ప్రజావాణిలో దంపతుల నిరసన

మూడు జిల్లాల్లో 169 అర్జీలు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్​ పట్టణంలోని భగత్ నగర్ లో ఉన్న తమ స్థలంలో ఇల్లు కట్టుకుందామంటే అధికారులు అనుమతి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని కొత్త రాజి రెడ్డి దంపతులు ప్రజావాణిలో బైఠాయించి నిరసన తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో ఇన్​చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్  అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి దంపతులు   మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను కూడా ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దీంతో  ఆర్డీఓ ఆనంద్ కుమార్ స్పందించి కోర్టు డైరెక్షన్స్ ప్రకారం సర్వే చేయిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

అనంతరం ఇన్​చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ప్రజావాణిలో 126 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. మున్సిపల్11, జిల్లా పంచాయతీ 14, హెల్త్ 3, పోలీస్ 7, ఆర్డీఓ 5, వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ 5, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ 5, కొత్తపల్లి తహసీల్దార్ 5, వారధి సొసైటీకి 9, మిగతా శాఖలకు 62  దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఇస్లావత్, ఏఓ నారాయణ స్వామి పాల్గొన్నారు.

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ భవన ఆఫీస్ లో సోమవారం కలెక్టర్ రవి, అడిషనల్​కలెక్టర్లు మంద మకరంద, బీఎస్ లత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 24 ఫిర్యాదులు, వినతులు వచ్చాయన్నారు.ఈకేవైసీ బాధ్యతలు అప్పగించడం సరికాదు.. అదనపు భారంతో సతమతమవుతున్న తమకు ఈకేవైసీ బాధ్యతలు అప్పగించడం సరికాదంటూ జిల్లాలోని ఏఎన్ఎంలు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.

అనంతరం కలెక్టర్ రవికి వినతి పత్రం అందజేశారు. మాత శిశు సంరక్షణ బాధ్యతలతోపాటు గ్రామాలలో అంటు వ్యాధుల నిర్యూలనతో సహా డేటా ఎంట్రీ పనులు కూడా తామే చేస్తున్నామన్నారు. జనవరి నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అవుతున్న దృష్ట్యా అధిక పని భారంతో ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈకేవైసీ పనులు చేయలేమని వెసులు బాటు కల్పించాలని కోరారు.

రాజన్న సిరిసిల్ల:-  జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో 19 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్​అనురాగ్​జయంతి తెలిపారు. ప్రజల సమస్యలపై స్పందించి సత్వర పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓలు శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.