వేములవాడ/రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఓ వ్యక్తి డబ్బులు ఇవ్వలేదని, అతని తల్లిని కిడ్నాప్ చేశాడో కాంట్రాక్టర్. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వేములవాడ అర్బన్మండలం కొడుముంజ ఆర్అండ్ఆర్కాలనీకి చెందిన పల్లపు శ్రీనివాస్ లేబర్‌గా పని చేస్తున్నాడు. అలాగే అవసరమైనోళ్లకు చత్తీస్ గఢ్‌కు చెందిన లేబర్‌ను పంపుతుంటాడు. మహారాష్ట్రకు చెందిన లాలూ దేవకర్ అనే కాంట్రాక్టర్ కర్నాటకలోని తోటల్లో చెరుకు నరికే కాంట్రాక్టు తీసుకున్నాడు. అక్కడ పని చేసేందుకు కూలీలు అవసరం కావడంతో పల్లపు శ్రీనివాస్‌ను సంప్రదించాడు.
లేబర్‌ను పంపిస్తానని చెప్పిన శ్రీనివాస్.. పోయినేడాది లాలూ దేవకర్దగ్గర రూ.3.80 లక్షలు తీసుకున్నాడు. కర్నాటకలోని చెరుకు తోటల్లో పని చేసేందుకు చత్తీస్ గఢ్ కు చెందిన కూలీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే కూలీలు అక్కడికి పనికి వెళ్లలేదు. దీంతో అప్పటి నుంచి లాలూ, శ్రీనివాస్మధ్య డబ్బుల విషయమై గొడవ జరుగుతున్నది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని శ్రీనివాస్ ను లాలూ అనేకసార్లు అడిగినా చెల్లించలేదు.
ఇంటికొచ్చి.. ఎత్తుకెళ్లి..
లాలూ దేవకర్ కొంతమంది మనుషులను తీసుకుని బుధవారం ఉదయం 7 గంటలకు శ్రీను ఇంటికి వచ్చాడు. అయితే ఆ టైమ్ లో శ్రీను, అతడి సోదరుడు ఇంటి దగ్గర లేరు. శ్రీను డబ్బులు ఇవ్వాలని గొడవ చేసిన లాలూ దేవకర్, అతని మనుషులు.. ఇంట్లో ఉన్న శ్రీను భార్య సోనిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమె తప్పించుకుని పక్కింట్లో దాక్కుంది. దాంతో శ్రీను తల్లి పల్లపు భీమాబాయి(63)ని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు.
అనారోగ్యంతో బాధపడుతున్న భీమాబాయిని వదిలిపెట్టాలని కుటుంబసభ్యులు ఏడుస్తూ కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వారిని నెట్టేసి కిడ్నాప్‌చేసి తీసుకెళ్లారు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ సీఐ వీరప్రసాద్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని మహారాష్ట్రకు పంపించారు. లాలూ, అతని మనుషులు మహరాష్ర్టలోని నాందేడ్‌లో ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. కిడ్నాప్‌చేసిన వారిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
భీమాబాయిని, ఇద్దరు కిడ్నాపర్లను గురువారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. భీమాబాయికి హెల్త్చెకప్చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కారు నెంబర్, సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును పరిష్కరించి.. మహిళను కాపాడామని సీఐ తెలిపారు. 36 గంటల్లో కేసును ఛేదించిన వేములవాడ టౌన్ సీఐ వీరాప్రసాద్, ఎస్ఐ రమేశ్, సిబ్బందిని ఎస్పీ అఖిల్మహాజన్అభినందించారు.
మా బాబాయ్ మధ్యవర్తి మాత్రమే..
మహరాష్ర్టకు చెందిన లాలూదేవకర్ మా బాబాయ్ కి డైరెక్టుగా డబ్బులు ఇవ్వలేదు. మా బాబాయ్ కేవలం మధ్యవర్తిగా మాత్రమే ఉన్నాడు. డబ్బులు తీసుకుని కూడా చత్తీస్ గఢ్ లేబర్లు పనికి రాలేదు. ఈ విషయంపై ఏడాదిగా గొడవ నడుస్తున్నది. బుధవారం ముగ్గురు మగవాళ్లు, ముగ్గురు ఆడవాళ్లు వచ్చి మా పిన్నిని కిడ్నాప్ చేసేందుకు ప్రయ త్నించారు. నేను వెంటనే వాళ్లను నెట్టేసి, పిన్ని ని వేరే వాళ్ల ఇంటికి పంపించాను. ఆ తర్వాత వాళ్లు మా నానమ్మను కిడ్నాప్ చేశారు.
- పల్లపు వెంకటేశ్, శ్రీను అన్న కొడుకు
నన్ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన్రు..
ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం పొద్దున మా ఇంటికి వచ్చారు. శ్రీనివాస్డబ్బులు ఇవ్వాలంటూ గొడవ చేశారు. మీ ఆయన ఎక్కడంటూ నన్ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసి కొట్టారు. ఈ క్రమంలో నేను భయంతో పక్కింట్లోకి వెళ్లి దాక్కున్నాను. తర్వాత వాళ్లు మా అత్తమ్మను బలవంతంగా ఎత్తుకెళ్లారు.
- సోని, శ్రీనివాస్ భార్య