మునుగోడులో లోకల్ యూత్ పై పార్టీల ఫోకస్

మునుగోడు, వెలుగు: నామినేషన్ల ఘట్టం ముగియడంతో మునుగోడులో ఉపఎన్నికల ప్రచారం జోరందుకుంది. పగలంతా ఎలక్షన్ క్యాంపెయిన్ డీజే పాటలు, లీడర్ల ప్రచారంతో హోరెత్తుతున్న గ్రామాలు.. రాత్రయితే లిక్కర్ ఘాటుతో గుప్పుమంటున్నాయి. మద్యం మత్తులో ఊగిపోతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారానికి వచ్చిన పార్టీ క్యాడర్ తోపాటు లోకల్ యూత్ కు ప్రతి రోజూ దసరా పండుగలా మారింది. ఎమ్మెల్యే స్థాయి నేతలు గ్రామాలకు ఇన్ చార్జీలుగా వ్యవహరిస్తుండడం, వారికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఖర్చుకు వెనకాడడం లేదు. క్యాడర్ తోపాటు స్థానికులు కోరుకున్న లిక్కర్ బ్రాండ్, బీర్, చికెన్, మటన్ సప్లై చేస్తున్నారు. రోజూ మధ్యాహ్నం, రాత్రి కార్యకర్తలకు పెట్టే భోజనంలో చికెన్ తప్పనిసరిగా ఉంటోంది. నియోజకవర్గవ్యాప్తంగా అన్ని పార్టీలకు కలిపి రోజుకు సుమారు 15 క్వింటాళ్ల చికెన్ అమ్ముడవుతోంది.

లోకల్ యూత్ పై ఫోకస్

ప్రధాన పార్టీల నాయకులు లోకల్ యూత్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ప్రచారం కోసం వస్తే బైక్ లో పెట్రోల్, మధ్యాహ్నం భోజనం, రాత్రి దావత్ లో లోటు రానివ్వడం లేదు. బజార్లు, గ్రూపుల వారీగా యూత్ కు లిక్కర్ సప్లై చేస్తున్నారు. బై ఎలక్షన్ పుణ్యమా అని రోజూ మందు ఫ్రీగా దొరుకుతుండడంతో చాలా మందికి కొత్తగా లిక్కర్ అలవాటవుతోంది. అలాగే గతంలో 90 ఎంఎల్, ఒక్క బీర్ తో సరిపెట్టుకునేవాళ్లు ఇప్పుడు క్వార్టర్, హాఫ్, రెండు, మూడు బీర్లు ఈజీగా తాగేస్తున్నారు. తాగినోళ్లకు తాగినంత మందు అందుబాటులో ఉంటోంది. గతంలో ఏడాది మొత్తంలో జరిగే  లిక్కర్ అమ్మకాలు ఈ ఒక్క నెలలోనే కావడం ఆందోళన కలిగిస్తోంది. రాత్రి ఎక్కడ తిరిగినా 9 గంటల్లోపు ఇంటికి చేరుకునే యువత.. ఇప్పుడు అర్ధరాత్రయినా ఇల్లు చేరడం లేదు. గత రెండు, మూడు రోజులుగా ఈ పరిస్థితి ఎక్కువైంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలింగ్ తేదీకి రెండు వారాలు ఉందని, అప్పటిదాకా ఇలాగే తాగిస్తే ఆరోగ్యం సంగతేందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల పేరుతో మద్యానికి బానిసలుగా మారుస్తున్నారని, ఎన్నికలయ్యాక లిక్కర్ కోసం ఇళ్లలో జరిగే ఘర్షణలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

హుజూరాబాద్ ఎన్నికలకు మించి ఖర్చు..

రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ ఎన్నికలే కాస్ట్లీ ఎన్నికలుగా నిలిచిపోయాయి. ప్రస్తుతం మునుగోడు ఎన్నికల్లో లిక్కర్, డబ్బు ప్రవాహాన్ని చూస్తుంటే ఆ రికార్డును బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి మూడు నెలలుగా ప్రధాన పార్టీలు చేస్తున్న కోట్ల ఖర్చు చిన్నాచితక పార్టీలను బెంబేలెత్తిస్తున్నాయి. పార్టీల శ్రేణుల మోహరింపు, వారిపైన పెడుతున్న ఖర్చు, మద్యం కొనుగోళ్లు, నేతల కొనుగోళ్ల నుంచి రేపు ఓటర్ల కొనుగోలు వరకూ ఎన్నికల చరిత్రలో మునుగోడు బై ఎలక్షన్​​ సరికొత్త రికార్డు నెలకొల్పబోతోంది.

ఎన్నికల చుట్టాలకు అతిథి మర్యాదలు..

బై ఎలక్షన్ ప్రచారం కోసం అన్ని పార్టీలకు చెందిన నాయకులు, క్యాడర్ మునుగోడు గ్రామాల్లోనే అడ్డా వేశారు. వీళ్లలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నుంచి జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకుల వరకు ఉన్నారు. వీళ్లంతా ఆయా గ్రామాల్లో అతిథులయ్యారు. వీళ్లు పగలంతా ప్రచారం చేసుకుని రాత్రయ్యేసరికి తమకు కేటాయించిన ఇళ్లు, రూమ్స్​కు చేరుకుంటున్నారు. రాత్రి ఫ్రెష్ అయ్యేసరికి మందు బాటిళ్లు, చికెన్, మటన్ రెడీగా ఉంటున్నాయి. సరిగా  పట్టించుకోకుంటే ఏదో వంకతో క్యాడర్ ఇంటిబాట పడుతారనే భయంతో అతిథి మర్యాదలకు ఏలోటూ రానివ్వడం లేదు. 

బెల్టు షాపులకు ప్రచారం చేసినోళ్ల లిస్టు.. 

తాము ఇన్​చార్జిలుగా ఉన్న గ్రామాల్లో కొందరు లీడర్లు కొత్త ట్రెండ్​ మొదలు పెట్టారు. చౌటుప్పల్ మండలంలో మంత్రి మల్లారెడ్డి ఓపెన్​ మందు పార్టీ ఘటన తర్వాత చాలా వరకు అలర్టయ్యారు.  పొద్దంతా ప్రచారం చేసిన వాళ్ల లిస్టును గ్రామాల్లోని బెల్టుషాపులకు పంపిస్తున్నారు. ఆ రోజు ఎంత మంది వస్తారో, ఎన్ని బాటిళ్లు పోయాలో, ఏం స్నాక్స్​ పెట్టాలో కూడా చెబుతున్నారు. ఈక్రమంలో బెల్టుషాపుల వద్ద తాగేప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే ఇలాంటివి పోలీస్​స్టేషన్ల దాకా రానప్పటికీ ఎన్నికలు ముగిసేనాటికి ఏం జరుగుతుందోనని పబ్లిక్​ టెన్షన్​ పడ్తున్నారు.