ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వెంకటాపూర్/ములుగు, వెలుగు: వచ్చే ఫిబ్రవరిలో జరిగే మినీ మేడారం జాతరను సక్సెస్ చేయాలని కలెక్టర్​ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ ఆఫీస్​లో ఐటీడీఏ ఏపీవో అంకిత్ తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్​రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు జిల్లాలో  మేడారం అంటేనే ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు.  గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపిస్తే ఫండ్స్​ శాంక్షన్​చేస్తామని చెప్పారు.  మినీ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా  అన్ని వసతులు కల్పించాలని  అధికారులను ఆదేశించారు. గుడుంబా తయారీని అరికట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.  మేడారం ప్రధాన పూజారి  జగ్గారావు జాతరలో బెల్లం, కొబ్బరికాయల దుకాణాలు పూజారులకు కేటాయించాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కొబ్బరి కాయలు, బెల్లాన్ని పూజారులు అమ్ముకునే విధంగా చొరవ చూపాలని దేవాదాయ శాఖ ఈవో ను కలెక్టర్ ఆదేశించారు. 2024లో జరిగే మహా జాతరకు 8 నెలల ముందు అభివృద్ధి పనులు చేపడతామని కలెక్టర్ చెప్పారు. ఐటీడీఏ ఏటూరు నాగారం ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసి జాతరను పక్కాగా నిర్వహిస్తామన్నారు. డీఆర్వో కె. రమాదేవి, ఎక్సైజ్ అధికారి నాగేందర్​రావు,  సూపరింటెండెంట్​వి. శ్రీనివాస్, డీఎంహెచ్​వో అప్పయ్య,  డీపీవో వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

కమలాపూర్​ మార్కెట్​ను డెవలప్​ చేస్తా: ఎమ్మెల్సీ కౌషిక్​రెడ్డి

కమలాపూర్, వెలుగు: జమ్మికుంట మార్కెట్​లో కొనసాగుతున్న  కమలాపూర్​సబ్​మార్కెట్​ను పూర్తి స్థాయి మార్కెట్​గా
 తీర్చిదిద్దేందుకు  కృషి చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి అన్నారు. శుక్రవారం కమలా పూర్ ​పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.   చెరువులో చేపపిల్లలను వదిలిన అనంతరం ఆయన   సబ్​ మార్కెట్​ యార్డులో  రూ. 2 కోట్ల 78 లక్షలతో  నిర్మించిన వేబ్రిడ్జి​, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ  కుల వృత్తులకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటోందని, మత్సకార్మికులకు ఉచితంగా చేపపిల్లల పంపిణీతో మరింత ఉపాధి లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్​ చైర్మన్ ​బండ శ్రీనివాస్​, జడ్పీ చైర్మన్ సుధీర్​ కుమార్​, కనుమండ్ల విజయ, ఎంపీపీ తడక రాణి, జడ్పీటీసీ కల్యాణి, సింగిల్​ విండో చైర్మన్​ సంపత్​ రావు ఉన్నారు.

మెడికల్ హబ్ గా వరంగల్: మంత్రి దయాకర్ రావు

వరంగల్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ మెడికల్ హబ్ గా మారిందని , వైద్యుల సేవలు మరువ లేమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. శుక్రవారం కాకతీయ మెడికల్ కాలేజ్ ఆవరణలోని ఎన్నారై  బిల్డింగ్​లో  3 రోజుల పాటు నిర్వహించే దక్షిణ భారతదేశ ఫిజీషియన్స్ సదస్సు ప్రారంభమైంది. తెలంగాణ ఫిజీషియన్స్ కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి  మంత్రి దయాకర్ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఘనత  డాక్టర్లు, వైద్య సిబ్బందికి  దక్కిందన్నారు.  ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బాలాజీ తోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర,  ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి డాక్టర్లు పాల్గొన్నారు.

