కారులో ప్రయాణించాలంటే దాని సామర్థ్యాన్ని బట్టి ప్రయాణికులుండాలి. ఓవర్ లోడింగ్ అయితే ప్రమాదం తప్పదు. 2014 కంటే 2018 ఎన్నికల్లో జట్‌స్పీడ్‌గా వెళ్లి కారు కావాల్సిన మెజార్టీని సాధించింది. 2014 ఎన్నికల్లో 63 స్థానాలు గెలిచి బొటాబొటి మెజార్టీ సాధించిన బీఆర్‌ఎస్ కారు, 2018 ఎన్నికల్లో 88 స్థానాలతో మరింత వేగవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. సీఎం కేసీఆర్ కు ఈ విజయం కూడా సంతృప్తి ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా పార్టీకి ఎలాంటి అడ్డంకులు ఉండొద్దనే భావనతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ప్రధానంగా డజను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా మొత్తం 16 మంది వివిధ పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వంద మందికి పైగా ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో కేసీఆర్‌కు ఎదురు లేకుండా పోయింది. బీఆర్‌ఎస్ కారుకు 2023లో రాబోయే ఎన్నికల్లో ఒడిదొడుకులు ఎదురయ్యేలా ఉన్నాయి. సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లని కేసీఆర్ ప్రకటన ఓవర్ లోడింగ్‌తో ఉన్న కారు వేగానికి బ్రేకులు పడేలా ఉన్నాయి. దీనికితోడు మునుగోడు విజయంతో ఇక మీదట రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కు మా అవసరం తప్పనిసరి అని భావిస్తున్న వామపక్షాలు 15 సీట్లు పొత్తులో భాగంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో వీటిలో కనీసం సగం అయినా ఇవ్వాల్సివస్తుంది. బీఆర్‌ఎస్ లో కొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఈ సారి శాసనసభకు పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే ఇతర పార్టీల నుండి వచ్చిన 16 మంది ఎమ్మెల్యే సీట్లకు తోడు వామపక్షాలకు ఏడెనిమిది సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి తోడు పార్టీలో తీవ్రస్థాయిలో వర్గపోరున్న కొన్ని నియోజకవర్గాలను కూడా కలుపుకుంటే కనీసం ముప్పైకు పైగా స్థానాల్లో బీఆర్‌ఎస్ కు ప్రతిపక్షాలకన్నా అంతర్గత పోరే ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మొత్తం మీద బీఆర్‌ఎస్‌కు పుట్టినిల్లు అయిన తెలంగాణలో ఇంటిపోరు తప్పేలా లేదు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు
అభివృద్ధి కోసం అంటూ బీఆర్‌ఎస్ లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లో గత ఎన్నికల ప్రత్యర్థులతోనే గట్టి సవాలు ఎదురవుతోంది. ఆసీఫాబాద్, ఎల్లారెడ్డి, రామగుండం, ఎల్‌బినగర్, మహేశ్వరం, తాండూరు, కొల్లాపూర్, నకిరేకల్, భూపాలపల్లి, పినపాక, ఇల్లందు, పాలేరు, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో తీవ్ర వర్గపోరు నెలకొంది. ఈ స్థానాల్లో 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులపై గెలిచిన వారే. దీంతో ఈ నియోజకవర్గాల్లో వర్గపోరు తీవ్ర స్థాయిలో ఉంది. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే తిరిగి టికెట్లని ఇటీవల కేసిఆర్ ప్రకటించడంతో ఇంతకాలం పోటీపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. చివరి నిమిషం వరకు టికెట్ కోసం యత్నిస్తూ ఎందుకైనా మంచిదని కొందరు పక్కపార్టీలలో కర్చీఫ్ వేసుకుంటున్నారు. మరికొందరు ఇండిపెండెట్లగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాండూరులో రోహిత్ రెడ్డి మాజీ మంత్రి మహీందర్‌రెడ్డి మధ్య, మహేశ్వరంలో మంత్రి సబితారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగలకృష్ణారెడ్డి, కొల్లాపూర్‌లో హర్షవర్థన్‌రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి మాజీ స్పీకర్ మధుసూదనా చారి, పాలేరులో కందాల ఉపేందర్‌రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, పినపాకలో రేగా కాంతారావు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మధ్య బీఆర్‌ఎస్ లో టికెట్ పోరు తీవ్రంగా ఉంది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా కోవర్టులుగా పనిచేస్తున్నారని ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయానికి ఈ వర్గపోరుతో బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగించే అవకాశాలున్నాయి.
