 వేల కోట్ల దాకా ఉంటుంది. ప్రభుత్వానికి సొంత ఆదాయం ప్రతినెలా దాదాపు తొమ్మిది పదివేల  కోట్ల వరకు వస్తుంటుంది. ఇందులో సగం వరకు అప్పుల రీపేమెంట్స్​కు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ అప్పుల రీపేమెంట్స్​కు సర్దుబాటు చేసిన తర్వాత జీతాలను, పెన్షన్లను విడతలవారీగా ప్రభుత్వం చెల్లిస్తున్నది.