పోలీస్ స్టేషన్ ఎదుట తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం
భూ వివాదం పరిష్కరించాలని పురుగులమందుతో ఆందోళన
సుల్తానాబాద్, వెలుగు : తమ ఇంటి భూమిని మరొకరు ఆక్రమించుకుంటున్నారని, సమస్య పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట తల్లీ కొడుకు బుధవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ పీఎస్ పరిధిలోని గర్రెపల్లికి చెందిన పిట్టల రాజేశ్వరి, కొడుకు నవీన్ తమ ఇంటి భూమిని పక్కవారు ఆక్రమించుకుంటున్నారని, వారితో ప్రాణ భయం ఉందని సీఐకి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. సీఐ అందుబాటులో లేకపోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చొని, పురుగుల మందు మీద పోసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.
పది సంవత్సరాలుగా ఈ భూవివాదం నడుస్తోందని, అధికారులకు ఫిర్యాదుల చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే ఆందోళన చేస్తున్నట్టు బాధితులు తెలిపారు. ఎస్సై ఉపేందర్ రావు, పోలీసు సిబ్బంది వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.