- 1.05 కోట్ల మంది ఈజీఎస్ కూలీల్లో.. 60.91 లక్షల మందే యాక్టివ్ వర్కర్స్
- వ్యవసాయ పనులకు వెళ్లినా రోజుకు రూ.400.. ఉపాధి పనుల్లో కేవలం రూ.164
- ఏండ్లుగా పనులకు రానివారి జాబ్ కార్డుల రద్దుకు చర్యలు
- కొత్త మున్సిపాలిటీల్లో తండాలు, పల్లెల విలీనంతో 18 లక్షల మంది ఉపాధికి దూరం
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. డిమాండ్ కు తగినట్లుగా పనులు కల్పించకపోవడం, రోజుకు ప్రభుత్వం నిర్ణయించిన కూలీ డబ్బులు గిట్టుబాటు కావడం లేదు. దీంతో గ్రామాల్లో చాలామంది ఈ పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.05 కోట్ల మంది ఉపాధి కూలీలు ఉండగా.. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే యాక్టివ్ వర్కర్స్ 60.91 లక్షల మందే ఉన్నారు. జాబ్ కార్డులు కలిగి ఉన్నప్పటికీ 44.57 లక్షల మంది కూలీలు పనులకు హాజరు కావడం లేదు. అంటే ప్రతి 100 మంది కూలీల్లో 43 మంది ఉపాధి హామీ పనులకు వెళ్లడం లేదు.
సొంత ఆదాయం కంటే ‘ఉపాధి’ వేతనం తక్కువైంది
ఉపాధి హామీ స్కీమ్ ప్రారంభమైన తొలినాళ్లలో గ్రామాల్లో వివిధ చిరువ్యాపారాలు చేసే వ్యక్తులు, పెద్ద రైతులు, ఇతర స్వయం ఉపాధి పనుల్లో ఉన్నవారు కూడా జాబ్ కార్డులు పొందారు. వారికి సొంత పనుల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే.. ఉపాధి హామీ పనులకు వెళ్తే లభించే వేతనం తక్కువైంది. దీంతో వారు ఆ పనులకు వెళ్లడం లేదు. ఇలా జాబ్ కార్డు తీసుకొని ఏళ్ల తరబడి పనులకు హాజరు కాని వారికి ఆ కార్డులతో ఉపయోగం లేదని భావించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ , వాటిని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టింది. బోగస్ ఉపాధి హామీ కార్డులను అరికట్టేందుకు జాబ్ కార్డులతో ఆధార్ సీడింగ్ చేపట్టింది. ఫిబ్రవరి 1 నుంచి ఉపాధి కూలీలకు ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టం(ఏబీపీఎస్) ద్వారా కూలి డబ్బులు చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నాటికి 1.05 కోట్ల మంది ఉపాధి కూలీలకు గాను 81.93 లక్షల మంది కూలీల ఆధార్ సీడింగ్ ను పూర్తి చేసి అథెంటికేషన్ కోసం పంపారు. వీరిలో 66 లక్షల మంది ఆధార్ ఆథెంటికేషన్ ఇప్పటికే పూర్తికాగా, 15 లక్షల మంది కూలీల ఆధార్ అథెంటికేషన్ ఫెయిలైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టం(ఏబీపీఎస్)కు అర్హత కలిగిన కూలీల సంఖ్య 61.85 లక్షలు. ఆధార్ సీడింగ్ కాకపోతే కూలి పనులకు వెళ్లినా డబ్బులు జమ కావు. ఉపాధిహామీ వర్కర్లలో మరో 44 లక్షల మంది జాబ్ కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాల్సి ఉంది. ఆధార్ తో లింక్ కాని వారి జాబ్ కార్డులను రద్దు చేసే చాన్స్ ఉంది.
