రాయ్​పూర్​లోనైనా కాంగ్రెస్​కు దారి, దిక్కు దొరికేనా?

వారంలో రాయ్‌‌‌‌పూర్‌‌‌‌(ఛత్తీస్‌‌‌‌గఢ్)లో జరుగనున్న కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ప్లీనరీ సమావేశాల వైపు, ఆ ‘డిక్లరేషన్‌‌‌‌’ వైపు దేశం చూస్తోంది. పాతికేళ్ల తర్వాత.. గాంధీయేతర కుటుంబీకుడు అధ్యక్షుడిగా తొలి కాంగ్రెస్‌‌‌‌ అత్యున్నత సమావేశాలివే! సీతారాం కేసరి నేతృత్వంలో ఆగస్టు, 1997 కలకత్తాలో జరిగిన ప్లీనరీ తర్వాత ఇప్పుడు మల్లికార్జున్‌‌‌‌ ఖర్గే నాయకత్వంలో జరుగుతున్నాయి. నాటి ప్లీనరీ సమావేశాల తర్వాతే, ‘రక్త రహిత తిరుగుబాటు’గా తరచూ మాట్లాడుకునే పరిణామమొకటి మరుసటేడు మార్చి రెండో వారం జరిగింది. కేసరి స్థానంలో సోనియా గాంధీని పార్టీ అధ్యక్షురాలిగా ప్రతిష్టిస్తూ కాంగ్రెస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ఏకగ్రీవ తీర్మానం చేసింది.‘నాతో కాదు, ఇక మీరే అధ్యక్షుడిగా ఉండండి’ అని ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున్‌‌‌‌ ఖర్గే రాహుల్‌‌‌‌ గాంధీని కోరొచ్చు అని అప్పుడే ఒక ప్రచారం పార్టీ వర్గాల్లో మొదలైంది. అంతర్గత సంఘర్షణ తర్వాత...9915 ఏఐసీసీ ప్రతినిధులతో జరిగిన ఎన్నికల్లో, ప్రజాస్వామ్యబద్ధంగా ఖర్గే కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడయ్యారు. బలంగా ఉన్న అయిదారు రాష్ట్రాల్లోనూ గ్రూపు తగాదాలు రాజ్యమేలుతున్న ఈ తరుణంలో ఏఐసీసీ ప్లీనరీ, అంతర్గతంగా పార్టీ శ్రేణులకు, బయట దేశ పౌరసమాజానికి ఏం సందేశం ఇవ్వనుంది? అన్న ఆసక్తి అంతటా నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇక్కడి సందేశాన్నే దేశ రాజకీయాల ‘దిక్సూచి’గా మలుచుకునే తెలివిని కాంగ్రెస్‌‌‌‌ చూపిస్తుందా అన్నది చర్చ.

