జగిత్యాల ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

జగిత్యాల ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

జగిత్యాల జిల్లా : జగిత్యాల ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణికి సరైన వైద్యం అందించడం లేదనే ఆవేదనతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన ఓ గర్భిణిని ప్రసవం కోసం ఆమె కుటుంబ సభ్యులు.. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం జగిత్యాల ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫస్ట్ కాన్పు సందర్భంగా నార్మల్ డెలవరీ కోసం వైద్య సిబ్బంది ఎదురుచూశారు.  కానీ అప్పటికే భరించలేనంతగా నొప్పులు రావడం, ఉమ్మనీరంతా పోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు.  

రాత్రి వరకైనా ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలని కోరినా వైద్యులు వినలేదని గర్భిణి తల్లి చెబుతోంది. వైద్య సిబ్బంది తీరుపై స్థానిక ఎంపీపీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఫోన్ చేసినా పట్టించుకోలేదంటున్నారు. ‘ఎమ్మెల్యే తో ఫోన్ చేయిస్తారా..? ఆయనతోనే ట్రీట్ మెంట్ చేయించుకోండి’ అంటూ వైద్య సిబ్బంది దూషించారని గర్భిణి బంధువులు చెబుతున్నారు. చివరకు కాళ్లు మొక్కినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక చివరకు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అక్కడి డాక్టర్లు.. సీజరియన్ చేశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. 

కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తా

జగిత్యాల ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణీకి ప్రసవం చేయకుండా ప్రైవేటుకు ఆసుపత్రికి పంపిన ఘటనపై జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. ఈ విషయం సీరియస్ గా తీసుకుని, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది తీరుపై సమీక్ష చేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అధునాతన వసతులు సమకూర్చినా, పెద్ద సంఖ్యలో డాక్టర్లు, సిబ్బందిని నియమించినప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం అని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.