నాలుగేళ్లలో 6 లక్షల జాబ్ కార్డులు కట్
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 1.24 కోట్ల మంది ఉపాధి కూలీలు, 61.75 లక్షల జాబ్ కార్డులు ఉండేవి. 2019 నాటికి జాబ్ కార్డుల సంఖ్య 55.69 లక్షలకు చేరింది. అంటే నాలుగేళ్లలో 6 లక్షల జాబ్ కార్డులను ప్రభుత్వం తొలగించింది. 2018 ఆగస్టులో మేజర్ గ్రామపంచాయతీలుగా ఉన్న 59 స్థానిక సంస్థలను, 2019లో మరో 13 మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేశారు. మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు చాలాచోట్ల జనాభా సరైనంతగా లేకపోవడంతో సమీపంలోని గ్రామాలు, తండాలు, పల్లెలను విలీనం చేశారు. దీంతో మేజర్ గ్రామపంచాయతీలు, విలీన గ్రామాలకు చెందిన సుమారు 18 లక్షల మంది కూలీలు ఒక్కసారిగా ఉపాధి హామీ పనులకు దూరమయ్యారు. 2019 వరకు రాష్ట్రంలో 1.23 కోట్ల మంది ఉపాధి కూలీలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1.05 కోట్లకు చేరింది.
ఆ మూడు జిల్లాల్లో..
నల్లగొండ జిల్లాలో 2019లో 9.04 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 7.59 లక్షలకు పడిపోయింది. ఈ ఒక్క జిల్లాలోనే లక్షన్నర మంది కూలీలు ఉపాధి హామీ పనులకు దూరమయ్యారు. కరీంనగర్ జిల్లాలో మూడేళ్ల కిందట 3.21 లక్షల మంది ఉపాధి కూలీలు ఉండగా, ఆ సంఖ్య ఇప్పుడు 2.31 లక్షలకు డౌన్ అయింది. ఈ జిల్లాలో 90 వేల మంది ఉపాధిహామీ పనులకు దూరమయ్యారు. ఇదేకాలంలో ఖమ్మం జిల్లాలో ఉపాధిహామీ కూలీల సంఖ్య 7.07 లక్షల నుంచి 6.44 లక్షలకు, సూర్యాపేట జిల్లాలో 6.32 లక్షల నుంచి 5.78 లక్షలకు పడిపోయింది.
22 వేల మందికే వంద రోజుల పని
రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది యాక్టివ్ ఉపాధిహామీ కూలీలు ఉంటే.. వారందరికీ పనులు కల్పించడం లేదు. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలని చట్టం చెబుతున్నా ఆ స్థాయిలో పనులు కల్పించలేకపోతున్నారు. 2019- – 2020 ఫైనాన్షియల్ ఇయర్ లో 60 లక్షల కుటుంబాల్లో 1.75 లక్షల కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని చూపించారు. కరోనా, లాక్ డౌన్ సమయాల్లో 2020 -– 21లో అత్యధికంగా 3.42 లక్షల మంది, 2021–-22లో 3.28 లక్షల మంది వంద రోజుల పనిని పొందారు. గత రెండేళ్లలో 5 శాతం మంది కూలీలకే 100 రోజుల పని దొరికింది. మరో నెల రోజుల్లో ముగి యనున్న ఈ ఆర్థిక సంవత్సరం (2022–23)లో రాష్ట్రంలో ఎన్నడూ లేనంత తక్కువగా 22,680 మందికి మాత్రమే 100 రోజుల పనిని కల్పించడం గమనార్హం.
వ్యవసాయ పనులకు వెళ్తేనే ఎక్కువ వేతనం..
ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనాన్ని రూ.257 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక్కో కూలీకి రోజువారీ సగటు వేతనం రూ.164కు మించలేదు. గత సంవత్సరం సగటు వేతనం రూ.172 వరకు వచ్చింది. ఇతర వ్యవసాయ పనులకు వెళ్తే రూ.400 నుంచి రూ.600 వరకు జీతం వస్తోందని, ఉపాధి కూలి పనులకు వెళ్తే కొన్నిచోట్ల రూ.100 నుంచి రూ.150 మాత్రమే వస్తున్నాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలి డబ్బులు నెలలు గడిచినా అకౌంట్లలో జమ కాకపోవడంతో వాటిపై ఆసక్తి చూపడం లేదు.