నాయకుల మధ్య ఐక్యతే ముఖ్యాంశం

రాయ్‌‌‌‌పూర్‌‌‌‌ భేటీ తర్వాతైనా కాంగ్రెస్‌‌‌‌ రాణిస్తుందా? అన్నది ఇప్పుడొక పెద్ద ప్రశ్న. అన్ని స్థాయిల్లోనూ నాయకుల మధ్య ఐక్యతే ముఖ్యాంశం. ఏఐసీసీ స్థాయిలోనూ ఈ సమస్య ఉంది. అత్యున్నత నిర్ణాయక వేదిక, సీడబ్ల్యూసీకి పాతికేళ్లకు జరుగుతున్న ఎన్నికల్లో, అధిష్టానం కోరుకునే బృందమే ఎన్నికయ్యేందుకు కృషి మొదలైంది. ఎవరెవరికి, ఏయే సభ్యుడు ఓటేయాలో పార్టీ ముఖ్యలీడర్​ కె.సి.వేణుగోపాల్‌‌‌‌ అంతర్గత మంతనాలు మొదలెట్టారు. భిన్నస్వరం వినిపించే వారు ఎన్నిక కావొద్దనేది వ్యూహం. ఫిబ్రవరి 24న ఈ ఎన్నిక(ఉంటే, గింటే?)12 మందిని ఎన్నుకుంటారు. సామాజిక సమతూకం కోసం మరో11 మందిని నామినేట్‌‌‌‌ చేస్తారు. ఎందరు శశిథరూర్​లను ఈ స్థాయిలో అడ్డుకుంటారో చూడాలి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు ‘భారత్‌‌‌‌ జోడో’ యాత్ర జరిపి ప్రజాహృదయాలు గెలిచిన రాహుల్‌‌‌‌ గాంధీ, పార్లమెంటులో ప్రభావవంతమైన ప్రదర్శన ద్వారా దేశం దృష్టిని ఆకర్షించడాన్ని రెండంచల గెలుపుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానపు చర్చలో దాదాపు గంట సేపు రాహుల్‌‌‌‌ ఓ అర్థవంతమైన ప్రసంగం చేశారని కాంగ్రేసేతరలూ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వాన్ని దించేయాలని పిలుపునిస్తున్న కాంగ్రెస్‌‌‌‌, ఏ సామాజికార్థిక ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదిస్తుందోననేదే ప్లీనరీ వైపు ఆశావహ చూపులకు కారణం! బీజేపీయేతర పక్షాలను ఆకట్టుకునేలా.. తమ రాజకీయ వైఖరి, సామాజికార్థిక విధానాల ప్రకటనకు తోడు ఎన్నికల వ్యూహరచన ప్లీనరీలో కాంగ్రెస్‌‌‌‌ నాయకత్వం ముందున్న కర్తవ్యం. ఐక్యత సాధించడం కాంగ్రెస్‌‌‌‌ మనుగడకు సంబంధించిన అంశం.

సమర్థులు చేజారకుండా బలపడితేనే..!

‘ఇసుకేస్తే రాలనంత జనం’ అనే అతిశయోక్తిని అక్షరాలా నేను చూసింది ఏఐసీసీ ప్లీనరీ కోసం కలకత్తా(1997) వెళ్లినపుడు. కానీ, కాంగ్రెస్‌‌‌‌ది కాదు. అప్పుడప్పుడే కాంగ్రెస్‌‌‌‌కు దూరమైన మమతా బెనర్జీ(టీఎంసీ) హౌరా బ్రిడ్జి పక్కన, ప్లీనరీ వేదికకు కూతవేటు దూరంలో పెట్టిన బహిరంగ సభలో! ఒక్క మమతానే కాదు, వేర్వేరు కారణాలతో కాంగ్రెస్‌‌‌‌ను వీడిన చంద్రశేఖర్‌‌‌‌, పి.ఎ.సంగ్మా, శరద్‌‌‌‌పవార్‌‌‌‌, జగన్మోహన్‌‌‌‌ రెడ్డి... ఇలా పలువురు రాజకీయాల్లో రాణించారు తప్ప నష్టపోలేదు. బీజేపీ నుంచి వేర్పడ్డవారెవరూ... కళ్యాణ్‌‌‌‌సింగ్‌‌‌‌, శంకర్‌‌‌‌సింగ్‌‌‌‌ వాఘేలా, ఉమాభారతి, కేశూబాయ్‌‌‌‌ పటేల్‌‌‌‌, యడ్యూరప్పలతో సహా బయట బాగుపడలేదు. అందుకని, సమర్థులైన వారు పార్టీ నుంచి వెళ్లకుండా చూసుకుంటూనే, కాంగ్రెస్‌‌‌‌ను చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉంది. ‘.. దేశ జనజీవనంలోకి వేళ్లు విస్తరించిన సంస్థ కాంగ్రెస్‌‌‌‌’ అని 1998 పంచ్‌‌‌‌మడిలోను, ‘..కేవలం ఎన్నికల గెలుపోటముల కొలమానాల్లో ఇరుక్కునే పార్టీ కాదు కాంగ్రెస్‌‌‌‌, దేశ నాలుగుచెరగులా బడుగు, బలహీనవర్గాల్ని పొత్తిళ్లలోకి తీసుకొని ముందుకుసాగే పార్టీ’ అని 1997 కలకత్తాలో చెప్పిన సోనియా, పార్టీ పెద్దగా ఇప్పుడేం సందేశమిస్తారు? తెరవెనుక నుంచి కాంగ్రెస్‌‌‌‌కు ఏ దిశా నిర్దేశం చేస్తారన్నది రాయ్‌‌‌‌పూర్‌‌‌‌లో వెల్లడౌతుందేమో చూడాలి!

