- 75వేల దోమ తెరలకు ప్రతిపాదనలు
భద్రాచలం,వెలుగు: వర్షాకాలం వచ్చింది. దోమలు విజృంభిస్తున్నాయి. దోమకాటుకు జనం విలవిల్లాడుతున్నారు. పల్లెల్లో ఎటు చూసినా జ్వరాలే. మలేరియా, డెంగ్యూ జ్వరాలు స్వైర విహారం చేస్తున్నాయి. దోమకాటు నుంచి రక్షించే దోమతెరలు కావాలంటూ జిల్లా మలేరియా శాఖ ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖకు ప్రతిపాదినలు పంపింది. కానీ నేటికీ ఒక్క దోమతెర కూడా రాలేదు.
వచ్చేది ఎప్పుడు..? ఇచ్చేది ఎప్పుడు..? అంటూ ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 115 మలేరియా పాజిటివ్, 155 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ జ్వరాలతో చర్ల, బూర్గంపాడు, పినపాకలలో ఒకరు చొప్పున చనిపోయారు.
293 గ్రామాలకు అత్యవసరం
2020 సంవత్సరంలో జిల్లాలోని 293 గ్రామాలకు 58,920 దోమతెరలను పంపిణీ చేశారు. మూడేళ్లకు ఆ దోమతెరల కాలపరిమితి ముగిసిపోతుంది. వాటిపై ఉండే కెమికల్స్ పవర్ తగ్గిపోతాయి. దీనితో ఆ గ్రామాల్లో అత్యవసరంగా దోమతెరలను అందజేయాలి. ఇందుకోసం ఈ సంవత్సరం 75వేల దోమతెరలు కావాలంటూ జిల్లా మలేరియా శాఖ నుంచి కేంద్ర ఆరోగ్యశాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి.
కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. మరోవైపు పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో పల్లెల్లో అపారిశుధ్యం తాండవిస్తోంది. దుర్వాసనకు తోడు దోమల ఉధృతి కూడా పెరిగింది. దోమకాటుతో జ్వరాలు మొదలై, మలేరియా, డెంగ్యూకు దారితీస్తున్నాయి. పినపాక మండలంలో టీచర్ ఒకరు, చర్లలో బీఆర్ఎస్ లీడర్, బూర్గంపాడు మండలం సోంపల్లిలో ఒకరు ఈ సంవత్సరం డెంగ్యూ జ్వరంతో ముగ్గురు చనిపోయారు.
ఇంకెప్పుడు ఇస్తరు..
గూడేల్లో జ్వరాలు వస్తున్నాయి. దోమల సంచారం ఎక్కువైంది. దోమతెరలు ఇంకెప్పుడు ఇస్తరు. దోమకాటుతో, జ్వరాలతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే దోమతెరలు తెప్పించండి. లేకుంటే జ్వరపీడితుల సంఖ్య పెరుగుతుంది. పంచాయతీ కార్మికుల సమ్మెతో ఎక్కడ చూసినా దుర్గంధమే. దోమలు పెరగడానికి ఇదీ ఒక కారణమే.
- చెరుకూరి సతీస్, గిరిజన మోర్చా నాయకులు,భద్రాచలం
ప్రతిపాదనలు పంపినం..
75వేల దోమతెరల కోసం ప్రతిపాదనలు పంపినం. 2020లో ఇచ్చిన 293 గ్రామాలకు ముందుగా వాటిని పంపిణీ చేసిన మిగిలిన వాటిని ఇతర గ్రామాల్లో అవసరమైన చోట పంపిణీ చేస్తాం. జిల్లా నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్ర మలేరియాశాఖను అడుగుతున్నాం.
- గొంది వెంకటేశ్వర్లు,అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్