మహావిష్ణువు అవతారంలో లక్ష్మీనారసింహుడు

  • తొమ్మిదో రోజు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక  బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీమహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై యాదాద్రీశుడు ప్రధానాలయ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.శ్రీమహావిష్ణువు అలంకార సేవతో బ్రహ్మోత్సవాలు  ముగిశాయని ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు తెలిపారు.  ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్, ఏఈవోలు గజవెల్లి రఘు, రామ్మోహన్, సూపరింటెండెంట్లు దొమ్మాట సురేందర్ రెడ్డి, వాసం వెంకటేశ్, ఆలయ సిబ్బంది, భక్తులు  పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాలలో భాగంగా కొండపైన నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ధార్మిక, సంగీత, సాహిత్య మహాసభలు భక్తులను విశేషంగా అలరించాయి. శబరిగిరీశా అయ్యప్ప భక్తబృందం, శివరామకృష్ణ భజన మండలి, భాగ్యలక్ష్మి మహిళా భజన మండలి బృందం సభ్యులు చేసిన భజన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం వెంపరాల వేంకటలక్ష్మీ శ్రీనివాసమూర్తి చేసిన 'శ్రీమత్ భాగవతాంర్గత నృసింహతత్వం' ఉపన్యాసం.. శారద భాగవతారిణి చేసిన 'ధృవచరిత్ర' హరికథాగానం వీక్షకులను కట్టిపడేసింది.

కొండపైన, కింద ఫ్రీ మెడికల్ క్యాంప్

బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరిగుట్ట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హైదరాబాద్ కొత్తపేటకు చెందిన సాయిసంజీవని హాస్పిటల్ ఆధ్వర్యంలో.. కొండపైన, కింద ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. కొండపైన ఆలయ ప్రధాన కార్యాలయం వద్ద.. కొండ కింద కల్యాణకట్ట, కొత్త బస్టాండ్ వద్ద ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఈ ఫ్రీ మెడికల్ క్యాంపుల ద్వారా భక్తులకు పలు రకాల పరీక్షలు చేసి అవసరమైన వారికి టాబ్లెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.