
దర్శకుడిగా పలు హిట్ చిత్రాలను రూపొందించిన త్రినాధరావు నక్కిన.. ‘చౌర్య పాఠం’ చిత్రంతో నిర్మాతగా అడుగుపెడుతున్నారు. ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణను హీరో హీరోయిన్లుగా, నిఖిల్ గొల్లమారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా త్రినాధరావు మాట్లాడుతూ.. ‘కొత్తవాళ్ళకి ఒక ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేయడం నా డ్రీం. అది ఎప్పటినుంచో ఉంది. నాకు సంపాదన మీద దృష్టి లేదు. కొత్త వారికి అవకాశం కల్పించాలనే మంచి ఉద్దేశంతోనే నిర్మాణంలోకి వచ్చా.
ఈ కథను కార్తీక్ ఘట్టమనేని చెప్పాడు. వాళ్ల నాన్న పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసినప్పుడు జరిగిన ఓ చిలిపి దొంగతనం కేసును కథగా రాశాడు. ఇలాంటి మనీ హైస్ట్ సినిమాలు తీయడం ఖర్చుతో కూడుకున్న పని. మేము అనుకున్నదాని కంటే పదిశాతం బడ్జెట్ పెరిగింది. మా బ్యానర్ నుంచి వస్తోన్న ఫస్ట్ మూవీ అవడంతో కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో తీశాం. ఈ సినిమా కోసం వర్క్ షాప్ నిర్వహించాం.
ఇందులోని నటీనటులంతా చక్కగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. క్యారెక్టర్స్ తప్ప ఆర్టిస్టులు కనిపించరు. అంత సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. నిఖిల్ విజువల్ సెన్స్ ఉన్న డైరెక్టర్. నేను ఎలా అనుకున్నానో అలా సినిమాని తీర్చిదిద్దాడు. ఈ కాన్సెప్ట్ అందరినీ అలరించేలా తీశాడు. దొంగతనం చేయాలనుకునే వారికి ఈ చిత్రం ఓ గుణపాఠంలా ఉంటుంది. మ్యూజిక్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. ఇక నేను దర్శకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్, దిల్ రాజు గారి బ్యానర్స్‌లో సినిమాలు చేయాల్సి ఉంది’ అని చెప్పారు.