- ఇద్దరు మాజీలు.. డాక్టర్లు
- స్థానికత.. సామాజిక వర్గం
- ఎమ్మెల్యే అభ్యర్థులమంటూ ముందస్తు ప్రచారం
- సామాజిక కార్యక్రమాలే ఆయుధం
- బీఆర్ఎస్ను ఓడించడమే టార్గెట్
కోల్‌బెల్ట్, వెలుగు : ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గమైన చెన్నూరులో కాంగ్రెస్ టికెట్ కోరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన లీడర్లతో పాటు పలువురు సెకండ్క్యాడర్ లీడర్లు, రెడీ అవుతున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతూ హైకమాండ్ దృష్టిలో పడేందుకు తంటాలు పడుతున్నారు.
చెన్నూరులో ఎలాగైనా గెలవాలని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అనూహ్యంగా ఓదెలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సోత్కు సంజీవ రావుతో పాటు సీనియర్ లీడర్ సోత్కు సుదర్శన్, డాక్టర్ దాసారపు శ్రీనివాస్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నూకల రమేశ్పేరును మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు అధిష్టానం పెద్దల వద్దకు తీసుకెళ్లారు. సింగరేణి డాక్టర్రాజా రమేశ్ వృత్తికి రాజీనామా చేసి ఖమ్మంలో రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు.
మంచిర్యాలకు చెందిన రియల్టర్ దుర్గం అశోక్, సింగరేణి డిస్మిస్ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న రామిల్ల రాధిక, బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన దుర్గం నరేశ్‌తో పాటు సింగరేణి ఉద్యోగులు, కుల సంఘాల బాధ్యులు మరికొందరు కాంగ్రెస్ టికెట్ఆశిస్తున్నారు. సింగరేణి డాక్టర్ రాజారమేశ్, దుర్గం అశోక్, డాక్టర్దాసారాపు శ్రీనివాస్ జోరుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని నెలలుగా మందమర్రికి చెందిన పీసీసీ మెంబర్నూకల రమేశ్నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు.
సామాజిక వర్గంపై ఆశలు…
చెన్నూరులో మొదటి నుంచి మాల, మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు గెలుపొందుతున్నారు. కాంగ్రెస్ గత ఎన్నికల్లో నేతకాని కులస్తుడైన బోర్లకుంట వెంకటేశ్‌నేతకు టికెట్ కేటాయిచింది. బెల్లంపల్లి నుంచి ఈ సారి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే టికెట్దక్కే ఛాన్స్ఉండటంతో చెన్నూరు నుంచి మాదిగ లేదా నేతకాని సామాజిక వర్గానికి కేటాయిస్తారని భావిస్తున్నారు. ఆశావహులందరూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. చెన్నూరులో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఇతర పార్టీల్లో ఉన్న సీనియర్ నేతలను, పార్టీని వీడి వెళ్లిన వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ విధానాలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీని విడిచివెళ్లేందుకు సిద్దంగా ఉన్న లీడర్లు, క్యాడర్‌ను గుర్తించి కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.