నవ దంపతులను కబళించిన రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం జిల్లా : పెళ్లికూతురు కాళ్లపారాణి ఇంకా ఆరలేదు. ఇండ్లకు కట్టిన తోరణాలు వాడనూలేదు. పెళ్లి బజాలతో సందడిగా ఉన్న ఆ ఇండ్లల్లో విషాదం అలుముకుంది. రోడ్డుప్రమాదం నవ దంపతులను కబళించిన ఘటన గుండెలను పిండేస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ లోని ఇచ్చాపురం పట్టణానికి చెందిన వేణుతో.. ఒడిస్సాలోని బరంపురానికి చెందిన ప్రవల్లికకు ఈ నెల 10వ తేదీన (శుక్రవారం) విశాఖపట్నం సింహాచలం దేవస్థానంలో వివాహం జరిగింది. బంధువులు, స్నేహితులు వచ్చి నవ దంపతులను ఆశీర్వదించారు. వరుడు వేణు స్వగృహం ఇచ్చాపురంలో ఈనెల 12న (ఆదివారం) విందు  ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పెళ్లి వేడుకలు ముగియడంతో వేణు తన అత్తవారింటికి బయలుదేరారు. 13వ తేదీన వధువు స్వగృహం బరంపురానికి టూవీలర్ పై నవ దంపతులు వెళ్తుండగా వీరిని ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ చనిపోయారు. ఈ ఘటన ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దులోని గొలంత్ర గ్రామం వద్ద జరిగింది. 

బరంపురలో ఎదురుచూస్తున్న వధువు కుటుంబ సభ్యులు, ఇచ్చాపురంలో వేణు కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదం గురించి తెలిసింది. దీంతో వీరంతా కుప్పకూలారు. పెళ్లి పారాణి ఇంకా ఆరకముందే వధూవరులు ఇద్దరూ చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.