- గంటల వ్యవధిలో ఇద్దరు మృతి
- ఫిట్స్‌తో కాగజ్ నగర్ లో చనిపోయిన శిశువు
- చింతలమానే పల్లి మండలం గూడెంలో విషాదం
కాగ జ్ నగర్, వెలుగు: నవమాసాలు మోసి కన్న కొడుకును చూడకముందే ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోయిన రెండు గంటల్లోనే మరో హాస్పిటల్ లో కొడుకు కూడా మరణించాడు. కొమురం భీం జిల్లాచింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన దిగిడె శ్రీనివాస్, శోభ దంపతులకు ముగ్గురు కూతుర్లున్నారు. గతంలో ఒక పాప పుట్టి చనిపోయింది. శోభ అయిదో సారి గర్భం దాల్చింది. శుక్రవారం పురిటి నొప్పులు రాగా 108 అంబులెన్స్ లో కౌటాల పీహెచ్ సీకి తీసుకువచ్చారు. ఆలస్యం కావడంతో మార్గమధ్యలో ఉన్న తలోడి సమీపంలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చి స్పృహ కోల్పోయింది.
దీంతో ఆమెను పీహెచ్ సీకి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మంచిర్యాల ప్రభుత్వ దవాఖానాకు తీసుకువెళ్లారు. పిల్లవాడి ఆరోగ్యం కూడా బాగా లేకపోవడంతో కాగ జ్ నగర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. మంచిర్యాల లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శోభ ఆదివారం రాత్రి చనిపోగా, కాగ జ్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో ఉన్న కొడుకు ఫిట్స్ తో మృతి చెందాడు. గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకులు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. సోమవారం ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించారు.