ప్రజాస్వామ్యం ముసుగులో రాచరికమే ఇంకా రాజ్యమేలుతోంది

ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నికైన ప్రభుత్వాలు, పాలకులు ప్రజా సంక్షేమం కోసమే సేవ చేయాలి. ఇది మన రాజ్యాంగంలో పేర్కొన్న మౌలిక అంశం. అయితే, రాజ్యాంగంలో పేర్కొన్న దానికీ వాస్తవంగా పాలనలో జరుగుతున్న దానికీ పొంతనే లేదు. రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడం, అవగాహన ఉన్నవారు పట్టించుకోకపోవడం వల్ల ఎంతో నష్టం జరుగుతోంది. పాలకులు, ప్రభుత్వ అధికారులు రాజ్యాంగంలో ఉన్నట్టుగా పాలనను అందించకపోవడంతో ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతోంది. ఈ విషయం పాలకులకు, ప్రభుత్వ అధికారులకు క్లియర్ గా తెలుసు. ఈ పరిణామాల కారణంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు కావస్తున్నా ఇంకా ప్రజాస్వామ్యం ముసుగులో రాచరిక, వారసత్వ పాలన  కొనసాగుతోంది.

ప్రజాస్వామ్యంలో అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందనే విషయం ఇటీవల ఈటల రాజేందర్  వ్యవహారంలో రాష్ట్ర ప్రజలకు తెలిసివచ్చింది. ఈ అంశంలో గంటల వ్యవధిలో తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుబట్టిన తీరు ప్రజలంతా చూశారు. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో ఎన్నో జరిగి ఉంటాయి. కానీ, ఈటల హైకోర్టును ఆశ్రయించడంతో వాస్తవాలు బయటకొచ్చాయి. అయితే తమకు అన్యాయం జరిగితే ఇలా చేయాలని సామాన్యులకు తెలియదు. చట్టం, న్యాయం గురించి తెలియని ప్రజలు ప్రతి చిన్న విషయానికీ హైకోర్ట్ ను ఆశ్రయించలేక అన్యాయాలను సహిస్తూ వస్తున్నారు. దీనిని చాలా మంది నాయకులు అలుసుగా తీసుకుని తాము ఎంత చట్టవ్యతిరేక చర్యకు పాల్పడినా తమను ఎవరూ ఏం చేయలేరనే స్థాయికి వచ్చారు.

హక్కుల పరిరక్షణకు కొన్ని విధానాలున్నాయ్
ఏ స్థాయిలోని రాజకీయ నాయకుడైనా ప్రజలకు అన్యాయం చేయాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగి, పోలీస్ వ్యవస్థ సహకారం ఉండాల్సిందే. రాజ్యాంగం ప్రకారం ప్రతీ పౌరునికి ప్రాథమిక హక్కులున్నాయి. వీటి ద్వారా తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం, బాధ్యత కలిగిన పౌరులుగా హుందాగా జీవించడం, ప్రభుత్వపరంగా, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పొందడం పౌరులు చేయవచ్చు. ఇక్కడ ప్రభుత్వం అనగా దేశంలో అధికారం ఉన్న అన్ని అంగాలు. వీటిలో కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు, అన్ని రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిషత్​లు, కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలు మొదలైనవి ఉంటాయి. పౌరుల హక్కులు, వాటి సంరక్షణ గురించి కోర్టులను అడిగే విధానాలు కొన్ని ఉన్నాయి. వీటికి సంబంధించి కోర్టుల్లో కొన్ని దావాలను(రిట్) వేయవచ్చు. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారంటో, సెర్షియోరరి వంటి రిట్లను వేయడానికి పౌరులకు అవకాశం ఉంది. ఒకవేళ దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఈ హక్కులన్ని కేంద్ర ప్రభుత్వం చేత సస్పెండ్​ చేయబడతాయి. వీటిలో మాండమస్ అనే రిట్​ను ఒక ప్రభుత్వ అధికారి తాను చేయకూడని పనిని చేస్తున్నట్లయితే, లేక చేయవలసిన పనిని చేయనట్లయితే హైకోర్ట్ లో ఆర్టికల్ 226 ప్రకారం దావా వేయవచ్చు. జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించి సరైన న్యాయాన్ని పొందవచ్చు. ప్రతీ భారతీయ విద్యావంతుడు ఇలాంటి అంశాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.

పాలకులన్నా, అధికారులన్నా భయం వద్దు
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులన్నా ప్రజలు భయపడాల్సి అవసరం లేదు. ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, ప్యూన్ వరకూ ఎవరైనా ప్రజా సేవకులే. ప్రజలు చెల్లించే పన్నులతోనే వీరంతా వేతనాలు తీసుకొంటూ సకల సౌకర్యాలు పొందుతున్నారు. ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కొందరైతే, ప్రజా పాలన సక్రమంగా సాగడానికి ప్రజా ప్రతినిధుల ద్వారా నియమితులైన వారే ప్రభుత్వ అధికారులు. ఈ రెండు విభాగాల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అనునిత్యం అన్ని రంగాల్లో సేవలు అందించటం వీరి విధి.

