ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో వృద్ధ దంపతుల మర్డర్‌మిస్టరీ ఇంకా వీడలేదు. ఇద్దరినీ దారుణంగా చంపేందుకు కారణాలు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. పక్కా ప్లాన్ ప్రకారం, ప్రొఫెషనల్స్ తరహాలో జరిగిన ఈ హత్యల వెనుక ఎవరున్నారు..? హత్యలకు మూడ్రోజుల కింద కిరాయికి దిగిన ఇద్దరు మహిళలే హంతకులా..? నగలు, నగదు ముట్టుకోకపోవడంతో ఎందుకు వారిని చంపాల్సి వచ్చింది..? ఈ ప్రశ్నల చిక్కుముడులకు ఇంత వరకు పోలీసులు కూడా సమాధానాన్ని కనిపెట్టలేకపోయారు. హంతకులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడం, క్రైమ్‌సీన్‌లో కారం చల్లడంతో క్లూస్దొరక్కపోవడంతో ఈ హత్యల వెనుక ఉన్న వారిని కనిపెట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది.
పోలీసులకు సవాల్‌గా మారిన కేసు..
నేలకొండపల్లిలో గత నెల 27న యర్రా వెంకట రమణ (60), కృష్ణ కుమారి(54) అనే దంపతులు వాళ్ల సొంతింట్లోనే హత్యకు గురయ్యారు. మూడు అంతస్తుల భవనంలో రెండో అంతస్తులో వారు నివాసం ఉంటున్నారు. వారికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు హైదరాబాద్‌లో సెటిల్ కాగా, కూతురి వివాహం కావడంతో జగ్గయ్యపేటలో ఉంటుంది. ఇంటి ఆవరణలో అదనంగా నాలుగు గదులు నిర్మించి అద్దెకు ఇస్తున్నారు.
దిండుతో ఊపిరి ఆడకుండా చేసి వాళ్లిద్దరినీ దుండగులు చంపేశారు. ఆ తర్వాత గదితో పాటు ఇంటి చుట్టూ కారం పొడి చల్లడంతో ఎలాంటి క్లూస్ లభించలేదు. ఇంట్లో మూడ్రోజుల కింద అద్దెకు దిగిన ఇద్దరు మహిళలే డబ్బులు, నగల కోసం హత్యలు చేసి ఉంటారని ముందు అనుమానించారు. ఈ ఘటన తర్వాత వాళ్లిద్దరూ కనిపించకపోవడం కూడా అనుమానాలకు కారణమైంది.
అయితే మృతురాలి మెడలో ఉన్న బంగారాన్ని ముట్టుకోకపోవడం, ఇంట్లో ఉన్న నగలు, నగదు పోకపోవడంతో దోపిడీ కారణం కాదని తేలింది. 10 రోజుల ముందు గది కిరాయి కోసం అడ్వాన్స్ ఇచ్చిన వారు, హత్యలకు ఒక రోజు ముందు మాత్రమే ఆ గదిలోకి వచ్చారు. తర్వాత రోజు నుంచి వాళ్లు కనిపించడం లేదు. దీంతో ఆ మహిళలే కారణమని తేలినా, వాళ్ల ఆచూకీ కనిపెట్టలేకపోయారు.
ముందుకు సాగని ఎంక్వైరీ..
మృతుడు వెంకటరమణ గతంలో రేషన్ బియ్యం వ్యాపారం చేసేవారు. అప్పటి గొడవలు ఏవైనా ఉన్నాయా..? రియల్ ఎస్టేట్ వివాదాలున్నాయా..? అని పోలీసులు ఆరా తీశారు. కొడుకు నరేశ్హైదరాబాద్లో సెటిల్ కావడంతో, ఇంట్లో కుటుంబపరమైన విభేదాలున్నాయా? అని కూడా ఎంక్వైరీ చేశారు. హత్య జరిగిన తర్వాత రోజు సమీపంలోని చెత్తకుప్పలో ఒక సెల్ ఫోన్దొరకగా, దాన్ని పోలీసులు విశ్లేషించినా హత్యకు సంబంధించి ఆధారాలు దొరలేదు. గతంలో అద్దె గదుల్లో నివాసం ఉన్న వారు, పాత శత్రుత్వాలు ఇలా పలు రకాల్లో పోలీసులు ఎంత జల్లెడపడుతున్నా కేసులో పురోగతి మాత్రం కనిపించడం లేదు.
ఒంటరి మహిళలు, యువకులకు ఇల్లు అద్దెకు ఇవ్వడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని పోలీసులు గుర్తించారు. నేలకొండపల్లి మండలంలోని షుగర్ ఫ్యాక్టరీలో ఎక్కువగా ఏపీకి చెందిన కార్మికులు వచ్చి పని చేస్తుంటారు. మరోవైపు ఖమ్మం–కోదాడ హైవే పనులు జరుగుతుండగా, ఈ పనుల కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి వందలాది మంది కార్మికులు వచ్చి పోతూ ఉంటున్నారు. దీంతో వారికి ఈ హత్యలతో సంబంధం ఉందా? అనే కోణంలోనూ ఎంక్వైరీ చేస్తున్నారు.
కేసును దర్యాప్తు చేస్తున్నాం
వృద్ధ దంపతుల హత్య కేసులో ఎంక్వైరీ కొనసాగుతోంది. కుటుంబ వివాదాలు, దోపిడీ, పాత గొడవలు ఇలా అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నాం. దొరికిన ఆధారాల ప్రకారం దర్యాప్తు చేస్తున్నాం. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను స్వాధీనం చేసుకున్నాం. త్వరలోనే అసలైన దోషులను పట్టుకుంటాం.– తిరుపతి రెడ్డి, ఖమ్మం రూరల్ ఏసీపీ