- బాబా సిద్దిఖీ హత్యతో మార్మోగుతున్న లారెన్స్ బిష్ణోయ్ పేరు
- జైలులో నుంచే దాడులకు ప్లానింగ్, అమలు
- గ్యాంగ్‌లో 700 మంది షూటర్లు.. ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్
- రాజకీయ నేతలు, సెలెబ్రెటీల్లో పెరిగిపోతున్న టెన్షన్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ గ్యాంగ్‌స్టర్ ఎప్పుడు, ఎవరిని చంపేస్తాడోనని అటు రాజకీయ నేతల్లో, ఇటు సెలెబ్రెటీల్లో భయం మొదలైంది.
ముంబైలో ఒకప్పటి మాఫియాను మళ్లీ తీసుకొచ్చాడని చెబుతున్న లారెన్స్ బిష్ణోయ్ అసలు ఎవరు..? అతని నేపథ్యం ఏమిటి..? 30 ఏండ్లకే ఇంత నేర సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు..? జైలులో ఉండి కూడా ప్రముఖులను ఎలా హత్య చేయిస్తున్నాడు..? దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్, అబూ సలేం, ఛోటా రాజన్ వంటి అండర్ వరల్డ్ డాన్‌లు పారిపోయాక దేశంలో ప్రశాంతత నెలకొందనుకుంటే మళ్లీ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్ ఎలా పుట్టుకొచ్చాడు? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.
ఎవరీ లారెన్స్ బిష్ణోయ్..?
లారెన్స్ బిష్ణోయ్ అలియాస్ సత్వీందర్ సింగ్ 1993 ఫిబ్రవరి 12న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా ధత్తరన్వాలి గ్రామంలో జన్మించాడు. తండ్రి హర్యానా పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. బిష్ణోయ్12వ తరగతి వరకు అబోహర్ అనే చిన్న పట్టణంలోని పాఠశాలలో చదువుకున్నాడు. 2010లో చండీగఢ్ వెళ్లి డీఏవీ కాలేజీలో చేరాడు. అక్కడే అతని నేర సామ్రాజ్యానికి తొలి అడుగు పడింది. ఆ తర్వాత విద్యార్థి నాయకుడిగా బిష్ణోయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ వర్సిటీలోనే గోల్డీ బ్రార్ పరిచయం అయ్యాడు.
విద్యార్థి నాయకుడి నుంచి గ్యాంగ్ స్టర్‌గా..
విద్యార్థి రాజకీయాల్లో ఉన్న బిష్ణోయ్.. హత్యాయత్నాలు, దాడి, దోపిడీ వంటి నేరాలకు పాల్పడ్డాడు. అతనిపై అనేక కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి ముఠా వర్గాల్లో బిష్ణోయ్‌కు పెద్దన్నగా పేరొచ్చింది. ఎల్ఎల్బీ పట్టా పొందిన తర్వాత బిష్ణోయ్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మద్యం అక్రమ రవాణా, ఆయుధాల స్మగ్లింగ్, ఇతర నేరస్తులకు ఆశ్రయం కల్పించడం తదితర పనులు చేశాడు. మద్యం మాఫియా, పంజాబీ గాయకులు, ఇతర సెలబ్రీటీల నుంచి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ డబ్బు వసూలు చేసింది. 2014లో బిష్ణోయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినా అతడి నేరాలు ఆగలేదు.
గ్యాంగ్‌లో 700 మంది షూటర్లు
బిష్ణోయ్ ఎక్కువ కాలం కటకటాల వెనుకే గడిపాడు. ఆ సమయంలో అతను ఇతర నేరస్తులతో పొత్తులు పెట్టుకున్నాడు. బెయిల్‌పై బయటికి వచ్చినప్పుడు అనుచరులను పెంచుకున్నాడు. ప్రస్తుతం బిష్ణోయ్ గ్యాంగ్‌లో 700 మందికి పైగా షూటర్లు ఉన్నారని, ఇందులో 300 మంది పంజాబ్ కు చెందినవారేనని సమాచారం. ఒకప్పుడు పంజాబ్‌కు మాత్రమే పరిమితమైన ఈ గ్యాంగ్.. ఇప్పుడు మహారాష్ట్రలో ఉనికి కోసం ప్రయత్నిస్తోందని అంటున్నారు.
జైలులో నుంచే హత్యలు
బిష్ణోయ్ జైలులో ఉన్నప్పటికీ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడని స్పష్టమైంది. జైల్లోని తన సహాయకులతో వాయిస్ ఓవర్ ఐపీ కాల్‌లు, వీడియో కాల్‌లను ఉపయోగించి కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నాడు. సమాజంలో బాగా పేరున్న వారిని హత్య చేస్తే తమ పేరు బాగా ప్రచారమవుతుందని బిష్ణోయ్ యోచన. ఈ హత్యలతో ప్రత్యర్థి గ్యాంగ్‌లకు కచ్చితమైన వార్నింగ్ కూడా పంపవచ్చని భావించాడు. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీ హత్యలు ఈ కోవలోకే వస్తాయి. దీంతో ఉత్తర భారతంలోనే అత్యంత భయానక గ్యాంగ్‌గా బిష్ణోయ్ గ్యాంగ్ పేరు తెచ్చుకొంది.
సల్మాన్ ఖాన్‌పై పగ ఎందుకంటే..
బిష్ణోయ్ కమ్యూనిటీ అత్యంత పవిత్రమైన జంతువుగా పూజించే కృష్ణజింకను సల్మాన్ ఖాన్ వేటాడారు. 1998లో షూటింగ్ కోసం జైపూర్ వెళ్లినపుడు జరిగిందీ సంఘటన. దీనికి సంబంధించి ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇప్పటికీ కోర్టు విచారణ జరుగు తోంది. తమకు పూజ్యనీయమైన కృష్ణజింక ను వేటాడడంతో సల్మాన్‌పై బిష్ణోయ్ కమ్యూనిటీ ఆగ్రహంగా ఉంది. ఇదే కమ్యూనిటీకి చెందిన లారెన్స్ కూడా సల్మాన్ ఖాన్‌పై పగ పెంచుకున్నాడు. సల్మాన్‌ను చంపేస్తానంటూ బహిరంగంగానే ఛాలెంజ్ చేశాడు. 2018 నుంచి సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ గ్యాంగ్ పనిచేస్తోంది.