- సౌతిండియాలో ఐసిస్ కుట్ర భగ్నం..
- అరబిక్ ఆన్‌లైన్ క్లాసుల పేరుతో ఐసిస్ ఐడియాలజీ ప్రచారం
- హైదరాబాద్, తమిళనాడులో సోదాలు
- ఎన్‌ఐఏ అదుపులో ఇద్దరు అనుమానితులు
హైదరాబాద్, వెలుగు : అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ సౌతిండియాలో విధ్వంసానికి పన్నిన భారీ కుట్రను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) భగ్నం చేసింది. యువతను ఆకర్షిస్తూ విధ్వంసాలకు ప్లాన్ చేస్తున్న ఖిలాఫత్ మాడ్యుల్ గుట్టురట్టు చేసింది. నిరుడు అక్టోబర్ 23న కోయంబత్తూర్‌లో జరిగిన కారు బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో కీలక వివరాలు రాబట్టింది. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో శనివారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
తమిళనాడులోని కోయంబత్తూర్‌లో 22, చెన్నైలో 3 ప్రాంతాలు, టెంకాసి జిల్లా కడైయనల్లూర్, హైదరాబాద్‌లోని మలక్‌పేట్, టోలీచౌకి, హుమాయున్ నగర్, ఓల్డ్ సిటీలోని మరో పలు చోట్ల తనిఖీలు చేసింది. ఈ సోదాల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు రూ.60 లక్షల నగదు, 18,200 అమెరికన్ డాలర్లు, అరబిక్ భాషలో ఉగ్రవాద ప్రేరేపిత సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్..
దేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఐఎస్‌ఐఎస్ ఖిలాఫత్ ఐడియాలజీని ప్రచారం చేస్తున్నది. అరబిక్ క్లాసుల ముసుగులో సౌత్ రీజియన్స్‌లోని తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో రిజనల్ స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు యువకులను ఐసిస్ వైపు ఆకర్షించేలా వాట్సాప్, టెలిగ్రామ్‌లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఖిలాఫత్ ఐడియాలజీతో ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు.
Also Raed:అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ చిన్నారిని బలిగొంది
దేశంలో విధ్వంసాలకు పాల్పడే విధంగా ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాట్సప్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా రహస్యంగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.
హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు
హైదరాబాద్‌లోని మలక్‌పేట్, టోలీచౌకి, హుమాయున్ నగర్, ఓల్డ్ సిటీలోని మరో రెండు ఏరియాల్లో సోదాలు జరిపింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. కోయంబత్తుర్ కారు బాంబ్ బ్లాస్ట్‌లో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసింది. నిందితుల కాల్‌డేటా, టెలిగ్రామ్, వాట్సప్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసింది. డిజిటల్ డివైజెస్‌ను పరిశీలించింది.
తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో అనుమానితులు ఉన్నట్లు గుర్తించింది. ఈ నెట్‌వర్క్‌లో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సోదాలు కొనసాగుతున్నాయని ఎన్‌ఐఏ వెల్లడించింది.