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు:   జిల్లాలో లింగనిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.శశాంక వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్​కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి  మాట్లాడుతూ జిల్లాలో సెక్స్​రేషియోలో భారీ వ్యత్యాసం ఉందని, దీనికి కారణమవుతున్న వారిపై  కఠిన చర్యలు తీసుకుంటేనే  కట్టడి చేయగలుగుతామన్నారు. పర్మిషన్​, అర్హత లేకుండా  ప్రైవేట్​హాస్పిటల్స్, స్కానింగ్​సెంటర్ల  నిర్వహిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రులను సీజ్ చేయాలని ఆదేశించారు.  

ఉప సర్పంచ్ పదవికి రాజీనామా

వెంకటాపూర్/ ములుగు, వెలుగు:  ములుగు మండలంలోని ఇంచర్ల  ఉపసర్పంచ్ సోననేని స్వప్న​తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు.  అనంతరం రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ గ్రామంలో అత్యవసర పనులు చేయాలని గ్రామసభ, జనరల్ బాడీ  దృష్టికి తీసుకెళ్లినా.. సర్పంచ్ మోరే రాజయ్య పట్టించుకోవడం లేదని ఆరోపించారు.  సర్పంచ్ తీరుతో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని,  పనులు చేయని పదవి ఎందుకని ప్రశ్నించారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. 

ప్రైవేట్ హాస్పిటల్​ కంటే మెరుగైన వైద్యసేవలు

సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్​

వెంకటాపూర్/ములుగు, వెలుగు: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ ​హాస్పిటల్స్​ కంటే మెరుగైన వైద్యసేవలందిస్తున్నామని సూపరింటెండెంట్​డాక్టర్​జగదీశ్​అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.  కొవిడ్​టైమ్​లో ఇతర జిల్లాల నుంచి పేషెంట్లు వచ్చి ట్రీట్​మెంట్​తీసుకోవడం గొప్ప విషయమన్నారు.  కొవిడ్​సంక్షోభం తర్వాత ఆస్పత్రిలో ఒక్కొక్కటిగా అన్ని స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. జిల్లాలో 80 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్నాయన్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం 30 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, నలుగురు సర్జన్ లు,  సిటీ స్కాన్, ఎక్స్ రే ల్యాబ్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.  కలెక్టర్  కృష్ణ ఆదిత్య ఫోకస్​పెట్టడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు.  ఈ కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

అపరిచిత వ్యక్తులతో అలర్ట్​గా ఉండాలి

జనగామ అర్బన్​, వెలుగు :  జనగామలో దొంగలు తిరుగుతున్నారని ప్రచారం జరుగుతుండడంతో.. ప్రజలు అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జనగామ సీఐ  శ్రీనివాస్​ కోరారు. శుక్రవారం ఆయన పీఎస్​లో మీడియా సమావేశంలో  మాట్లాడారు. పట్టణంలో వివిధ వ్యాపారాల  పేరుతో ఇంటింటికి తిరిగే వారిని ఈజీగా నమ్మవద్దన్నారు. షాపుల నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చి మేము సైతం కార్యక్రమాన్ని సక్సెస్​చేయాలని కోరారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తే ఇంటి పక్కవారికి , స్థానిక  పీఎస్​లో  తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని  సూచించారు.

కలుషితంకాని ఆహారం అందించాలి: కలెక్టర్​ సీహెచ్ ​శివలింగయ్య

జనగామ అర్బన్/జనగామ, వెలుగు : జీవన ప్రమాణాలు పెంచేందుకు కలుషితం లేని ఆహారం అందించడమే సామాజిక బాధ్యతగా గుర్తించాలని కలెక్టర్​ సీహెచ్​శివలింగయ్య కోరారు. శుక్రవారం కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్​హాల్లో  ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ సందర్భంగా  ఆహార భద్రత చట్టంపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి మీటింగ్ నిర్వహించారు. హాజరైన కలెక్టర్​మాట్లాడుతూ వినియోగదారుల సమాచార కేంద్రం ఏర్పాటు చేసి, అవగాహన పెంచుతామన్నారు.  తాగునీరు వల్లనే  కలుషితం పెరిగిపోతుందని, సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  కల్తీ ఆహారంపై నిఘా పెంచుతామని,  కంప్లైంట్లు స్వీకరించేందుకు డీఆర్డీవో ఆఫీస్​లో గ్రీవెన్స్​సెల్​ ఏర్పాటు చేస్తామన్నారు.  డీఆర్డీవో రాంరెడ్డి, డీఎస్​వో రోజారాణి, సివిల్​ సప్లై మేనేజర్​ సంధ్యారాణి, రైస్​ మిల్లర్స్​ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్​తదితరులు పాల్గొన్నారు. 

