72 ఏళ్ల స్వతంత్రం. 14 మంది ప్రధాన మంత్రులు. నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్‌పేయి వంటి ఒకటికి రెండు మూడుసార్లు ప్రధానులుగా చేసినవాళ్లుకూడా ఉన్నారు. దేశాన్ని అటు సంక్షేమంగా, ఇటు ఆర్థికంగా డెవలప్ చేసి తమ ముద్రను బలంగా వేసిన పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి వాళ్లున్నారు. వీరికి సంబంధించిన జ్ఞాపకాలు ఒకచోటకు చేర్చాలన్న ఆలోచనమాత్రం ఇప్పటివరకు ఎవరికీ రాలేదు. వరుసగా రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ ఈ లోటు తీర్చాలని నిర్ణయించుకున్నారు.
దీనికోసం ఢిల్లీలోని తీన్ మూర్తి కాంప్లెక్స్‌ని ఎంచుకున్నారు. 30 ఎకరాలలోగల ఈ కాంప్లెక్స్‌ని… 1930లో సుప్రసిద్ధ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ టోర్ రస్సెల్ డిజైన్ చేశారు. తీన్ మూర్తి కాంప్లెక్స్‌కి, నెహ్రూ కుటుంబానికి విడదీయలేని బంధం ఉంది. దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ సుమారు 16 ఏళ్ల పాటు నివసించినచోటు అది.
ప్రధాని ఊహిస్తున్న ఈ మ్యూజియంలో ఇప్పటికే పని ఆరంభమైంది. తీన్ మూర్తి భవన్‌లోనే 10,000 చదరపు మీటర్లలో నిర్మించబోయే ఈ మ్యూజియంలో… ప్లాన్ డాక్యుమెంట్ ప్రకారం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లకు సంబంధించిన సకల సమాచారాన్ని పొందుపరుస్తారు. దేశానికి వారందించిన సేవల వివరాలను, పరిశోధనకు కావలసిన విజన్ డాక్యుమెంట్లను, వారు ఉపయోగించిన వస్తువులు, వారుసేకరించినవి అరుదైన జ్ఞాపికలను ప్రదర్శిస్తారు. రీసెర్చర్లకు అందుబాటులో ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. మ్యూజియం నిర్మాణపు ప్లాన్‌ని అంతర్జాతీయ స్థాయిలో పోటీ నిర్వహించి ఓకే చేశారు. సిక్కా అసోసియేట్స్ ఇచ్చిన డిజైన్ ప్రకారం నిర్మాణం జరుగుతోంది.
ఇండియన్ డెమొక్రసీకి ఇదొక అద్భుత నమూనాగా నిలుస్తుందనడంలో సందేహం ఉండదంటున్నారు. ఇప్పటివరకు ఆయా ప్రధాన మంత్రులు సాధించిన ల్యాండ్‌మార్క్ లక్ష్యాలు, నిర్ణయాలు, ఆలోచనావిధానాలు, వారి సేవలు అన్నీ డిజిటలైజేషన్ చేస్తారని ప్లాన్ డాక్యుమెంట్చెబుతోంది. ఆయా ప్రధానుల ఫొటోలు, వారి చేతిరాతలు, ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలు అన్నీకూడా ఉంటాయి. ఈ మ్యూజియం ఖర్చు మొత్తం 2226.20 కోట్ల రూపాయలుగా అంచనా. ఈ మొత్తంలోనే డిజిటల్ మ్యూజియంకోసం 89 కోట్లను కేటాయించారు. సాధారణంగా మ్యూజియంలకు వచ్చే విజిటర్లు మాత్రమేకాకుండా, విద్యార్థులు, టూరిస్టులు, మేధావులు… ఇలా సొసైటీలోని అన్ని వర్గాలవారిని ఆకట్టుకునేలా ‘ప్రధానుల మ్యూజియం’ని రూపొందిస్తున్నారు.
ఒక్కొక్క ప్రధాని జీవిత విశేషాలను, ఇతర సమాచారాన్ని డిజిటల్ స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్‌తో సిద్ధం చేస్తున్నారు. విజిటర్లకు చక్కటి అనుభవం మిగిలేలా ఆత్యాధునికమైన త్రీ–డీ టెక్నిక్‌ని, టచ్ స్క్రీన్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఆయా ప్రధానుల జీవిత కాలంలోకి వెళ్లి స్వయంగా తెలుసుకునే అనుభూతికోసం టైమ్ మెషీన్ తరహాలో ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఆడియో–విజువల్ ప్రొజెక్షన్, హాలోగ్రామ్లుకూడా జోడిస్తున్నారు. మోడీ సర్కారు పెట్టుకున్న టార్గెట్ ప్రకారం దీనిని 2020 అక్టోబర్‌లో ప్రారంభించాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశానికి విశేష సేవలందించిన 14 మంది ప్రధాన మంత్రుల గురించి తెలుసుకునే అవకాశం ఈ మ్యూజియంద్వారా ప్రపంచానికి లభించనుంది.