మనిషి సాంకేతికంగా ఎంత ఎదిగినా..మనిషికి ఆధారం భూమి

మనిషి సాంకేతికంగా ఎంత ఎదిగినా..మనిషికి ఆధారం భూమి. సౌర కుటుంబంలో గల 8 గ్రహాలలో భూమి ఒక్కటే  వివిధ జీవ జాతుల నివాసానికి అనుకూలమైన గహ్రం. భూమంటే 84 లక్షల జీవరాశుల సముదాయం. ‘ఎర్త్’ అనేపేరు జర్మనీ భాష నుంచి సంగ్రహించబడినది. అమెరికన్ సెనేటర్ గెలార్డ్ నెల్సన్ పర్యావరణ పరిరక్షణకై ఏప్రిల్ 22ను ఎర్త్ డేగా (ధరిత్రి దినోత్సవం) ప్రకటించాడు. మొదటి ధరిత్రి దినోత్సవం 1970 ఏప్రిల్ 22 నాడు అమెరికాలో నిర్వహించబడినది. ఆ రోజు 20 మిలియన్ల అమెరికన్ ప్రజలు వివిధ  పర్యా వరణ సమస్యలపై ప్రదర్శనలు నిర్వహించారు. దాని ఫలితంగా 1970వ సంవత్సరంలో పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పా టు చేశారు. మొదటి ధరిత్రి దినోత్సవం పర్యా వరణ పరిరక్షణ చట్టాల రూపకల్పనకు నాంది పలికింది.

జీవకోటి మనుగడ భూమాత

ధరిత్రి దినోత్సవాన్ని 2009 నుంచి ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే’గా మార్చింది.  మొత్తం 193 దేశాలు ‘ఎర్త్ డే’లో భాగమవుతున్నా యి. 2023 సంవత్సరపు ఎర్త్ డే థీమ్​గా ‘మన గ్రహం కోసం ఖర్చు చేయండి’ ని ఎంచుకోవడం జరిగింది. అది భూమిని, అది పర్యావరణ వ్యవస్థలను మానవాళి యొక్క ఉమ్మడి నివాసంగా గుర్తిస్తుంది . ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి, వాతావరణ మార్పు లను ఎదుర్కో వడానికి, జీవవైవిధ్యం పతనాన్ని ఆపడానికి భూమిని రక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలపై మనిషి, అనంత జీవరాశి మనుగడ ఆధారపడి ఉన్నది. అందుకనే పంచభూతాలను దైవంగా భావిస్తారు. పంచభూతాలలో దేనికి నష్టం వాటిల్లినా భూమిపై గల జీవరాశి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టి భూమిని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన ఉన్నది. 

శిలాజ ఇంధనం వాడకం మానేయాలి

భూమికి ప్రమాదకారిగా మారిన  మొదటి అంశం వాతావరణ మార్పులు. ఈ మార్పులకు ముఖ్య కారణం గ్లోబల్ వార్మింగ్. బొగ్గు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలను మండించటం వలన కార్బన్ డయాక్సైడ్ వంటి హరిత వాయువుల పరిమాణం వాతావరణంలో పెరిగి క్రమంగా భూమిపైఉష్ణోగ్రతలు పెరుగుతున్నా యి. దీని వలన సముద్రనీటి మట్టాలు పెరిగి, భూమి అంతయు నీటిచే కప్పబడి భూమి కనుమరుగయ్యేఅవకాశం ఉన్నది. గ్లోబల్ వార్మింగ్ ను నివారించాలి అంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, వాటిస్థానంలో సోలార్ విద్యుత్తు, పవన విద్యుత్, జియో థర్మల్ ఎనర్జీ, జీవ ఇందనాలు, గ్రీనరీ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక ఇంధనాలను వినియోగించాలి. ప్రస్తుతం బొగ్గును లేదా పెట్రోలు మండించడం ద్వా రా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఇది గ్లోబల్ వార్మింగ్​కు దారితీస్తుంది. కాబట్టి అనవసరపు విద్యుత్ వినియోగాన్ని నివారిస్తే కొంతమేర గ్లోబల్ వార్మింగ్ ను నివారించవచ్చు. ఈమధ్యకాలంలో శిలాజ ఇంధన వాహనాల స్థానంలో లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే వాహనాలు ప్రాచుర్యం లోనికి వచ్చాయి. లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే వాహనాలు గాలి కాలుష్యాన్ని, శబ్దకాలుష్యాన్ని నివారిస్తాయి. కానీ లిథియం అయాన్ బ్యా టరీ తయారీలో ఉపయోగించే లిథియం, కోబాల్ట్, గ్రాఫైట్ వంటి ముడిపదార్థాలను భూమి నుంచి వెలికి తీసే మైనింగ్ పద్ధతి అనేక పర్యావరణ, సామాజిక సమస్యలకు దారితీస్తుందని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ ​అండ్ డెవలప్మెంట్ నివేదిక పేర్కొన్నది. కాబట్టి లిథియం అయాన్ బ్యాటరీ వాహనాలు పూర్తిగా పర్యా వరణ అనుకూలమైనవి కావు. కాబట్టి వాటి  స్థానంలో సోడియం అయాన్ బ్యాటరీతో నడిచే విద్యుత్ వాహనాలు వాడుకలోకి రానున్నాయి. సోడియం అయాన్ బ్యాటరీ తయారీకి కావలసిన ముడిపదార్థం  సముద్ర ఉప్పు నుంచి పొందవచ్చు. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది. ఇప్పటికే హరిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలు కొంత మేర భారత దేశంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రయోగ దశలో ఉన్నాయి. 

