డిసెంబర్ 31లోపే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ: మంత్రి పొంగులేటి

డిసెంబర్ 31లోపే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ: మంత్రి పొంగులేటి
  • అప్లై చేసుకోకున్నా అర్హత ఉంటే ఇందిరమ్మ ఇండ్ల యాప్​లో ఎంట్రీ: మంత్రి పొంగులేటి
  • 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్​ అసెంబ్లీకొచ్చి సలహాలు ఇవ్వాలి
  • భూబకాసురుల చిట్టాను ఆధారాలతోసహా బయటపెడ్తం
  • తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చించాల్సి వస్తుందనే 
  • బీఆర్ఎస్​ నేతలు అదానీ టీషర్టులతో వచ్చి పారిపోయిన్రు
  • మీడియా చిట్​చాట్​లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: డిసెంబర్ 31లోపు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలనలో అప్లై చేయని వాళ్లకు కూడా అర్హత ఉంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం యాప్​లో వివరాలు తీసుకుంటున్నామని, వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గురువారం సెక్రటేరియెట్​లో పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి  మీడియాతో చిట్ చాట్ చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల యాప్‌లో  సర్వే అధికారుల రికమండేషన్ ఆప్షన్ తీసివేశామని చెప్పారు. ఇప్పటివరకు 2 లక్షల 32 వేల దరఖాస్తులను యాప్‌లో నమోదు చేశారని తెలిపారు. ఆలస్యమైనా.. లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. ఐటీడీఏ, ట్రైబల్ ఏరియాలో ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని, దీంతో ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తామని తెలిపారు. ఇందిరమ్మ కమిటీలో సర్వేయర్లను భాగస్వాములను చేయాలన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలకు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధం లేదని చెప్పారు.

ప్రతిపక్షాలు, మీడియా తనను ఎంత పరిగెత్తించాలని చూసినా కుదరదని, ప్రతి ఒక్కరికీ పకడ్బందీగా పథకాలు అమలు చేసేందుకు అన్నింటిపై సమగ్రంగా అధ్యయనం చేసి, ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. సంక్రాంతిలోపే పాత వీఆర్వోలను గ్రామాల్లో అధికారులుగా తీసుకొస్తామని చెప్పారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వీఆర్వోల్లో వెనక్కి వచ్చే వాళ్లను తిరిగి తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పు చేసిన అధికారులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త ఆర్వోఆర్​ చట్టం తీసుకొస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో  మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన భూ అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతామని తెలిపారు.

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి

 ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ఆర్వోఆర్​ చట్టంపై సలహాలు, సూచనలు ఇవ్వాలని పొంగులేటి కోరారు. కేసీఆర్​లాగా తాను, సీఎం, ఇతర కేబినెట్​ మినిస్టర్స్ ఎవరూ  80 వేల పుస్తకాలు చదవలేదని, అందుకే  పుస్తకాలు చదివిన అనుభవంతో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కేసీఆర్​ను కోరుతున్నట్టు చెప్పారు. కేటీఆర్, హరీశ్​రావు కనీసం 5 వేల పుస్తకాలు చదివినా, వాళ్ల సూచనలు తీసుకునే వాళ్లమని ఎద్దేవా చేశారు.

తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ ఎలాంటి సూచనలు చేయలేదని చెప్పారు. ధర్నా చౌక్‌ను ఓపెన్ చేశామని, ఎవరినీ తాము అడ్డుకోలేదని అన్నారు. రైతులకు బేడీలు వేయడం సరికాదని, ఇప్పటికే దీనిపై సీఎం  స్పందించారని చెప్పారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ తప్పిదాల వల్లే సంక్షేమ గురుకుల హాస్టల్స్​లో ఫుడ్ పాయిజన్‌ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. 

గురుకులాలన్నీ వాళ్ల బిల్డింగ్స్​లోనే ఉన్నాయని తెలిపారు.  అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహంపై సమాధానం లేకనే బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు అదానీ టీ షర్ట్​లు వేసుకొని వచ్చి.. అసెంబ్లీకి రాకుండా పారిపోయారని విమర్శించారు. అదానీ విషయంలో వివాదం కావొద్దనే స్కిల్ యూనివర్సిటీకి ఆయన ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కి పంపామని తెలిపారు.

40 శాతం డైట్, కాస్మోటిక్​ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఈ నెల 14 న అందరు మంత్రులు,అధికారులు హాస్టల్స్​లో భోజనం చేస్తున్నట్టు తెలిపారు. 2 ఏండ్లలో పెండింగ్ లో ఉన్న బిల్లులు 31 లోపు విడుదల చేస్తామని చెప్పారు. బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి 10  ఏండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి, బయ్యారం ఉక్కు కర్మాగారం అంటూ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ వాడుకుంటున్నారని విమర్శించారు.