
చేపల కాంట్రాక్టర్ కక్కుర్తి, ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
సర్ధి చెప్పిన గండ్ర వెంకటరమణారెడ్డి
రేగొండ, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకోడెపాకలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చిన్నికోడెపాక పెద్దచెరువుకు గండి పడి ఖాళీ అయ్యింది. శుక్రవారం చెరువును పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ఎదుట ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. చేపల కాంట్రాక్టర్ఇచ్చిన డబ్బులకు కక్కుర్తి పడిన ఆఫీసర్లు.. చెరువు డేంజర్ లెవెల్లో ఉందని చెప్పినా పట్టించుకోలేదన్నారు. అక్కడే ఉన్న ఆఫీసర్లను ప్రశ్నించారు. తక్షణమే ఏఈ, డీఈను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చెరువు మత్తడి సమీపంలోకి చేపలు వెళ్లకుండా ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్వల్లే కట్ట తెగిందన్నారు. గ్రిల్ తొలగించాలని ఆఫీసర్లకు చెప్తే కేసుల పెడతామని బెదిరించారన్నారు.
గండి పడడంతో పొలాల్లో ఇసుక మేటలు వేసిందని, కోతకు గురయ్యాయని, ఎవరి హద్దులు ఎక్కడున్నయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే రిపేర్లు మొదలుపెడతామని ఎమ్మెల్యే సర్ధి చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. కలెక్టర్చెరువును విజిట్చేస్తారని, ఆయకట్టు రైతుల భూముల కోతను సైతం అంచనా వేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సారెస్పీ కాలువ ద్వారా చెరువులోకి నీళ్లు మళ్లించి పంటలసాగుకు చర్యలు చేపడతామన్నారు. వెంట వరంగల్జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, నాయకులు మటికె సంతోష్, అంబాల చందు,గుండు సదానందం పాల్గొన్నారు.