గ్రూప్​ వన్​ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో ఈ నెల 16న నిర్వహించే గ్రూప్–1 ప్రిలిమినరీ ఎగ్జామ్​కు  అన్ని  ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సీహెచ్​ శివలింగయ్య తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్​ హాల్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు.  జిల్లాలో 3, 410 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానుండగా.. 14 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఆధార్, ఓటర్,  పాన్ కార్డులలో ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని,  బూట్లు , శాండిల్స్ తో  ఎగ్జామ్​సెంటర్​లోకి పర్మిషన్​ఉండదన్నారు. బయోమెట్రిక్ విధానంలో హాల్ టికెట్ పరిశీలన ఉన్నందున ఉదయం 8 గంటలకే ఎగ్జామ్​సెంటర్​కు  చేరుకోవాలన్నారు. అడిషనల్​ కలెక్టర్​ అబ్దుల్​ హమీద్​, ఆర్డీవో మధుమోహన్​ తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులకు కలెక్టర్​ అభినందన

జనగామ అర్బన్​, వెలుగు :  అథ్లెటిక్స్​లో సత్తా చాటిన రంజిత్, ఉదయ్​కిరణ్ ను కలెక్టర్​ సీహెచ్​ శివలింగయ్య అభినందించారు. ఈ నెల 8 న హనుమకొండలోని జేఎన్ఎస్​ గ్రౌండ్​లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీనియర్​ అథ్లెటిక్ ​పోటీల్లో జనగామ జిల్లా తరఫున పాల్గొన్న టి. రంజిత్​ గోల్డ్​మెడల్, డిస్కస్​ త్రో లో బ్రాంజ్​మెడల్​ సాధించారు. అలాగే జి. ఉదయ్ ​కిరణ్​ అథ్లెటిక్స్​8 వందల మీటర్ల లో గెలుపొంది బ్రాంజ్ ​మెడల్​సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ క్రీడాకారులు పట్టుదలతో శ్రమించి భవిష్యత్​లో అనేక విజయాలు సాధించి, జిల్లా కీర్తిని పెంచాలని కోరారు. క్రీడాకారులకు తనవంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో డీవైఎస్​వో జీవీ గోపాలరావు, రాకేశ్​ 
తదితరులు పాల్గొన్నారు.

పాడి రైతులు మెలకువలు పాటించాలి: జిల్లా వెటర్నరీ ఆఫీసర్​వెంకటనారాయణ

ఎల్కతుర్తి, వెలుగు: పాడి రైతులు పశుపోషణలో మెలకువలు పాటిస్తూ అధిక లాభాలు పొందాలని హనుమకొండ జిల్లా వెటర్నరీ ఆఫీసర్​ డాక్టర్​ వెంకట నారాయణ సూచించారు. ఎల్కతుర్తి మండలం జీల్గుల గ్రామంలో వరంగల్​ కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్​ రాజన్న ఆధ్వర్యంలో పాడి రైతులకు శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా 45 పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స నిర్వహించి పలు ప్రైవేట్​కంపెనీల ద్వారా ఉచితంగా మందులు  పంపిణీ చేశారు. 202 పశువులకు లంపీ వైరస్​ టీకాలు ఇచ్చామని వెంకటనారాయణ చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాడి పశువులు త్వరగా గర్భధా రణ జరిగేలా చూడాలని, అప్పుడే పాల ఉత్పత్తి పెరిగి రైతులు ఆర్థికంగా బలోపేతమవుతారన్నారు.   ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకుడు శ్రీనివాస్, శాస్త్రవేత్తలు డాక్టర్ బీఎన్​ రెడ్డి, డాక్టర్ బీ రవీందర్,  డాక్టర్ దీపిక పాల్గొన్నారు.