దూకుడుమీదున్న వామపక్షాలు
మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టెక్కడానికి కేసీఆర్ వామపక్షాల మద్దతుతో విజయం సాధించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, వామపక్షాల మధ్య పొత్తు ఉంటుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి. సీపీఎం, సీపీఐ పార్టీలు ఖమ్మం, వైరా, మధిర, భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్, ఇబ్రహీంపట్నం, దేవరకొండ, హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, కల్వకుర్తి నియోజకవర్గాలను పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని కోరుతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, టికెట్ ఆశిస్తున్న నేతలు ఆందోళన చెందుతున్నారు. పొత్తులో భాగంగా వామపక్షాలకు తమ నియోజకవర్గాలను కేటాయిస్తే ఇంటిపెండెంట్‌గా లేదా ఇతర పార్టీల నుండి పోటీ చేయడానికి ఆశావహులు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ కు సరిపోతుంది. కేసీఆర్ ఇంట గెలవకపోతే బయట గెలవడం అసాధ్యమే.
అంత ఈజీ కాదు
గత రెండు ఎన్నికల్లో కేసీఆర్‌కు లభించిన తెలంగాణ సెంటిమెంట్ ఈ సారి లభించకపోవచ్చు. బీఆర్‌ఎస్ విస్తరణలో భాగంగా దేశ వ్యాప్తంగా పోటీ చేయాలనుకుంటున్న కేసీఆర్ ఏపీలో కూడా పోటీ చేయాల్సి వస్తుంది. దీంతో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పనిచేయకపోవచ్చు. ఇతర పార్టీల నుంచి వచ్చిన 16 మంది ఎమ్మెల్యేల స్థానాలతో పాటు వామపక్షాలకు కనీసం ఏడు స్థానాలు కేటాయించాల్సి రావచ్చు. కనీసం పది స్థానాలపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కన్నేశారు. ఇక ఎంఐఎం పోటీ చేసే ఏడు స్థానాలపై ఎలాంటి ఆశలుండవు. అంటే మొత్తం మీద 16+7+10+7= 40 స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు పోటీ సులభం కాదు. 119 స్థానాల్లో 40 పోగా 70 స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు టికెట్ల గోల లేకుండా సాఫీగా సాగే అవకాశాలున్నాయి. రెండు పర్యాయాలు పాలించిన వారిపై ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగూ ఉంటుంది. దీనికి తోడు అంతర్గత పోరు, పొత్తుల గొడవతో రాబోయే ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు అంత ఈజీ కాదు. ఈ నష్టాలకు అదనంగా ఒకవేళ ఇప్పుడు ప్రచారం అవుతున్నట్టు ఎంఐఎం కూడా మరిన్ని స్థానాలపై దృష్టి కేంద్రీకరిస్తే బీఆర్‌ఎస్ కు మరింత నష్టం తప్పదు.
ఎమ్మెల్సీలు, ఎంపీల నుండి సవాలు
బీఆర్‌ఎస్‌లో అనేక స్థానాల్లో టికెట్లకోసం వర్గపోరు ముదురుతోంది. కల్వకుర్తిలో ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి, నాగర్‌కర్నూలులో ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, జుక్కల్‌లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఎమ్మెల్సీ రాజేశ్వర్, డోర్నకల్‌లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ మంత్రి సత్యవతి రాథోడ్, స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య మాజీ మంత్రి కడియం శ్రీహరి, వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మధ్య టికెట్ కోసం తీవ్రమైన పోరు ఉంది. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు ఎంపీ కవిత మధ్య వర్గ పోరు ఉంది. మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఘర్షణపడ్డ ఘటనలు కూడా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నిట్టనిలువునా చీలే అవకాశాలున్నాయి.
- ఐ.వి. మురళీ కృష్ణ శర్మ, పొలిటికల్ ఎనలిస్ట్