ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించి చివరాఖరికి ఏం చెప్పకుండా మౌనం వహించేవాడే అసలు సిసలు దౌత్యవేత్త అని బ్రిటన్ మాజీ ప్రధాని ఎడ్వర్డ్ హీత్ ఒక సందర్భంలో వ్యంగ్యంగా అన్నారు. ఆయన హాస్యానికే అని ఉండొచ్చుగానీ ఇందులో నిజముంది. చాలా దౌత్య వ్యవహారాలు ఇలా ‘నొప్పింపక తానొవ్వక...’ తరహాలోనే నడుస్తుంటాయి. అందుకే రాజుకున్న వివాదాలు రావణ కాష్టంలా ఎప్పటికీ మండుతూనే ఉంటాయి. వాటిని నివారించడమే మార్గం తప్ప, వచ్చిపడ్డాక అనుభవించక తప్పని పరిస్థితులేర్పడతాయి. మూడు నెలలుగా ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం విషయంలో మన దేశం తీసుకున్న వైఖరిపై ప్రపంచ దేశాలు మాత్రమే కాదు.. మన దౌత్యరంగ నిపుణులు సైతం విమర్శలు చేస్తున్నారు. ఒక అగ్రరాజ్యం ఏక పక్షంగా చేసిన దాడిని తిప్పికొట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్న బక్క దేశానికి అండగా నిలబడటం మన బాధ్యత అని గుర్తుచేస్తున్నారు.
వలసవాదులపై పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకోవడం మాత్రమే కాదు.. తర్వాత కాలంలో అలీనోద్యమం(నామ్)లో కీలకపాత్ర పోషించిన దేశంగా భారత్‌పై వర్థమాన దేశాలకు చాలా ఆశలుండేవి. బ్రిటీష్ వలసపాలకులను తరిమికొట్టేందుకు సాగిన స్వాతంత్య్రోద్యమం మన దేశంలో ఎన్నో కొత్త విలువలను తీసుకొచ్చింది. బలమైన అగ్రరాజ్యంపై పోరాడుతున్న బడుగు దేశానికి అండగా నిలబడటం అందులో ఒకటి. ఇక్కడ బ్రిటీష్ పాలకులపై పోరాడుతూనే దేశదేశాల్లో సాగుతున్న విముక్తి ఉద్యమాలకు సైతం నైతికంగా అండదండలందించిన ఘనత మనది. జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా30వ దశకం చివరిలో చైనా ప్రజానీకం పోరాడుతున్నప్పుడు దానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు అగ్ర నేతలు మావో జెడాంగ్, జనరల్ ఛూటే మన జవహర్‌లాల్ నెహ్రూకు లేఖ రాసిన పర్యవసానంగానే డాక్టర్ ద్వారకానాథ్ కొట్నీస్ తన బృందంతో చైనా వెళ్లి యుద్ధంలో గాయపడిన వేలాదిమంది రెడార్మీ సైనికులకు వైద్య సేవలందించారు. అనంతరకాలంలో పాలస్తీనా విముక్తి పోరాటానికి, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో వలసలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలకు మన దేశం అండదండలందించింది. మన పొరుగున ఉన్న తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా ఏర్పడటంలో మన పాత్రేమిటో అందరికీ తెలుసు.
సోవియెట్ యూనియన్విచ్ఛిన్నం తర్వాత..
90వ దశకం నాటికి సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత అమెరికా ఆధ్వర్యంలో ఏకధ్రువ ప్రపంచం ఏర్పడటం, మన దేశం ఆర్థిక రంగ సంస్కరణలు మొదలుపెట్టడంతో అంతా మారిపోయింది. ఇప్పుడు నామ్ నామమాత్రావశిష్ఠమైంది. కొత్త పొత్తులు, కొత్త స్నేహాలు కొత్త విలువలు తీసుకొచ్చాయి. ఈ వాస్తవాన్ని మనం గుర్తించకతప్పదు. ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న మారణహోమాన్ని కచ్చితంగా నిరసించాల్సిందే. ముఖ్యంగా బుఖాలో జనావాసాలపైబడి వేలమంది పౌరులను అమానుషంగా కాల్చిచంపిన తీరు దేశదేశాల పౌరులనూ దిగ్భ్రమపరిచింది. ఈ హత్యాకాండను మన దేశం ఖండించింది. అయితే అంతకు ముందుగానీ, ఆ తర్వాతగానీ ప్రపంచ వేదికలపై రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధపడలేదు. ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి, మానవహక్కుల మండలి తదితరచోట్ల తటస్థంగానే ఉండిపోయింది. మానవహక్కుల మండలిలో రష్యాను సస్పెండ్ చేయాలన్న తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా మన దేశం చేసిన వాదనను ఒకసారి ప్రస్తావించుకోవాలి. దౌత్య మార్గాల్లో యుద్ధాన్ని అంతమొందించే ప్రయత్నం చేయాలి తప్ప వ్యతిరేక, అనుకూల ఓట్ల వల్ల హింసాకాండ ఆగిపోయే అవకాశం లేదని భారత్ చెప్పింది. చివరకు 93–24 ఓట్ల తేడాతో తీర్మానం నెగ్గాక, ఇందుకు అనుసరించిన ప్రక్రియపై మన దేశం అసంతృప్తి వ్యక్తం చేసింది.
దురాక్రమణలను నిరసించిన చరిత్ర..
