మూడు వేర్వేరు ఘటనల్లో 9 మంది మృతి
చనిపోయిన వారిలో ఇద్దరు స్టూడెంట్లు
తీవ్రంగా గాయపడిన మరో నలుగురు
కాలిఫోర్నియా : అమెరికాలో తుపాకీ కాల్పుల మోత ఆగడం లేదు. కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బేలో 48 గంటల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఐయోవాలోని డెస్ మొయినిస్లోని యూత్ సెంటర్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు స్టూడెంట్లు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలో మూడు రోజుల్లో ఇది ఐదో కాల్పుల ఘటన. మూడు రోజుల క్రితం కాలిఫోర్నియాలోని చైనా న్యూఇయర్ వేడుకల్లో 72 ఏండ్ల వ్యక్తి జరిపిన కాల్పుల్లో 11 మంది చనిపోయారు. అలాగే సోమవారం షికాగోలో ఇద్దరు తెలుగు స్టూడెంట్లపై జరిపిన కాల్పుల్లో విజయవాడకు చెందిన దేవాన్ష్ చనిపోగా.. సంగారెడ్డికి చెందిన సాయిచరణ్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఫామ్లో తోటి వర్కర్లపై..
కాలిఫోర్నియాలోని కోస్టల్ సిటీ హాప్మూన్ బేలోని ఫామ్లో 67 ఏండ్ల షాచున్లి అనే వ్యక్తి తోటి వర్కర్లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. ఒకరు గాయపడ్డారు. కాల్పుల తర్వాత నిందితుడు కారులో పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని కారులో కాల్పులకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. హాప్ మూన్ బే సిటీకి కొద్ది మైళ్ల దూరంలో జరిగిన మరో ఘటనలో ముగ్గురు చనిపోయారు.
యూత్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో..
ఐయోవాలోని డెస్ మొయినిస్లో జరిగిన మూడో కాల్పుల ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పక్కదోవ పట్టిన యువతను సరైన దారిలో నడిపించేందుకు స్టార్ట్ రైట్ హియర్అనే స్వచ్చంద సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇలాంటి ప్రోగ్రాంలోనే కాల్పులు జరిగాయి. చనిపోయిన ఇద్దరూ టీనేజర్లే. స్టార్ట్ రైట్ హియర్ సీఈవో విలియం హోమ్స్(49) పరిస్థితి సీరియస్గా ఉంది. ప్రత్యక్షసాక్షుల సమాచారం ఆధారంగా ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.