ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లోనూ తాండూరు టిక్కెట్ తనదేనంటూ కుండబద్దలు కొట్టారు. ప్రస్టేషన్ లో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులపై నోరు పారేసుకోవడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
పట్నం మహేందర్ రెడ్డి కామెంట్స్ కు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాండూరు నియోజకవర్గం ప్రజలందరూ తన పని తీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తాండూరులో చాలా అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ తనకే దక్కుతుందని పైలెట్ రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిట్టింగులకే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తామని గతంలో మంత్రి కేటీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సర్వేలలో తనకే పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయించానని.. టీఆర్ఎస్ అధిష్టానానికి కావాల్సింది గెలుపు గుర్రాలని మహేందర్ రెడ్డికి చురకలంటించారు. నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల సీఎం కేసీఆర్ తనను ఎన్నోసార్లు అభినందించిన విషయాన్ని పైలెట్ ప్రస్తావించారు.
నియోజకవర్గంలో గొడవలు చేస్తుంది ఎవరో ప్రజలకు తెలుసని పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. పోలీసు అధికారులపై నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, బూతు పదాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రష్టేషన్ లో తనపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఈ అంశాన్ని త్వరలోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో ఏ ఒక్క సర్పంచ్ ను వేధించలేదని, సీఐను తిట్టిన అంశాన్ని పక్కదారి పట్టించేందుకే పట్నం మహేందర్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. శనివారం ( ఈనెల 23న ) తాండూరులో భావిగి భధ్రేశ్వర స్వామి జాతరలో తన పక్కన రౌడీషీటర్లు ఎవరూ లేరన్నారు. తాండూరు అభివృద్ధే తన లక్ష్యమని చెప్పిన పైలెట్ పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారే విషయం తనకు తెలియదని చెప్పారు.
తమ మధ్య ఉన్న విభేదాలపై గతంలోనే చాలాసార్లు జిల్లా మంత్రి సమక్షంలో చర్చలు జరిగాయని రోహిత్ రెడ్డి చెప్పారు. మహేందర్ రెడ్డి తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీఐను తిట్టలేదని ఎమ్మెల్సీ చెప్పిన మాటల్లో నిజం లేదని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. తాండూరులో తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయని పైలెట్ స్పష్టం చేశారు.
మరిన్ని వార్తల కోసం..