చండూరు, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీ సంఖ్య పెరిగేలా వైద్యులు కృషి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. మంగళవారం నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. మున్సిపాలిటీలోని బీసీ బాలుర వసతి గృహం, ప్రభుత్వ హాస్పిటల్స్ ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో బాలికల మూత్రశాలలకు ఇబ్బంది ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే ఎస్ డీఎఫ్ నిధులతో రేపటి నుండే పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అనంతరం చండూరు ఆర్డీవో కార్యాలయంలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వసతి గృహాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.చండూరు రెవెన్యూ డివిజన్ అయినందున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా చూడాలని అధికారులకు వివరించారు. సమావేశంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి అడిషనల్కలెక్టర్ టి.పూర్ణచంద్ర, జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఈఈ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.