2006 మార్చిలో మానవహక్కుల మండలి ఏర్పడ్డాక ఒక దేశాన్ని సస్పెండ్ చేయడం ఇది రెండోసారి. మొదటిసారి 2011లో లిబియాను సస్పెండ్ చేశారు. అసలు మానవహక్కుల మండలిని అమెరికాయే సీరియస్‌గా తీసుకోనప్పుడు రష్యా ఖాతరు చేస్తుందని అనుకోనవసరం లేదు. పొరుగునున్న పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడల్లా మండలి ఖండించడం, అమెరికా దాన్ని వ్యతిరేకించడం రివాజుగా మారింది. చివరకు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా ఈ ధోరణిపై ఆగ్రహించి ఏకంగా మానవహక్కుల మండలి నుంచే తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మళ్లీ బైడెన్ ఆగమనం తర్వాతే అమెరికా అందులో చేరింది. వెనక్కి తిరిగి చూస్తే మన దేశానికి దురాక్రమణలను నిరసించిన చరిత్రా ఉంది. ఓటింగ్‌కు గైర్హాజరై తటస్థత పాటించడమూ ఉంది. అరబ్–ఇజ్రాయెల్ యుద్ధాల్లో, ఉత్తర, దక్షిణ కొరియా వివాదాల్లో దురాక్రమణలను నిరసించిన మన దేశం ఇరాక్‌పై అమెరికా దురాక్రమణకు దిగినప్పుడు ఖండించలేదు. అఫ్ఘానిస్తాన్ విషయంలోనూ అంతే. ఇంకా సూయెజ్ కాల్వ వివాదంలో, ఇరాక్–కువైట్ వివాదంలోనూ తటస్థత పాటించింది. పాకిస్తాన్, చైనాలతో మనకు ఘర్షణలు తలెత్తినప్పుడు పాశ్చాత్య దేశాలు మౌనం పాటించడాన్ని దృష్టిలో ఉంచుకునే మన దేశం ఇప్పుడు రష్యా విషయంలో తన సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నదని అంటున్నవారూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కశ్మీర్ విషయంలో మన దేశాన్ని నిర్ద్వంద్వంగా సమర్థించిన దేశం రష్యా. ఇక అది మనకు అందజేస్తున్న రక్షణ ఉత్పత్తులు సరేసరి. వీటన్నిటిని బట్టి యుద్ధం ఆపడమే పరిష్కారం.
అణు బాంబుల వరకు వెళ్లనీయొద్దు
ఒక దేశ సార్వభౌమాధికారాన్ని, దాని ప్రాదేశిక సమగ్రతనూ ఉల్లంఘించే అధికారం ఏ దేశానికీ లేదు. అది అమెరికా, రష్యాలతోసహా ఎవరికైనా వర్తిస్తుంది. ఉక్రెయిన్‌పై దురాక్రమణను నిరసించడంలో మన దేశం వెనకడుగేయడం నైతికంగా సరికాదన్న విమర్శ కొట్టిపారేయదగ్గది కాదు. కేవలం అవసరాలే పరమావధితప్ప, దుష్కృత్యాలపై నిలదీయాల్సిన బాధ్యత లేదా అని కొందరు నిలదీస్తున్నారు. వేరే బక్క దేశాలపై అమెరికా దాడులకు దిగినప్పుడూ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు ఇథియోపియా, సూడాన్, లిబియా వంటి చిన్న దేశాలపై విరుచుకుపడినప్పుడూ ఈ ప్రశ్నలెందుకు ఉత్పన్నం కాలేదో అర్థంకాదు. రష్యా దురాక్రమణ యుద్ధాన్ని తక్షణం నిలుపు చేయడం ఎంత ముఖ్యమో అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీ గుర్తించాలి. యుద్ధ రంగానికి ఎవరెంత దూరం ఉన్నారన్న దాంతో నిమిత్తం లేకుండా దాని కారకులతో సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఒడిదుడుకుల్లో పడే ప్రమాదం ఉంటుంది. ఉక్రెయిన్‌కు ఆయుధాలందించడం వల్ల అక్కడ ఘర్షణలు మరింత పెరుగుతాయి, అమెరికా, పాశ్చాత్య దేశాల ఆయుధ వ్యాపారం ముమ్మరమవుతుంది. అంతే తప్ప రష్యా దూకుడు ఆగే అవకాశం లేదు. వెనుకనుంచి ఎవరెంతగా ఆయుధాలందించినా ఉక్రెయిన్ వంటి చిన్న దేశం అణ్వస్త్ర రాజ్యమైన రష్యాను ఢీకొట్టి మట్టి కరిపిస్తుందని భావించలేం. దీన్ని ఇలాగే కొనసాగనిస్తే మళ్లీ ప్రచ్ఛన్నయుద్ధ కాలంనాటి పరిణామాలు పునరావృతమయ్యే ప్రమాదం ఉంటుంది. అమెరికా ఆశిస్తున్నట్టు మనం రష్యా వ్యతిరేక వైఖరి తీసుకుంటే అది చైనాతో చేతులు కలుపుతుంది. ఇష్టం ఉన్నా లేకున్నా ప్రపంచ దేశాలన్నీ రెండు శిబిరాలుగా చీలిపోయే ప్రమాదం ఉంటుంది. అణు బాంబుల ప్రయోగం వరకూ పరిస్థితులు విషమించినా ఆశ్చర్యం లేదు. అందుకే ఈ యుద్ధం ఆగిపోవాలి. ప్రపంచ దేశాలూ, మన దేశం ఆ దిశగా కృషి చేయాలి.
- టి. వేణుగోపాలరావు