- జపనీస్ సంస్థను వరించినప్రతిష్టాత్మక అవార్డు
- అణుబాంబులకు వ్యతిరేకంగాపోరాడుతున్నందుకు గుర్తింపు
- హిరోషిమా, నాగసాకి బాధితులతో ఏర్పాటైన సంస్థ
స్టాక్ హోమ్: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి జపాన్ కు చెందిన సంస్థ ‘నిహాన్ హిడాంక్యో’ను వరించింది. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి గాను ఆ సంస్థకు నోబెల్ దక్కింది. హిరోషిమా, నాగసాకికి చెందిన అణుదాడి బాధితులతో ఏర్పాటైన ఈ సంస్థ.. గత కొన్ని దశాబ్దాలుగా అణ్వాయుధాలపై పోరు చేస్తున్నది. ‘‘హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణుదాడిలో ప్రాణాలతో బయటపడిన బాధితులు శారీరకంగా, మానసికంగా బాధపడుతున్నారు. అయినప్పటికీ వాళ్లు అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తమలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని వాళ్ల అనుభవాలను వివరిస్తున్నారు. అణ్వాయుధ రహిత ప్రపంచం, శాంతి కోసం కృషి చేస్తున్నందుకు వాళ్లను గౌరవించాలని, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని నిర్ణయించాం” అని నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. వివరించలేని వాటిని వివరించేందుకు, అసలు ఆలోచించలేని వాటి గురించి ఆలోచించేందుకు, అణ్వాయుధాల వల్ల కలిగే నొప్పి, బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి వాళ్లందరూ తమకు సాయం చేస్తున్నారని పేర్కొంది. తమ అనుభవాలను వివరిస్తూ, క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ అణ్వాయుధాల వల్ల కలిగే వినాశనంపై అవగాహన కల్పిస్తూ.. వాటిని వాడొద్దని హెచ్చరిస్తున్నారని తెలిపింది. ‘‘ఇప్పటికే అణ్వాయుధాలు కలిగిన దేశాలు.. వాటి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. కొన్ని దేశాలు కొత్తగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల్లో అణ్వాయుధాలను ఉపయోగిస్తామని ఆయా దేశాలు బెదిరింపులకు దిగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అణ్వాయుధాల వల్ల జరిగే వినాశనాన్ని మనమందరం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది” అని పేర్కొంది.
సంస్థ ప్రెసిడెంట్ భావోద్వేగం..
నిహాన్ హిడాంక్యో సంస్థలోని లీడర్లు, సభ్యులందరూ హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణుదాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వాళ్లే. ఈ సంస్థ జపాన్ లోని మొత్తం 47 రాష్ట్రాల్లో పని చేస్తున్నది. తమ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని తెలియగానే ప్రెసిడెంట్ తొషియుకి మిమాకి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఇది నిజమేనా? నమ్మలేకపోతున్నాను’ అంటూ ఆనందబాష్పాలు రాల్చారు. నిహాన్ హిడాంక్యోకు నోబెల్ శాంతి బహుమతి మెడల్ తోపాటు రూ.8.40 కోట్ల నగదు దక్కనుంది. కాగా, అణ్వాయుధాలపై పోరాటం చేసిన వ్యక్తులకు, సంస్థలకు నోబెల్ కమిటీ గతంలో కూడా శాంతి బహుమతి ఇచ్చింది. 2017లో ‘ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్’ సంస్థకు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కింది. 1995లో జోసెఫ్ రోట్ బ్లాట్, ఆయన నెలకొల్పిన సంస్థ ‘పగ్ వాష్ కాన్ఫరెన్సెస్ ఆన్ సైన్స్ అండ్ వరల్డ్ అఫైర్స్’కు సంయుక్తంగా అవార్డు లభించింది.