నిర్మల్, వెలుగు : నాలుగు నెలల నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ సానిటేషన్ సిబ్బంది ఆందోళనకు దిగారు. వేకువజాము నుంచే శానిటేషన్ పనులకు వెళ్లాల్సిన వారంతా నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ వెంటనే వారి దగ్గరికి వెళ్లి వేతనాల చెల్లింపునకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు.
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత శ్రీహరి రావు వేర్వేరుగా అక్కడికి చేరుకొని వారికి మద్దతు పలికారు. వెంటనే వారికి జీతాలు చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వెల్లడించారు. ఈ ధర్నాలో నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్, సామ రాజేశ్వర్ రెడ్డి, సాధం అరవింద్, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.