సీపీఐ మహాసభలకు తరలిన  లీడర్లు

వరంగల్ లో రైలు ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు

వరంగల్​సిటీ,  వెలుగు: విజయవాడలో ఈ నెల 14 నుంచి18 వరకు జరుగనున్న సీపీఐ జాతీయ మహాసభలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కమ్యూనిస్టులు ప్రత్యేక రైలులో తరలివెళ్లారు. రైలును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శుక్రవారం వరంగల్ రైల్వే స్టేషన్​లో  జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..24 వ జాతీయ మహాసభలు విజయవాడలో ఘనంగా నిర్వహిస్తున్నామని,  ఉమ్మడి జిల్లా నుంచి 5వేల మంది  తరలివెళ్లారన్నారు. పాలకుల అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్​ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ  జాతీయ నాయకులు తక్కళ్లపల్లి  శ్రీనివాసరావు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, రాష్ట్ర నాయకులు టి. వెంకట రాములు, వరంగల్, హనుమకొండ జిల్లాల కార్యదర్శి మేకల రవి, కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ బాష్ మియా, తోట భిక్షపతి,కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బుస్సా రవీందర్  పాల్గొన్నారు.

యువతి అదృశ్యం

స్టేషన్​ఘన్​పూర్​(చిల్పూరు), వెలుగు: చిల్పూరు మండలం రాజవరం గ్రామ శివారులోని గేమ్యా తండాలో యువతి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏఎస్సై జయకుమార్ ​వివరాల ప్రకారం.. తండాకు చెందిన కూలీ పనులు చేసుకునే రమేశ్ కూతురు వసంత(19) ఐటీఐ పూర్తి చేసింది. కొన్ని నెలలుగా హైదరాబాద్​లో ఉంటూ కంప్యూటర్​ కోర్సులు నేర్చుకుంటోంది. ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. బుధవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు.  రమేశ్​ఎక్కడ  వెతికినా  కుమార్తె   ఆచూకీ   తెలియలేదు. దీంతో శుక్రవారం పోలీసులకు కంప్లైంట్​ చేశాడు. పోలీసులు కేసు ఫైల్​ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పీడీఎస్​ బియ్యం పట్టివేత

రేగొండ/నర్సంపేట/ నర్సింహులుపేట, వెలుగు: సీఎంఆర్ మిల్లులు పీడీఏస్​ బియ్యం నిల్వలకు అడ్డాలుగా మారాయి. ఇటీవల గణపురం, జిల్లా కేంద్రంలో పీడీఎస్​ బియ్యం పట్టుబడ్డ సంగతి తెలిసిందే. శుక్రవారం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నిజాంపల్లిలోని కేశవసాయి సీఎంఆర్​మిల్లులో టాస్క్​ ఫోర్సు పోలీసులు 40 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం  పట్టుకున్నారు.  బియ్యం వ్యాపారి బెల్లం శ్రీధర్​, మిల్లు యజమాని బొల్లబోయిన రమేశ్​పై కేసు నమోదు చేసి బియ్యాన్ని సివిల్ సప్లై ఆఫీసర్లకు అప్పగించినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. 

నర్సంపేటలో..

ఖానాపురం మండలం నాజీతండా దగ్గరలో టాస్క్​ఫోర్స్​ పోలీసులు రూ.52 వేల  విలువైన పీడీఎస్​ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు కొత్తగూడ  నుంచి ఓ వెహికల్​లో  పీడీఎస్​ బియ్యాన్ని తరలిస్తుండగా టాస్క్​ ఫోర్స్​ ఎస్సై లవణ్​కుమార్​ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు.  బియ్యం తరలిస్తున్న ఇద్దరు నిందితులను  అదుపులోకి తీసుకున్నారు. 

దంతాలపల్లిలో..

మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ రైస్ ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన పేర్ల సుబ్బమ్మ ఇంట్లో 10 క్వింటాళ్ల పీడీఎస్  బియ్యం నిల్వ ఉందనే సమాచారంతో దాడి చేసి సీజ్ చేశారు. మహిళకు సహకరించిన దాట్ల గ్రామానికి చెందిన సంపేట ప్రమీల పై కూడా  కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్వర్ చెప్పారు..