మూసీపే సవాల్.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తోన్న కాంగ్రెస్, బీఆర్ఎస్..!

మూసీపే సవాల్.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తోన్న కాంగ్రెస్, బీఆర్ఎస్..!

హైదరాబాద్: మూసీ ప్రక్షాళన అంశం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‎గా మారింది. అధికార పార్టీ మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును సీరియస్ గా తీసుకొని రివర్ బెడ్ లో నిర్మించిన ఇండ్లను కూల్చివేస్తోంది. నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తోంది. దీనిని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు గులాబీ పార్టీ యత్నిస్తోంది. దానిని అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు అటు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. దీనిపై ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు గ్రేటర్ పరిధిలోని కీలక నేతలు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహిస్తోంది. 

మూసీ ద్వారా తలెత్తే ఇబ్బందులు, నిర్వాసితులకు పునరావాసం అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది.  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‎లో గ్రేటర్  హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించారు. ఈ సమావేశానికి మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి,  సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వ్యక్తిగత కారణాలతో గైర్హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ప్రాభవం కోల్పోవడం.. వచ్చే ఏడాది డిసెంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనుండటంతో ప్రజల్లోకి వెళ్లేందుకు హైడ్రా, మూసీ అంశాలను బలమైన అస్త్రాలుగా వినియోగించుకోవాలని సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. 

ALSO READ | కులగణనను స్వాగతిస్తున్నం : ఎమ్మెల్సీ కోదండరాం

ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. మూసీ సుందరీకరణ వెనుక భారీ స్కాం ఉందనే ఆరోపణను ఎస్టాబ్లిష్ చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చ జరిగినట్టు సమాచారం. తాము అధికారంలో ఉన్నప్పుడు 16 వేల కోట్లతో సుందరీకరణకు ప్రణాళిక చేశామని, దానిని రేవంత్ సర్కారు లక్షా యాభై వేల కోట్లకు పెంచిందనే ఆరోపణను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం సైతం కుదేలైందని ఆరోపిస్తోంది. 

తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ రెడీ

మూసీ, హైడ్రా అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు యత్నిస్తున్న బీఆర్ఎస్ ఎత్తులను చిత్తు చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సైతం అదే స్థాయిలో రెడీ అవుతోంది. బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే మూసీ సుందరీకరణ అంశం తెరమీదకు వచ్చిందని, కేసీఆరే మూసీని థేమ్స్ నది తరహాలో తీర్చిదిద్దుతామని పలుమార్లు చెప్పారని, ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి సుధీర్ రెడ్డిని చైర్మన్ గా నియమించారు. దీనిపై గత సర్కారు లోన్ కూడా తీసుకుందనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని గ్రేటర్ నాయకులకు పీసీసీ చీఫ్​ సూచించనున్నారు. 

అధికారం కోల్పోగానే కొత్త పల్లవి అందుకున్నారని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు కార్పొరేటర్లు, గ్రేటర్ లీడర్లకు వివరించనున్నారు. మూసీ ప్రక్షాళన వల్ల మురికి కాల్వ పక్కన ఉన్న ఇరుకు ఇంట్లోంచి డబుల్ బెడ్రూం ఇంటికి వెళ్తారని, ట్రాన్స్ పోర్టేషన్ ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుందనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంతా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. మూసీని అలాగే వదిలేస్తే హైదరాబాద్ నగర ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని, అందరి బాగుకోసం కలిసినడుద్దామనే నినాదాన్ని తెరమీదకు తెచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది.