గన్నులు గుంజుకుంటుంటే మీరేం చేసిన్రు?

గన్నులు గుంజుకుంటుంటే మీరేం చేసిన్రు?
  • నలుగురిని 10 మంది అడ్డుకోలేక పోయారా?
  • లారీ డ్రైవర్లకు వెపన్​ షూటింగ్​ తెలుసా?
  • నిందితులు లాక్కున్నారని చెబుతున్న గన్స్ ఎవరివి?
  • గాయపడిన పోలీసులపై హెచ్ఆర్సీ టీమ్ ​ప్రశ్నల వర్షం
  • మూడో రోజు రెవెన్యూ, పోలీసుల విచారణ
  • ఎన్​కౌంటర్​కు దారితీసిన అంశాలపై ఆరా
  • నేడు ఎన్ కౌంటర్ ప్రాంతాన్ని మరోసారి పరిశీలించే చాన్స్

హైదరాబాద్, వెలుగు:వెటర్నరీ డాక్టర్ ‘దిశ’అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై నేషనల్​ హ్యూమన్​ రైట్స్​ కమిషన్(ఎన్​హెచ్ఆర్సీ) విచారణ కొనసాగుతోంది. నలుగురు సభ్యుల ఎన్​హెచ్ఆర్సీ టీమ్​ మూడో రోజు రెవెన్యూ, పోలీసు అధికారులను విచారించింది.ఎన్​కౌంటర్​లో గాయపడి హైటెక్ సిటీలోని ప్రైవేట్ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ ను సుధీర్ఘంగా ప్రశ్నించింది. నిందితులు గన్నులు గుంజుకుంటుంటే ఏం చేశారు? నలుగురిని 10 మంది అడ్డుకోలేక పోయారా? లారీ డ్రైవర్లకు వెపన్​ షూటింగ్​ తెలుసా? అని ప్రశ్నల వర్షం కురిపించింది. వారి స్టేట్​మెంట్​ రికార్డు చేసుకుంది. మంగళవారం ఎన్​హెచ్​ఆర్సీ టీమ్​ మరోసారి ఎన్ కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయి.

పంచనామా రిపోర్టుల పరిశీలన

ఎన్​కౌంటర్​ తర్వాత నిందితుల డెడ్ బాడీల వద్ద చేసిన పంచనామా వివరాలను రెవెన్యూ అధికారుల నుంచి కమిషన్ సభ్యులు సేకరించారు. నిందితులు మహ్మద్ ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ డెడ్ బాడీలకు పంచనామా చేసిన షాద్ నగర్ తహసీల్దార్ తోపాటు ఫరూక్‌‌నగర్‌‌, కుందూర్‌‌, నందిగామ, చౌదరిగూడ మండల తహసీల్దార్లను విచారించారు. డెడ్ బాడీలు ఎలా పడి ఉన్నాయి? ఒక్కో బాడీ ఎంత దూరంలో ఉంది? ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి? అనే వివరాలను తెలుసుకుంది. పంచనామాలో పేర్కొన్న విధంగా నిందితుల శరీర భాగాల్లో ఉన్న బుల్లెట్​ గాయాలతోపాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డాక్టర్లు తెలిపిన వివరాలను పరిశీలించారు.

మూడు గంటల పాటు విచారణ

సాయంత్రం 4 గంటలకు ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ ను విచారించింది. కస్టడీలో ఉన్న నిందితులను శుక్రవారం తెల్లవారుజామున చటాన్ పల్లి తీసుకురావడానికి కారణాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఎన్ కౌంటర్ సమయంలో ఉన్న 10 మంది పోలీసులు ఎవరు? వాళ్ల హోదా ఏమిటి? అనే సమాచారం తీసుకున్నట్లు సమాచారం. ఎన్ కౌంటర్ లో వాడిన మొత్తం వెపన్స్ వివరాలను తెలుసుకుంది. సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం చటాన్ పల్లి బ్రిడ్జి వద్దకు ఏ టైమ్​లో వెళ్లారు? ఆరిఫ్, చెన్నకేశవులుకు ఎస్కార్ట్ గా ఎవరున్నారో ఆరా తీసినట్టు సమాచారం.

పోలీసుల ఆరోపణలపై అనుమానాలు

ఎస్సై, కానిస్టేబుల్ ను విడివిడిగా విచారించిన కమిషన్​ సభ్యులు.. ఫోన్, వాచ్, పవర్ బ్యాంక్ పాతి పెట్టిన చోట గన్స్ లాక్కున్నారన్న పోలీసుల ఆరోపణలపైనా అనేక అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. 10 మంది పోలీసులు బందోబస్తు ఉండగా నిరాయుధులైన నిందితులు ఎలా ఎటాక్ చేయగలరు? వారిని అడ్డుకోవడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారనే ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. పోలీసులపై కాల్పులు జరిపారని చెబుతున్న లారీ డ్రైవర్లకు వెపన్ షూటింగ్ తెలుసా? అని ప్రశ్నించినట్లు సమాచారం. నిందితులు లాక్కున్నారని చెబుతున్న గన్స్ ఎవరివి, ఆ టైమ్​లో ఎస్సై, కానిస్టేబుల్ ఎక్కడ ఉన్నారో వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇద్దరికి తగిలిన గాయాలను పరిశీలించి డాక్టర్ల వివరణ తీసుకున్నట్టు తెలిసింది.