- నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సంచలన నిర్ణయం
- ఈఆర్వోల పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయండి
- అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసులో కీలక మలుపు
హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వీ శ్రీనివాస్ గౌడ్ తన అఫిడవిట్ ను ట్యాంపరింగ్ చేశారని రాఘవేందర్ రాజు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. అఫిడవిట్ ట్యాంపరింగ్ కు పాల్పడిన మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. మంత్రితోపాటు నలుగురు ఐఏఎస్ అధికారులపైనా కేసులు నమోదు చేయాలని తెలిపింది. ఎన్నికల కమిషన్ కు సంబంధించి స్టేట్, సెంట్రల్ ఆఫీసర్లపైనా, రిటర్నింగ్ అధికారులపైనా ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఓ మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు కానుండటం విశేషం. ఇదిలా ఉండగా రాఘవేందర్ రాజు వేసిన పిటిషన్ కొట్టేయాలని కోరుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కేసు పూర్వాపరాలు తెలియకుండా, పిటిషన్ ను పరిశీలించకుండా తాము ఏ నిర్ణయమూ తీసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది.
కేసు నమోదైతే..!
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత విచారణ ప్రారంభమవుతుంది. పిటిషనర్ తో పాటు మంత్రి స్టేట్ మెంటు రికార్డు చేస్తారు. పిటిషనర్ దగ్గర ఉన్న ఆధారాలను సేకరిస్తారు. ట్యాంపరింగ్ ఎలా జరిగింది..? ఎవరు సహకరించారు..? ఏయే అంశాలను మార్చారు..? ఈ మార్పునకు సహకరించిన అధికారులు ఎవరు..? దీని వెనుక ఎవరి హస్తం ఉంది. నామినేషన్ల స్క్రూట్నీ ప్రక్రియ ఎలా సాగింది...? అధికారులు వాటిని గమనించలేదా..? స్క్రూట్నీ తర్వాతే ట్యాంపరింగ్ జరిగిందా..? అనే అంశాలపై పోలీసులు లోతైన విచారణ జరిపి ప్రజాప్రతినిధుల కోర్టుకు సమర్పించాల్స ఉంటుంది తదుపరి ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకొని తీర్పు వెలువరించే అవకాశం ఉంది.