విద్యార్థులు తినే అల్పాహారంలో కప్ప 

వికారాబాద్ జిల్లా పరిగి విద్యారణ్యపురిలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ లో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఉదయం విద్యార్థులు తినే అల్పాహారంలో కప్ప కనిపించడంతో విద్యార్థులు ఖంగుతిన్నారు. ఇదే విషయాన్ని వెంటనే విద్యార్థులు వైస్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. హాస్టల్ సిబ్బంది కప్ప కనిపించిన ఫుడ్ ను బయట పారబోశారు. విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ, అప్పటికే కొంతమంది విద్యార్థులు టిఫిన్ చేశారని, వారిలో కొందరు అస్వస్థతకు గురైతే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని విద్యార్థులు చెప్పారు. ప్రతిరోజు వడ్డించే ఆహారంలో కూడా పురుగులు వస్తున్నాయని, అన్నం ముద్దలు ముద్దలుగా వండుతున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

విద్యార్థులు అస్వస్థతకు గురికాలేదు


ఉదయం అల్పాహారంలో కప్ప కనిపించిన ఫుడ్ ను బయటపడేసి మళ్ళీ..వండించి, విద్యార్థులకు వడ్డించామని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులెవరూ అస్వస్థతకు గురికాలేదని తెలిపారు. నిర్లక్ష్యంగా వంటలు చేసిన సిబ్బందిని తొలగించామని చెప్పారు. విద్యార్థుల సమస్యల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.