దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్ గుట్టును నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రట్టు చేసింది. సింథటిక్ రసాయనాల ఆధారిత మాదక ద్రవ్యాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసింది. నిందితులు క్రిప్టోకరెన్సీతో డార్క్ వెబ్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని గుర్తించింది.
లైసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్ (LSD) 15,000 బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ వెల్లడించారు. ఒకే ఒక ఆపరేషన్‌లో ఇంత భారీ స్థాయిలో ఎల్ఎస్‌డీ బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పారు. నిందితులు డార్క్ నెట్ ద్వారా క్రిప్టో వాలెట్స్, క్రిప్టోకరెన్సీలను ఉపయోగించి లావాదేవీలు జరుపుతున్నారన్నారు. కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య భౌతిక సంబంధాలు ఉండవని చెప్పారు.
https://twitter.com/ANI/status/1665991390063644673
మాదకద్రవ్యాల నెట్‌వర్క్ పోలాండ్, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ తో పాటు రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ- వంటి ప్రాంతాలకు విస్తరించి ఉందని NCB అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో 2.5 కేజీల మారిజువానాను, రూ.24.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎల్ఎస్‌డీని 0.1 గ్రాము కన్నా ఎక్కువగా కలిగియుండటం చట్ట ప్రకారం నేరం. ఇది హయ్యర్ గ్రేడ్ మాదక ద్రవ్యం కాబట్టి దీని విలువ కూడా ఎక్కువేనని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. పట్టుబడిన ఎల్‌ఎస్‌డీ వాసన, రుచి లేదని, పుస్తకాల సహాయంతో రవాణా చేయడం వల్ల గుర్తించడం చాలా కష్టమైందని చెప్పారు.
https://twitter.com/ANI/status/1665978471519248385