రంగులకు బదులు బూడిదతో హోలీ.. ఎక్కడ ఎందుకో తెలుసా.?

 రంగులకు బదులు బూడిదతో హోలీ.. ఎక్కడ ఎందుకో తెలుసా.?

హోలీ అనగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. కలర్​ఫుల్​ ప్రపంచం కళ్లముందు మెదులుతుంది. పిల్లలు, పెద్దలు అని లేకుండా అందరూ ఎంజాయ్ చేసే పండుగ ఇది. రోజంతా ఆటపాటలతో సందడి చేస్తూ.. నోరూరించే స్వీట్లు తింటూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే, ఈ పండుగ జరుపుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 

ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి వేళ హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది మార్చి14న హోలీ పండుగ రాబోతుంది. ఈ పండుగకు పాటించాల్సిన మొదటి రూల్​ రసాయనాలు కలిసిన కలర్స్​కి దూరంగా ఉండాలి. అలా ఉండాలంటే.. నేచురల్ కలర్స్ వాడాలి. పూర్వకాలంలో ఈ పండుగ నాడు సహజ రంగులనే చల్లుకునేవాళ్లు. అందుకోసం ముందుగా ఎండిన పూలను, ఇతర ఆకులతో కలిపి రంగులు తయారుచేసేవాళ్లు. ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ చాలామంది అనుసరిస్తున్నారు. పైగా దానివల్ల సహజరంగులు వాడడం వల్ల చర్మ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అంతేకాదు.. ఆయుర్వేదంలోనూ ఈ పండుగ గురించి ప్రస్తావన ఉంది. వేసవి వచ్చేటప్పుడు వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా జలుబు, జ్వరం వంటివి వస్తుంటాయి. అవేవీ రాకుండా ఉండాలంటే ప్రకృతిలో దొరికే ఔషధగుణాలున్న పూలు, ఆకులను వాడాలి. వాటిని ఎండబెట్టి పొడి చేసి నీళ్లలో కలిపి ఈ వేడుకలో చల్లుకునేవారు అప్పట్లో. ఒక్కో రంగు కోసం వివిధ రకాల పూలు, పదార్థాలు వాడతారు.  ఆ పొడిని నీళ్లలో కలిపి చల్లుకుంటారు. 

బూడిదతో హోలీ

హోలీ రోజూ ప్రత్యేకత గురించి దేశంలోనే వివిధ ప్రాంతాల్లో రకరకాల పురాణ కథలు వినిపిస్తాయి. కానీ ప్రజలు మాత్రం ఈ పండుగను రంగులతోనే సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక్కో రంగు ఒక్కో ఎమోషన్​కి సాదృశ్యంగా భావిస్తారు. అయితే ఒక్కచోట మాత్రం బూడిదతో హోలీ చేసుకుంటారు. మసాన్​ హోలీ పేరుతో కాశీలో రెండు రోజులపాటు ఈ వేడుకలు జరుగుతాయి. కాశీలోని మణికర్ణిక ఘాట్ దగ్గర సాధువులంతా సమావేశమవుతారు. శివభజన, ఆటపాటలతో ఘనంగా హోలీ వేడుకలు చేస్తారు. చితా భస్మాన్ని ఊదుతూ ఈ పండుగ జరుపుకుంటారు. మసాన్ అంటే మృతదేహాన్ని దహనం చేసే ప్రదేశం అని అర్థం. మసాన్​ హోలీ అంటే మరణ పండుగతో సమానం. పురాణాల ప్రకారం శివపార్వతుల వివాహానికి రాక్షసులు, యక్షులు, గంధర్వులకు ఆహ్వానం అందుతుంది. ఆ వివాహం తర్వాత శివపార్వతులు తొలిసారి కాశీకి వెళ్లి,  అక్కడ హోలీ ఆడారు. అది చూసిన రాక్షసులు, యక్షులు తమతో హోలీ ఆడాలని శివుణ్ని కోరగా, తమ భక్తులు భావోద్వేగాలకు దూరంగా ఉంటారనేందుకు గుర్తుగా మసాన్ బూడిదతో వాళ్లు హోలీ వేడుకలు జరుపుకున్నారు. అప్పటి నుంచి కాశీలో ఈ వేడుకలు ప్రతి ఏటా జరుగుతున్నాయి.