పంచాయతీ సెక్రెటరీలతో ఆటలు...డ్యూటీలో ప్రాణాలు కోల్పోయినా నో బెనిఫిట్స్

నల్గొండ, వెలుగు: పంచాయతీ సెక్రటరీలతో సర్కారు మూడు ముక్కలాట ఆడుతోంది.  ఒకే డిపార్ట్​మెంట్ ​కింద పనిచేస్తున్న ఉద్యోగులను వేర్వేరుగా చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,750 మంది కార్యదర్శులు పనిచేస్తుంటే వీళ్లలో కొందరిని సీనియర్​ కార్యదర్శులు అని, మరికొందరిని జూనియర్​పంచాయతీ కార్యదర్శులని, ఇంకొందరిని అవుట్​సోర్సింగ్​ కార్యదర్శులని మూడు రకాలుగా పిలుస్తున్నారు. దీనివల్ల శాఖాపరంగా పని విభజనలో తేడాలు రావడమేగాక, జీతంలో, ఉద్యోగ భద్రతలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకే గొడుగు కింద పనిచేస్తున్న కార్యదర్శులను వేర్వేరుగా చూడటం వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. పైగా అసోసియేషన్ల వ్యవహారాల్లోనూ సంబంధం ఉండడం లేదు. దీనివల్ల డ్యూటీలో ప్రాణాలు కోల్పోతున్న జూనియర్, అవుట్​సోర్సింగ్ ​కార్యదర్శుల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. 

సర్కారు తెచ్చిన తంటా

తెలంగాణ వచ్చాక సర్కార్​ నియమించిన కొత్త సెక్రటరీలను జూనియర్​ పంచాయతీ సెక్రటరీలుగా  పిలుస్తున్నారు. 2018లో టీఎస్ పీఆర్ఐ కింద ఎగ్జామ్​పెట్టి 9,333 మందిని తీసుకున్నారు. అంతకుముందు స్టేట్​లో 3,41 7 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. కొత్తవాళ్లతో కలిపి ప్రస్తుతం 12,750 మంది కార్యదర్శులు ఉన్నారు. అయితే ఒకేసారి ఎగ్జామ్ పెట్టి సెలక్ట్​ చేసిన ఉద్యోగులను మాత్రం విడతలవారీగా ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. స్టేట్​లో ఖాళీ అవుతున్న పోస్టులను బట్టి సెలెక్ట్​అయినవారికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రకంగా 2020 వరకు రిక్రూట్​మెంట్​ప్రాసెస్ జరిగింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ 2019లో ఉద్యోగాల్లో చేరిన జేపీసీలకు, ఆ తర్వాత వెనక వరుసలో చేరిన వాళ్ల మధ్య సర్కార్​చిచ్చు రాజేసింది. మొదట డ్యూటీలో చేరిన జేపీఎస్​లకు రూ. 28 వేల జీతం ఇస్తున్న సర్కారు వెనక వరుసలో చేరినవాళ్లకు మాత్రం కేవలం రూ. 15 వేలు చెల్లిస్తోంది. పైగా వీళ్లను అవుట్​సోర్సింగ్​ కార్యదర్శులు అని పిలుస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేల మంది వరకు జూనియర్​పంచాయతీ సెక్రటరీలు, 4 వేల మంది వరకు అవుట్​సోర్సింగ్​ సెక్రటరీలు ఉన్నారు. 2019లో చేరిన ఉద్యోగులకు సర్కారు  డైరక్ట్​గా జీతాలు చెల్లిస్తుంటే... తర్వాత చేరినవారికి మాత్రం అవుట్​సోర్సింగ్​ఏజెన్సీలు జీతాలు ఇస్తున్నాయి. దీంతో మూడు నెలలకోసారి జీతం తీసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా వీళ్లలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా, ఏదైన ప్రమాదం జరిగినా ఏజెన్సీలు గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఒకే ఎగ్జామ్​ కింద సెలక్ట్​ చేసిన సెక్రటరీలను ఇలా వేర్వేరుగా చేసి చూడటం వల్ల అన్ని  విధాలుగా నష్టపోతున్నామని కార్యదర్శులు వాపోతున్నారు. 

కుటుంబాలకు కొరవడిన భద్రత

డ్యూటీలో చనిపోతున్న జేపీఎస్​లకు సర్కార్​ఉద్యోగ భద్రత కల్పించడం లేదని సంఘాలు వాపోతున్నాయి. ఉద్యోగంలో చేరినప్పుడు ప్రొబెషన్​పిరియడ్​మూడేళ్లు అని చెప్పిన సర్కార్​ఆ తర్వాత మరో ఏడాది పొడిగించింది. దీంతో వచ్చే నెలతో నాలుగేళ్లు సర్వీస్​కంప్లీట్​ చేసుకున్న సెక్రటరీలను రెగ్యులరైజ్​ చేయాల్సి ఉంది. మరోవైపు అవుట్​సోర్సింగ్​ కింద పనిచేస్తున్న సెక్రటరీలను జేపీఎస్​కింద కన్వర్ట్​ చేయాల్సి ఉంది. లేదంటే వాళ్ల సర్వీసు కోల్పోయే ప్రమాదం ఉందని కార్యదర్శుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 40 మందికి పైగా జేపీఎస్​లు డ్యూటీలో చనిపోయారని చెప్తున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక కొందరు మరణిస్తే.. ఇంకొందరు రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు వంటి వివిధ రకాల జబ్బుల బారిన పడి చనిపోయారు. వీళ్లలో ఇప్పటికీ కేవలం స్టేట్​లో రెండు, మూడు కుటుంబాలకు మాత్రమే ఉద్యోగ భద్రత కల్పించారు. అది కూడా కార్యదర్శుల పోస్ట్​లు ఇవ్వకుండా అవుట్​సోర్సింగ్ ​కింద వేరే డిపార్ట్​మెంట్​లో నియమించారు. కారుణ్య నియమాకం కింద చనిపోయిన కుటుంబాలకు అదే డిపార్ట్​మెంట్​లో ఉద్యోగం ఇవ్వాలని, ఇతర శాఖల్లో ఇప్పించినా సర్కార్​ఉద్యోగం కింద పరిగణించాలే తప్ప అవుట్​సోర్సింగ్ ​కింద ఇవ్వొద్దని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఇటు ఆఫీసర్లు, అటు అన్ని జిల్లాలో మంత్రులను కలిసి మొర పెట్టుకుంటున్నాయి. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో ఓ సెక్రటరీ అనారోగ్యంతో మరణిస్తే అతని భార్యకు మెడికల్​ డిపార్ట్​మెంట్​లో అవుట్​సోర్సింగ్ ​కింద ఏఎన్ఎం పోస్ట్​ఇప్పించారు. ఇంకోవైపు పని ఒత్తిడి తట్టుకోలేక చాలా జిల్లాల్లో కార్యదర్శు లు ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. ఈ నెల 8 తేదీన ఉమ్మడి వరంగల్ ​జిల్లాలోని బుచ్చంపేట కార్యదర్శి బండ్ల గురుమూర్తి డ్యూటీకి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి కనికరం చూపడం లేదని ఉద్యోగ సంఘాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.