రాష్ట్రాల్లో కుంపట్లు చల్లారేనా?

2014 పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌‌‌‌ చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. కర్నాటక, పంజాబ్‌‌‌‌ వంటి పెద్ద రాష్ట్రాల్ని కోల్పోవడమే కాకుండా దేశంలోని పలు చోట్ల పలుచబడింది. కర్నాటకలో ఇప్పుడు ఎన్నికల పరీక్షకు సిద్ధమౌతోంది. పరిస్థితులు కొంచెం సానుకూలంగా ఉన్నాయని పీపుల్స్‌‌‌‌పల్స్‌‌‌‌తో సహా పలు సర్వేలు చెబుతున్నా, ఇక్కడ కూడా ఐక్యతే కీలకాంశం. డీ.కే.శివకుమార్‌‌‌‌ వ్యవహారదక్షత బాగున్నా జనాదరణ సిద్ధరామయ్యకే ఉంది. పరమేశ్వరన్‌‌‌‌ సేవల్ని పార్టీ నాయకత్వం ఎలా వాడుకుంటుంది? ముగ్గురి మధ్య సయోధ్య ఎలా అన్నదీ ముఖ్యమే! ఏఐసీసీ కొత్త నేత ఖర్గేకు సొంత రాష్ట్రంగా ఈ ఎన్నిక సవాలే! రాజస్థాన్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ అధికారపక్షమైనా, పాలన దినదిన గండంగా ఉంది. అశోక్‌‌‌‌ గెహ్లట్‌‌‌‌, సచిన్‌‌‌‌ పైలెట్‌‌‌‌ మధ్య గొడవ నియంత్రించలేని అధిష్టానం, ముందనుకున్న ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి గెహ్లట్‌‌‌‌ను కడకు తప్పించగలిగిందే కాని, తగాదాను తీర్చలేకపోయింది. కేరళలో వరుసగా రెండు పర్యాయాలు తన నేతృత్వపు కూటమి అధికారం కోల్పోయినా గ్రూపు తగాదాలకేం కొదువ లేదు. ఏపీలో మూడేళ్లు మూలన కూర్చున్న నాయకుడిని(రఘువీరారెడ్డిని ఉద్దేశించి), ఏఐసీసీ ప్లీనరీ సబ్జెక్ట్‌‌‌‌ కమిటీలోకి ఎలా తీసుకుంటారని పీసీసీ మాజీ నేత శైలజానాథ్‌‌‌‌ ప్రశ్నిస్తారు. పీసీసీ నేతగా ఉండి శైలజానాథ్‌‌‌‌ ఏం సాధించారో ఇతరులకే కాదు, ఆయనకూ తెలియదు! ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌‌‌‌లలో పార్టీ పరిస్థితి మెరుగుపడకపోగా మరింత దిగజారింది.

తెలంగాణ కాంగ్రెస్‌‌‌‌కు తెలివెప్పుడో?

