- జిల్లాలో ఇప్పుడున్నది 5.55 లక్షలే
- బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన గొర్రెలు, వాటి పిల్లలు ఎటు పోయినట్టు?
- పశు సంవర్ధక శాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడి
గొప్పలు చెప్పుకున్న గొర్రెల పంపిణీ స్కీమ్ఉత్త డొల్ల అని తేలిపోయింది. రికార్డుల్లోనే గొర్రెలు వచ్చినట్టు.. పంపిణీ చేసినట్టు కన్పిస్తోంది. ప్రచారం జరిగినట్టుగా పూర్తిస్థాయిలో గొర్రెలు రాలేదు. గతంలో కంటే జీవాల సంఖ్య తగ్గడమే ఇందుకు నిదర్శనమని ఇటీవల పశు సంవర్ధక శాఖ నిర్వహించిన సర్వేలో తేలింది.
యాదాద్రి, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కారు 2017లో గొర్రెల పంపిణీ స్కీమ్ ప్రవేశపెట్టి, ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు మొదటి విడతలో యూనిట్‌కు రూ. 1.25 లక్షలు కేటాయించి, లబ్ధిదారుడి వాటాగా రూ. 31,250 తీసుకున్నారు. రెండో విడతలో దీనిని రూ.1.75 లక్షలు (లబ్ధిదారుడి వాటా రూ. 43,750)గా నిర్ణయించారు. తద్వారా గొర్రెల కాపరుల సంఘాల్లో మెంబర్ల సంఖ్య విపరీతంగా పెరిగి.. ఈ స్కీమ్ అపసోపాలు పడుతూ ముందుకు సాగింది. గొర్రెల పంపిణీలోనూ అనేక అవకతవకలు జరిగాయి. పంపిణీ కోసం ఏపీలోని వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన గొర్రెలు రావడం, మరో మార్గంలో తిరిగి వెళ్లిపోవడమూ పలు సందర్భాల్లో జరిగింది. దీంతో నిజమైన గొర్రెల కాపరుల వద్దనే జీవాలు ఉండగా, మిగిలిన వారికి పంపిణీ చేసిన జీవాలు వచ్చినట్టే వెళ్లిపోయాయి.
-
స్కీమ్‌లో స్కామ్‌పై విచారణ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గొర్రెల పంపిణీ స్కీమ్ లోపాలపై దృష్టి సారించింది. విచారణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని గుర్తించింది. ఏసీబీతో విచారణకు ఆదేశించి, ఇప్పటివరకు ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసింది. ఈ స్కామ్‌లో దాదాపు రూ.700 కోట్ల డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ రంగ ప్రవేశం చేసింది. మరోవైపు, పశు సంవర్థక శాఖ కూడా రంగంలోకి దిగి.. గొర్రెలు, మేకలెన్ని ఉన్నాయి? వాటిలో ఆడ, మగ జీవాలెన్ని? ఏడాదిలోపు, ఏడాది మించిన జీవాలెన్ని? అని సర్వే చేపట్టింది. ఈ సర్వేలో జీవాల సంఖ్య తగ్గిందని తేలడంతో.. పూర్తి వివరాలతో హయ్యర్ఆఫీసర్లకు నివేదిక పంపించింది.
-
4.50 లక్షల జీవాల పంపిణీ
యాదాద్రి జిల్లాలో 2019–--20లో 20వ పశుగణన చేశారు. ఈ సమయంలో 4,47,331 గొర్రెలు,1,22,621 మేకలు కలిపి మొత్తంగా 5,69,952 జీవాలు ఉన్నట్లు గుర్తించారు. 2021లో నిర్వహించిన నట్టల నివారణ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 4,99,892 గొర్రెలు, 1,08,003 మేకలు కలిపి 6,07,895 జీవాలు ఉన్నట్టుగా ఆఫీసర్లు పేర్కొన్నారు. మరోవైపు, బీఆర్ఎస్ హయాంలో 2017 నుంచి 2023 వరకు మొదటి విడతలో 18,655, రెండో విడతలో 2,790 కలిపి మొత్తంగా 21,445 యూనిట్లు పంపిణీ చేసినట్టుగా ఆఫీసర్లు రికార్డుల్లో పేర్కొన్నారు. ఈ లెక్కన 4,28,900 ఆడ జీవాలు, 21,445 పొట్టేళ్లు పంపిణీ చేసినట్టుగా పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో జీవాల సంఖ్య తగ్గిందని తేలింది. జిల్లాలోని 2,650 గొర్రెల కాపరుల కుటుంబాలు, 667 ఇతర కుటుంబాల్లో మొత్తంగా 5,55,434 జీవాలు ఉన్నాయని తేలింది. వీటిలో పొట్టేళ్లు 68,180, గొర్రెలు 2,76,967 , మేక పోతులు 27,787, మేకలు 91,160 ఉన్నట్టు గుర్తించారు.
-
పంపిణీ చేసిన గొర్రెలు, వాటి పిల్లలు ఏవీ..?
గతంలో నిర్వహించిన పశుగణన కంటే ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో జీవాల సంఖ్య తగ్గడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గొర్రెలు, మేకల జీవితకాలం మామూలుగా 10 నుంచి 12 ఏండ్లు. ఏడాది వయసు నుంచి సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. ఏడాదికి 1 నుంచి 4 పిల్లలకు జన్మనిస్తాయి. ఈ విధంగా వాటికి 6 నుంచి 7 ఏండ్ల వరకూ సంతానోత్పత్తి కలుగుతుంది. గతంలో ఉన్న జీవాలు, పంపిణీ చేసిన గొర్రెల సంతానోత్పత్తి పరిగణనలోకి తీసుకుంటే జీవాలు పెద్ద సంఖ్యలో పెరగాలి. కానీ, వాటి సంఖ్య గతం కంటే తగ్గడంతో ఈ స్కీమ్‌పై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.