200కుపైగా కులాల్లో 15 కులాలకే మాట్లాడే చాన్స్
సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు అందిస్తున్నామన్నారు. కానీ రాజ్యాధికారం ఇచ్చే దగ్గర, రాజ్యాధికారం పొందే దగ్గర జరిగిన న్యాయాన్యాయాల గురించి ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల లెక్కల ప్రకారం.. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లోని మొత్తం కులాలకు చట్టసభలో మాట్లాడే హక్కే లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో దాదాపు 200కు పైన కులాలు ఉంటే అందులో 15 కులాల వారే చట్టసభకు ఎన్నికయ్యారు. ఇక మిగతా కులాల మాటేమిటి? విముక్త, సంచార, అర్ధసంచార జాతుల ప్రజలు మనుషులే కానట్టు వారికి చట్టసభలో మాట్లాడే అవకాశం ఇవ్వరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా సమన్యాయం? ఇదేనా ప్రభుత్వం ప్రజలను పరిపాలించే విధానం? ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధి తనను ప్రజలు కలిసి మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడంలేదు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల సొమ్ముతో సకల సౌకర్యాలు పొందుతూ ప్రజలకే ఆంక్షలు పెట్టి వారిని చులకనగా చూడటం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా ప్రభువులు. ప్రజలదే కదా ప్రథమ స్థానం. కానీ వారిని చులకనగా చూడడం ప్రజాస్వామ్య పాలన అవుతుందా? ఎవరి సహాయ సహకారాలు లేకుండా ప్రజలు ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను కలిసి తమ బాధలు, అవసరాలు చెప్పుకునే పరిస్థితి లేనప్పుడు ప్రజాస్వామ్య పాలన ఎలా అవుతుంది? గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని నిర్ణయాలు ఒక్కరే తీసుంటే, ఆ నిర్ణయాలే అమలు చేయమంటే ఆది ప్రజాస్వామ్య పాలన అవుతుందా? 

పాలనా విధానాలు మారాలని కోరుతున్నరు
పాలకులు ప్రజల మనోభావాలను గుర్తించి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడే ప్రజా సంక్షేమ పాలన రావాలని జనాలు కోరుకుంటున్నారు. ఈ 75 ఏండ్ల స్వాతంత్ర్యం దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో రాచరిక, వారసత్వ అధికారాన్ని సకల సౌకర్యాలు, రాజభోగాలతో ఆధిపత్య కులాల పాలకులు అనుభవించారు. కోటానుకోట్ల సామాన్య ప్రజలు అవకాశం రాక, అధికారం లేక అణచివేయబడి అరకొర వసతులతో అష్టకష్టాలు పడుతున్నారు. అందుకే ఈ విధానం మారాలి. ప్రజాస్వామ్యం విలువలు, విధానాల గురించి ప్రజలకు తెలియాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన జరగాలి. ప్రజల మాటకు విలువ పెరగాలి. చట్టసభల్లో చేసే శాసనాలు ప్రజల అవసరాలు గుర్తించి, అవి తీర్చేలా ఉండాలే గానీ ప్రజల మీద రుద్దేలా ఉండ కూడదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు సొంత నిర్ణయాలు, పథకాలు కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల అవసరాలను గౌరవించి నిర్ణయాలు తీసుకోవాలి.  

ఆధిపత్య కులాలదే అధికారం 
మన పాలనా వ్యవస్థను చూస్తే అంతా రాచరికమే రాజ్యం ఏలుతోంది. కానీ, ఇక్కడ ప్రజల నిర్ణయాలకు విలువ ఇచ్చే వాళ్లు ఎవరూ లేరు. వారి అవసరాలను గుర్తించే వాళ్లు కూడా లేరు. ఆపదలను తీర్చినోళ్లు లేరు. అంతటా పాలకులే నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడ చూసినా అధికారుల ఆధిపత్యమే కొనసాగుతోంది. ప్రజల మాటలకు విలువ లేనప్పుడు, వారి అవసరాలను గుర్తించనప్పుడు, పాలకులు, అధికారుల ఇష్టారాజ్యం అయినప్పుడు ఇక ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు? ప్రజాస్వామ్య పాలన ఎక్కడ సాగుతున్నట్టు? తండ్రి తర్వాత కొడుకు, ఆ తర్వాత అమ్మ, తర్వాత కోడలు, తర్వాత బిడ్డ, తర్వాత మామ, తర్వాత మనుమడు.. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా ఆధిపత్య కులాల పాలకులు, వారి వారసులు అధికారం చేజిక్కించుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా కులాలు, వర్గాలు, జాతుల ప్రజలకు అధికారం ఎలా వస్తుంది. అన్యాయం  
సరిచేయడం ఎలా  కుదురుతుంది. 
- శ్రీనివాస్ తిపిరిశెట్టి, సీనియర్ జర్నలిస్ట్