మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం బీజేపీదే.. పదవుల పంపకంలో డీల్ ఏంటంటే..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం బీజేపీదే.. పదవుల పంపకంలో డీల్ ఏంటంటే..

ఢిల్లీ: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్టే కనిపిస్తోంది. మోదీ, అమిత్ షా ఎవరిని ప్రతిపాదిస్తే వారికి జై కొడతానని ప్రెస్మీట్ నిర్వహించి మరీ ఏక్నాథ్ షిండే ప్రకటించడంతో ఫడ్నవీస్కు లైన్ క్లియర్ అయింది. మహారాష్ట్రలో సీఎం పదవి బీజేపీదేనని దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. అయితే.. మహాయుతిలో కీలక పాత్ర పోషించిన షిండే శివసేనకు ఒక డిప్యూటీ సీఎం పదవి, అజిత్ పవార్ ఎన్సీపీకి మరో డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంలో తనదే కీలక పాత్ర అని భావిస్తున్న ఏక్నాథ్ షిండే సీఎం పదవిని వదులుకోవడానికి సిద్ధపడినప్పటికీ మరో ప్రతిపాదన బీజేపీ హైకమాండ్ ముందు ఉంచినట్లు సమాచారం. మహాయుతి కూటమి కన్వీనర్ పదవి ఏక్నాథ్ షిండేకు, ఆయన కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే.. మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తాను అడ్డంకి కాదలుచుకోవడం లేదని ప్రధాన మంత్రి మోదీకి స్పష్టం చేసినట్లు ఏక్నాథ్ షిండే ప్రెస్ మీట్లో  చెప్పిన సంగతి తెలిసిందే.

ALSO READ | ఢిల్లీలో మోడీతో ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ భేటీ

ఇక.. అజిత్ పవార్ విషయానికొస్తే.. ముందు నుంచి ఆయన సీఎం పదవి రేసులో పెద్దగా యాక్టివ్గా లేరు. కానీ.. కొత్తగా కొలువుదీరనున్న మహారాష్ట్ర మహాయుతి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు దక్కించుకునే విషయంలో మాత్రం వెనక్కి తగ్గకూడదని ఆయన డిసైడ్ అయినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక పోర్ట్ఫోలియోలు దక్కించుకోవడమే లక్ష్యంగా అజిత్ పవార్ పావులు కదుపుతున్నట్లు తెలిసింది. 

మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయంతో పాటు, మంత్రి పదవుల పంపకాలపై కూడా హస్తిన వేదికగా గురువారం జరిగే ఎన్డీయే కీలక సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ విషయమే షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ గురువారం ఢిల్లీకి చేరుకుంటారు. బీజేపీ హైకమాండ్తో, అమిత్ షాతో మంతనాల అనంతరం మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం గురించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నవంబర్ 30న గానీ, డిసెంబర్ 1న గానీ మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉందని అజిత్ పవార్ ప్రకటించారు.