3ఆర్ పద్ధతితో వ్యర్థాలను అరికట్టాలి

భూమికి ప్రమాదకారిగా మారిన మరొక అంశం ఘన, ద్రవపదార్థ వ్యర్ధాలను సరైన పద్ధతిలో పారవేయకపోవడం. భారతదేశంలో సంవత్సరానికి 65 మిలియన్ టన్ను ల వ్యర్ధాలు ఉత్పత్తి అవుతున్నా యి. ఈవ్యర్ధాలను సరైన పద్ధతిలో పారవేయక పోవడం వలన విపరీతమైన నేల కాలుష్యం, జల కాలుష్యం ఏర్పడుతున్నా యి. ఈ వ్యర్ధాల పరిమాణాన్ని 3ఆర్ పద్ధతి అవలంబించడం ద్వారా తగ్గించవచ్చును. ఈ పద్ధతి అనగా వస్తువుల వాడకాన్ని తగ్గించడం, వాడిన వస్తువులను తిరిగి ఉపయోగించడం, వాడిన వస్తువుల నుంచి తిరిగి కొత్త వస్తువులను తయారు చేయడం. గృహ జల వ్యర్ధాలు, పరిశమ్రల నుంచి వచ్చే జల వ్యర్ధాలను నీటి వనరులలోకి వదలటం వల్ల కలుషితమై జల కాలుష్యానికి దారితీస్తుంది. కాబట్టి గృహ జల వ్యర్ధాలను, పరిశమ్రల నుంచి వచ్చే జల వ్యర్థాలను పూర్తిగా శుద్ధిచేసి గార్డెనింగ్ వృక్షాలకు తిరిగి ఉపయోగించడం వలన జల వ్యర్థాల కాలుష్యాన్ని నివారించవచ్చు.

అడవులే పుడమికి రక్ష

ప్లాస్టిక్ వినియోగం పెనుభూతంగా మారింది. దాని వాడకాన్ని నిషేధించి, సహజ సిద్ధంగా భూమిలో త్వరగా కలిసి పోయే వస్తువులను వాడటం వలన భూమిని ప్లాస్టిక్ పెనుభూతం నుంచి రక్షించుకోవచ్చు. భూమికి ప్రమాదకారిగా మారిన మరొక అంశం అడవుల నరికివేత. భూమి 30 శాతం అడవులతో కప్పబడిఉంది. వృక్షాలు లేకుండా భూమిపై జీవుల మనుగడ ఊహించడం కష్టం. కారణం జీవుల మనుగడకు అతి ప్రధానమైన గాలి, వృక్షాల నుంచి ఉత్పత్తి అవుతుంది. భూగోళంపై వాతావరణ మార్పులను నివారించడానికి  గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని తగ్గించడంలో వృక్షాలు అతికీలకపాత్రను పోషిస్తాయి. గ్లోబల్ వార్మింగ్​కు ప్రధాన కారణమైన కార్బన్ డయాక్సైడ్ వాయువును వృక్షాలు గ్రహించి దానిని జీవరాశికి అవసరమైన ఆక్సిజన్ గా, ఆహారంగా మారుస్తాయి. భూగోళాన్ని కాపాడుకోవాలి అంటే మానవ సమాజం ‘ఎర్త్ సెంట్రిక్’ ఆలోచన విధానాన్ని అవలంబించాలి. అంటే మానవుడు తాను ఈ భూగోళంపై ఇతర జీవుల వలె ఒక జీవిగా భావించి తన చుట్టూ ఉన్న ప్రకృతికి, జీవరాశికి హానిచేయకుండా తాను బ్రతకాలి, ఇతర జీవులను బతికించాలి.
- డా. శ్రీదరాల రాము,ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్