పార్టీ శ్రేణులు ఆశించినట్టే తెలంగాణలో రేవంత్‌‌‌‌రెడ్డికి పీసీసీ పీఠం కట్టబెట్టినా... నాయకుల మధ్య సయోధ్య కుదర్చడంలో అధిష్టానం విఫలమైంది. పార్టీ ఉమ్మడి ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ఆధిపత్యానికో, మాట చెల్లుబాటుకో అందరూ ప్రాధాన్యత ఇస్తుండటం వల్లే ఐక్యత కుదరటం లేదు. ‘వివాదం ఎంతకూ తెగట్లేదంటే, తప్పు ఇరువైపులా ఉన్నట్టే’ అనే ఓ పాత సామెత, తెలంగాణ కాంగ్రెస్‌‌‌‌ నాయకుల విషయంలో అక్షర సత్యం. పార్టీకి అనుకూలమైన ఏ గాలి లేకుండా ఎమ్మెల్యే కాదు కదా, కనీసం ఎంపీటీసీనో, జడ్పీటీసీనో కూడా గెలవలేని ఓ బీసీ, ఓ మైనారిటీ, ఓ దళిత, ఓ అగ్రవర్ణ.. ఇలా పలువురు ‘సీనియర్‌‌‌‌’ నాయకులూ పెద్దపీట వేయాలని తగాదా పెట్టేవాళ్లే! ఇట్లా ఎందరో, నిత్యం రగిలే రావణ కాష్టంలో నెయ్యిపోసే వాళ్లవటంతో జనానికి కాంగ్రెస్‌‌‌‌ కొత్త నమ్మకాన్ని కలిగించలేకపోతోంది. ‘చేయి‘ తో చేయి కలపండి(హాత్‌‌‌‌ సే హాత్‌‌‌‌ జోడో) అని జనానికి పిలుపునిస్తూ, వాళ్లు మాత్రం ఒకరికొకరు కాళ్లు నరుక్కుంటున్నారు. ‘వంద సీట్లు గెలువబోతున్నాం’ అని రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌ అధినేత చెబుతున్నా.. సర్వేలన్నీ అందుకు భిన్న పరిస్థితినే ప్రతిబింబిస్తున్నాయి. సీఎస్‌‌‌‌డీఎస్‌‌‌‌–లోక్‌‌‌‌నీతి, ఇండియా టుడే– సీఓటర్‌‌‌‌, పీపుల్స్‌‌‌‌పల్స్‌‌‌‌ వంటి పలు సర్వే సంస్థల క్షేత్ర పరిశీలన, వెల్లడి ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌ది ఇప్పటికీ మూడో స్థానమే! పోటీ పాలకపక్షమైన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, మరో విపక్షం బీజేపీల మధ్యేనని, అదీ ఒకటి–రెండు స్థానాల మధ్య ఎక్కువ అంతరమనేది వాటి సారం. ఉమ్మడి ఏపీలో 1978–83 మధ్య ఒకసారి, 1989–94 మధ్య మరోసారి పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్లే ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి అధికారం ‘బంగారు పళ్లెం’లో అప్పగించారు. అప్పటి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్​రెడ్డి, వైఎస్‌‌‌‌.రాజశేఖరరెడ్డి, వెంకటస్వామి, నేదురుమల్లి జనార్ధన్‌‌‌‌రెడ్డి వంటి స్థాయిగల నాయకులు లేకపోగా అంతకన్నా ఎక్కువ కీచులాటలు ఇప్పుడున్నాయి. ‘పాలకపక్షంతో కాంగ్రెస్‌‌‌‌ పొత్తు పెట్టుకుంటుంద’ని ఏడాదిగా వివాదాస్పదుడైన ఒక ఎంపీ, ఏ స్థాయి–ఏం హోదాతో చెబుతారు? ఇలాంటివి పార్టీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. గాంధీ భవన్‌‌‌‌కు రంగుల హంగులు అద్దితేనో, మాణిక్కం ఠాకూర్‌‌‌‌ స్థానే మాణిక్‌‌‌‌ ఠాక్రేను తెస్తేనో పరిస్థితి మారదు, నాయకుల్లో పరివర్తన వస్తే తప్ప!

- ఆర్‌‌‌‌. దిలీప్‌‌‌‌ రెడ్డి, పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌,  పీపుల్స్‌‌‌‌ పల్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సంస్థ.